Chandrababu AI Calls: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్( artificial intelligence).. ఇటీవల కాలంలో విపరీతంగా వినిపిస్తున్న పేరు ఇది. దీని ద్వారా అద్భుతాలు కూడా సృష్టిస్తున్నారు. ఉన్నవి లేనట్టుగా.. లేనివి ఉన్నట్టుగా ఇట్టే మార్చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ను సైతం కొందరు కేటుగాళ్లు తమ మోసాలకు వినియోగించుకుంటున్నారు. తాజాగా ఒక వ్యక్తి ఏఐ సాయంతో టిడిపి నేతలను బురిడీ కొట్టించాడు. ఏకంగా సీఎం చంద్రబాబు, మాజీమంత్రి దేవినేని ఉమా పేర్లను వాడుకొని.. తెలంగాణ టిడిపి నేతల నుంచి డబ్బులు వసూలు చేశాడు.
* మాజీ మంత్రి ఉమా పేరిట..
ఖమ్మం జిల్లాలో( Khammam District) టిడిపికి ఇప్పటికీ పట్టు ఉంది. క్షేత్రస్థాయిలో కార్యకర్తల బలం ఉంది. ఈ క్రమంలో గత నెల 30న ఓ వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. తాను మాజీ మంత్రి దేవినేని ఉమా పీఏనని పరిచయం చేసుకున్నాడు. టిడిపి నేతలు కూడా నిజమేనని నమ్మారు. సార్ వీడియో కాల్ చేస్తున్నారంటూ వారిని నమ్మించాడు. కొద్దిసేపు ఆగిన తర్వాత అదే వ్యక్తి దేవినేని ఉమాల ఏఐ సాయంతో వీడియో కాల్ చేశాడు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్తల పిల్లల చదువుల కోసం డబ్బులు ఇవ్వాలని కోరాడు. మూడు మొబైల్ నంబర్లు పెట్టి ఫోన్ పే చేయాలని కోరాడు. ఏకంగా మాజీ మంత్రి అడగడంతో వారు 35 వేల రూపాయలు పంపించారు.
* ఈసారి చంద్రబాబు పేరుతో..
అయితే ఈ నెల 7న మరోసారి మాజీ మంత్రి దేవినేని ఉమా( devineni Uma Maheshwar Rao) పేరుతో మళ్లీ అదే వ్యక్తి సత్తుపల్లి టిడిపి నేతలకు వీడియో కాల్ చేశాడు. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతుండడంతో మీకు బీఫామ్ ఇప్పిస్తానంటూ మాయ మాటలు చెప్పాడు. ఏకంగా చంద్రబాబు పేరు చెప్పి బుట్టలో వేసుకున్నాడు. మీతో నేరుగా చంద్రబాబు మాట్లాడతారు అంటూ చెప్పుకొచ్చాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో కొద్దిసేపటి తర్వాత వీడియో కాల్ చేసి.. అచ్చం సీఎం చంద్రబాబు మాదిరిగానే వీడియో కాల్ లో మాట్లాడాడు. అటు తర్వాత మళ్లీ ఫోన్ చేసి మీరంతా విజయవాడ వస్తే అమరావతికి తీసుకెళ్తానని నమ్మబలికాడు. విజయవాడలో ఓ హోటల్ కూడా బుక్ చేశాడు. అయితే అమరావతి వెళ్లేందుకు కేవలం కొద్ది మందికి మాత్రమే అనుమతి ఉందని.. ఒక్కొక్కరు పదివేల రూపాయలు చెల్లిస్తే చంద్రబాబును కలిపే ప్రయత్నం చేస్తానని చెప్పుకొచ్చాడు. దీంతో వారికి అనుమానం ప్రారంభమైంది. మరోవైపు హోటల్ లో బిల్లు విషయంలో సిబ్బందితో టీడీపీ నేతలకు గొడవ ఏర్పడింది. పోలీసులు రాగా.. మాజీ మంత్రి దేవినేని ఉమా రమ్మంటే వచ్చామని వారు చెప్పారు. వెంటనే పోలీసులు దేవినేని ఉమా కు ఫోన్ చేయగా ఆయన ఆశ్చర్యపోయారు. తాను ఎవరికి ఫోన్ చేయలేదని చెప్పడంతో టిడిపి నేతలు మోసపోయామని గ్రహించారు. పోలీసులు దర్యాప్తులో ఏఐ సాయంతో ఏలూరు జిల్లాకు చెందిన భార్గవ్ అనే వ్యక్తి ఇలా టిడిపి నేతలను మోసం చేసినట్లు తేలింది. అయితే దీనిపై ఫిర్యాదు చేస్తే పరువు పోతుందని గ్రహించిన టిడిపి నేతలు హోటల్ బిల్ కట్టి వెళ్లిపోయారు.