YSR Congress Interesting discussion : వైఎస్ఆర్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ నిర్వహించిన వెన్నుపోటు దినం సక్సెస్ అయ్యిందా? రాష్ట్రవ్యాప్తంగా నేతలంతా పాల్గొన్నారా? క్యాడర్ పూర్తిస్థాయిలో హాజరైందా? అంటే మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అన్నమాట వినిపిస్తోంది. క్షేత్రస్థాయిలో మాత్రం కార్యక్రమం ఫెయిల్ అయిందని ప్రచారం జరుగుతోంది. పార్టీలో కీలక నేతలు ముఖం చాటేసారని తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో కార్యక్రమం నిర్వహణపై కొంతమంది నేతలు పెద్దగా ఆసక్తి చూపలేదు అన్న విమర్శలు వచ్చాయి. కొన్నిచోట్ల ఏదో మొక్కుబడి తంతుగా ముగించారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. తాజా మాజీ మంత్రులు, సీనియర్ నాయకులు పెద్దగా హాజరు కాలేదని తెలుస్తోంది. కార్యక్రమాన్ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కానీ అందుకు తగ్గట్టు విజయవంతం కాలేదని తెలుస్తోంది.
* కనిపించని కీలక నేతలు
కూటమి( Alliance ) అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్న తరుణంలో.. సంక్షేమ పథకాలు అమలు చేయలేదని చెబుతూ.. వెన్నుపోటు దినం నిర్వహించాలని జగన్మోహన్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రాష్ట్రస్థాయిలో నిర్వహణ బాధ్యతలను సమన్వయం చేసుకునే భారం సజ్జల రామకృష్ణారెడ్డికి ఇచ్చారు. ఆయన అన్ని జిల్లాల పార్టీల నాయకత్వాలతో మాట్లాడారు. అధినేత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని.. నేతలంతా హాజరు కావాలని పిలుపునిచ్చారు. అయితే మాజీ మంత్రులు బొత్స, అంబటి రాంబాబు, జోగి రమేష్, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం వంటి కొద్దిమంది నేతలు మాత్రమే ఈ కార్యక్రమాన్ని సీరియస్ గా తీసుకున్నారని తెలుస్తోంది. మరోవైపు అధినేత జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి, వై వి సుబ్బారెడ్డి, మిధున్ రెడ్డి వంటి ముఖ్య నేతలు కూడా ఎక్కడా కనిపించలేదు.
Also Read : వైసీపీలో లోపిస్తున్న ‘కమ్మ’దనం.. ఆ వర్గం నేతలంతా సైలెంట్!
* పార్టీ అధినేత తీరుపై..
అయితే పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy) వైఖరిపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఆయన వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమాల్లో పాల్గొనలేదు. దీంతో అధినేత లేకుండా నిరసన కార్యక్రమాలు ఏంటనే ప్రశ్న వినిపిస్తోంది. అధినేత పాల్గొని ఉంటే ఒక ఊపు వచ్చేదని.. కానీ ఆయన పిలుపు ఇచ్చి పాల్గొనకపోవడం ఏమిటనేది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల నుంచి వినిపిస్తున్న మాట. మరోవైపు వెన్నుపోటు దినంపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ క్షేత్రస్థాయికి వచ్చేసరికి పార్టీ శ్రేణులు పెద్దగా ఆసక్తి చూపలేదు. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది మాత్రమే అవుతోంది. ఇంత తక్కువ సమయం ఇచ్చి.. కూటమి వైఫల్యాలపై పోరాడడం దూకుడు చర్య అవుతుందని కొంతమంది నేతలు అభిప్రాయపడ్డారు.
* పార్టీ శ్రేణుల్లో నిరాశ..
ఐదేళ్లపాటు పదవులు అనుభవించిన వారు.. ఆర్థికంగా లబ్ధి పొందిన వారు ఈ కార్యక్రమానికి ముఖం చాటేయడంపై పార్టీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. అధినేతతో సహా పెద్ద నేతలు ఎవరూ కార్యక్రమానికి హాజరు కాకపోవడంతో కార్యకర్తలు నిరుత్సాహానికి గురయ్యారు. మరోవైపు కార్యక్రమం నిర్వహించిన చోట కూడా కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేసేందుకు చాలామంది నేతలు వెనుకడుగు వేశారన్న విమర్శలు ఉన్నాయి. కొన్నిచోట్ల యువత నుంచి మంచి స్పందన వచ్చింది. కానీ పార్టీ పరంగా వినియోగించుకోలేకపోయారన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అయితే ప్రభుత్వ హిట్ లిస్ట్ లో ఉన్న చాలామంది నేతలు ముఖం చాట్ చేయడం విశేషం.