Jagan Narsipatnam Tour: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) అధినేత నర్సీపట్నంలో పర్యటించారు. విశాఖ ఏర్పాటు నుంచి రోడ్డు మార్గం గుండా నర్సీపట్నం చేరుకున్నారు. జగన్ పర్యటన భారీగా సక్సెస్ అయిందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. జనాలు స్వచ్ఛందంగా తరలివచ్చారని వారు చెప్పుకొస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో గ్రౌండ్ రిపోర్ట్ మాత్రం వేరేలా ఉంది. ఎక్కడికక్కడే జన సమీకరణ చేసినా.. ఆశించిన స్థాయిలో జనం రాలేదన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో జనాలు అయితే దారి పొడవునా కనిపించారు. కానీ తాము ఆశించిన స్థాయిలో రాకపోవడంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల్లో ఒక రకమైన ఆందోళన ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. అయితే ఎంతో ప్రణాళికతో రూపొందించిన ఈ పర్యటన వ్యూహం.. చివరి నిమిషంలో దెబ్బ కొట్టినట్లు తెలుస్తోంది. జగన్ మీడియాతో మాట్లాడిన క్రమంలో కొన్ని తప్పులు దొర్లాయి. అవే ఇప్పుడు సోషల్ మీడియాలో హైలెట్ అవుతున్నాయి.
* ప్రైవేటు భాగస్వామ్యంతో..
వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల( government medical colleges) ఏర్పాటుకు నిర్ణయించింది. వాటికి శంకుస్థాపన కూడా చేసింది. అయితే కొన్నింటి పనులు జరగగా.. మరికొన్ని పునాదుల స్థాయిలో నిలిచిపోయాయి. ఇంకొన్ని మొండి గోడలతో దర్శనమిస్తున్నాయి. అయితే ఐదేళ్ల వైసిపి పాలనలో ఈ మెడికల్ కాలేజీల నిర్మాణం జరగలేదు. కేటాయించిన నిధులు సరిగ్గా మంజూరు కాలేదు. మరోసారి ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే ప్రైవేటు భాగస్వామ్యం, ప్రభుత్వ పర్యవేక్షణలో నిర్మాణాలు జరపాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అది మొదలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన ప్రారంభించింది. నేరుగా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి రంగంలోకి దిగారు.
* రెండేళ్లు ఏం చేసినట్టు?
నర్సీపట్నం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు స్పీకర్ అయ్యన్నపాత్రుడు( speaker ayyana patrudu ) . ఇటీవల మెడికల్ కాలేజీల విషయంపై ఆయన సవాల్ చేశారు. ఆ సవాల్ స్వీకరించి జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నం వచ్చారు. తొలుత జగన్ రోడ్డు మార్గం గుండా పర్యటనకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. తరువాత షరతులతో కూడిన అనుమతులు మంజూరు చేశారు. అయితే జగన్ పర్యటన విజయవంతం అయ్యిందా? లేదా? అనే విషయం పక్కన పెడితే జగన్ ప్రకటన మాత్రం ఇప్పుడు ఇబ్బంది పెడుతోంది. చేతిలో ఒక పేపర్ పెట్టుకొని.. మెడికల్ కాలేజీ నిర్మితం అయి ఉంటే ఈ స్థాయిలో ఉండేదని.. పేద విద్యార్థులకు మెడికల్ సీట్లు దొరికేవని.. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందేవని చెప్పుకొచ్చారు. తాను 2022 డిసెంబర్ 30న ఈ మెడికల్ కాలేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన విషయాన్ని ప్రస్తావించారు. ఇప్పుడు ఇదే హైలెట్ అవుతోంది. జగన్ 2024 మే వరకు అధికారంలో ఉన్నారు. మరి రెండు సంవత్సరాల పాటు ఏం చేశారని సోషల్ మీడియా వేదికగా ఎక్కువ మంది ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి అయితే జగన్ ఏదో చెప్పాలని.. ఏదో చెప్పి.. ఇరకాటంలో పడ్డారు.