Vemuri RK Comments: ఇప్పటివరకు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్సిపి మాత్రమే పని చేస్తోంది. ఇప్పుడు ఈ జాబితాలో ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ కూడా చేరిపోయినట్టు కనిపిస్తోంది. ఎందుకంటే ఆయన ఆదివారం రాసిన కొత్త పలుకులో జగన్మోహన్ రెడ్డిని పొగిడారు. మామూలుగా కాదు ఒక రేంజ్ లో.. ఇదే సమయంలో కూటమి ప్రభుత్వంలో ఏర్పడుతున్న వివాదాలను.. టిడిపి నిర్లక్ష్యాన్ని దారుణంగా ఎటు చూపించారు.
తెలుగుదేశం పార్టీ డిఎన్ఏ లోనే పిరికితనం ఉందని రాధాకృష్ణ స్పష్టం చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బలమైన ఉద్యమాలు చేయలేదని.. బలమైన ఉద్యమాలు నిర్వహించాలంటే ఆ పార్టీకి భయం ఉంటుందని.. ఇప్పుడు అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా ప్రతిపక్ష హోదాను కూడా దక్కించుకోలేని పార్టీని నిలువరించలేకపోతుందని రాధాకృష్ణ ఆక్షేపించారు. యంత్రాంగం మీద చంద్రబాబుకు పట్టు రాలేదని.. అందువల్లే అధికారులు ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టుగా నడుచుకోలేకపోతున్నారని రాధాకృష్ణ కుండబద్దలు కొట్టారు. కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు.. మంత్రులు.. జగన్ పర్యటిస్తున్న ప్రాంతాలలో తమదైన మార్క్ రాజకీయం చేయలేకపోతున్నారని.. కనీసం జగన్ విమర్శలను తిప్పి కొట్టలేకపోతున్నారని రాధాకృష్ణ తన కొత్త పలుకులో రాశారు. అంతేకాదు జగన్ నిర్వహించే ప్రతి సభకు జనం భారీగా వస్తున్నారని.. 2024కు ముందు తెలుగుదేశం పార్టీ అధినేత సభ నిర్వహిస్తే ఈ స్థాయిలో జనం రాలేదని.. ఇది దేనికి సంకేతమో గుర్తుకు తెచ్చుకోవాలని టిడిపి నాయకులను ఉద్దేశించి ఆర్కే ఆ వ్యాఖ్యలు చేశారు.
రాధాకృష్ణ కొత్త పలుకులో రాసిన వ్యాఖ్యలను వైసీపీ నాయకులు సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. ” 11 సీట్లు వచ్చాయని తెగ తిట్టారు. దారుణంగా విమర్శలు చేశారు. ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో విష ప్రచారం చేశారు. ఇప్పుడు మీ సొంత పార్టీ ఛానల్ మా గురించి చెబుతోంది. జగన్ గురించి చెబుతోంది. మీ ఆస్థాన పాత్రికేయుడు వేమూరి రాధాకృష్ణ కుండబద్దలు కొట్టాడు. మీ పార్టీ డిఎన్ఏ లోనే పిరికితనం ఉందని స్పష్టం చేశాడు. పిరికితనమున్న మీకు రాజకీయాలు ఎందుకు? ప్రతిపక్ష హోదా కూడా లేని జగన్ సభలు పెడితే భారీగా జనం వస్తున్నారు.. 2024 ముందు చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఉన్నప్పటికీ జనం ఇంత రాలేదని మీ పత్రిక యజమాని చెబుతున్నాడు. దీనిని బట్టి జగన్ స్టామినా ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికైనా విమర్శలు మానేయండి. పరిపాలన మీద దృష్టి పెట్టండి. ప్రతీకార రాజకీయాలకు పలకండి. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయండి” అంటూ వైసిపి నాయకులు హితవు పలుకుతున్నారు. అంతేకాదు సోషల్ మీడియాలో రాధాకృష్ణ కొత్త పలుకు సంబంధించిన వీడియోను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. తమ ఇంటి పత్రిక యజమాని ఇలాంటి రాతలు రాయడంతో టిడిపి నాయకులు బయటికి సమాధానం చెప్పు లేకపోతున్నారు. లోలోపల మదన పడుతున్నారు.