Vemuri Radha Krishna: మనం మొన్ననే చెప్పుకున్నాం కదా.. తెలుగు నాట రామోజీరావు గతించిన తర్వాత.. సుప్రసిద్ధ జర్నలిస్టుగా అవతరించే అవకాశం వేమూరి రాధాకృష్ణకు దక్కిందని.. అందుకే తన ఆంధ్రజ్యోతికి బద్దలు కట్టి నిలబెట్టేందుకు ఆయన ప్రయత్నిస్తున్నాడని.. అందువల్లే ప్రత్యేక విమానంలో చక్కర్లు కొడుతూ జిల్లాలు తిరుగుతున్నాడని.. కానీ ఇక్కడే ఒక ప్రశ్న.. ఆంధ్రజ్యోతి ప్రక్షాళన అంత సాధ్యమవుతుందా అని?
పెద్ద తలకాయలకు అప్పగించారు
వేమూరి రాధాకృష్ణ ఏబీఎన్ ఛానల్ పెట్టిన తర్వాత ఆంధ్రజ్యోతి పేపర్ ను సంస్థలోని కొంతమంది పెద్ద తలకాయలకు అప్పగించాడు. ఆ తర్వాత అతడు పూర్తిగా ఛానల్ కు అంకితమయ్యాడు. గతంలో ప్రతిరోజు సాయంత్రం పేపర్ లో వచ్చే బ్యానర్ వార్త నుంచి మొదలు పెడితే.. బాటమ్ స్టోరీ వరకు ప్రతిదీ చర్చించేవాడు. రాత్రి 12 తర్వాతనే ఇంటికి వెళ్లేవాడు. అప్పుడు అంతలా ఫోకస్ పెట్టాడు కాబట్టే ఆంధ్రజ్యోతి దమ్మున్న పత్రిక అనే ట్యాగ్ లైన్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత పత్రిక గట్టిగా నిలబడటం, కొంత రాజకీయంగా సపోర్ట్ లభించడంతో.. వేమూరి రాధాకృష్ణ ఏబీఎన్ ను మొదలుపెట్టాడు. తన కూడా ముఖానికి రంగు వేసుకోవడం ప్రారంభించాడు. ఆ రంగుల లోకం ముందు ఆంధ్రజ్యోతి పత్రిక చిన్నగా అనిపించింది. దీంతో దాని నిర్వహణను గాలికి వదిలేసాడు అని చెప్పలేం గాని.. దూరం పెట్టాడు. దీంతో అందులో పని చేసే పెద్ద తలకాయలు ఎవరికి వారిగా వర్గాలను ఏర్పాటు చేసుకున్నారు. సెంట్రల్ డెస్క్ లో ఒకరి పెత్తనం సాగితే, నవ్య, ఆదివారం అనుబంధం లో మరొకరి పెత్తనం, జిల్లాలలో ఇంకొకరి పెత్తనం.. ఇలా సాగడం మొదలుపెట్టింది.
పది సంవత్సరాలు కష్టకాలాన్ని ఎదుర్కొంది
అయితే ఈ 10 సంవత్సరాలు తెలంగాణలో ఆంధ్రజ్యోతికి కష్ట కాలాన్ని ఎదుర్కొంది అని చెప్పొచ్చు. ఇంతటి ఇబ్బందుల్లోనూ ఆంధ్రజ్యోతి పత్రిక నడిచింది. కొవిడ్ సమయంలో విమర్శలు వచ్చినప్పటికీ.. అంతటి కష్టకాలంలో చాలామంది ఉద్యోగులను తొలగించినప్పటికీ.. ఉన్నవారితోనే ఆంధ్రజ్యోతి నిలబడగలిగింది. అయితే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రజ్యోతికి అనుకూల ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. రేవంత్ ఎలాగూ సొంతవాడే.. చంద్రబాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇలాంటి క్రమంలో పత్రికను మళ్ళీ నిలబెట్టేందుకు రాధాకృష్ణ ప్రయత్నిస్తున్నాడు. గతానికంటే భిన్నంగా జిల్లాలు మొత్తం తిరిగి వస్తున్నాడు. ఇప్పటికే ఆంధ్రలో పర్యటన ముగిసిందని చెబుతున్నారు.. ఇదే సమయంలో కూటమికి వ్యతిరేకంగా రాయొద్దని తాను చెప్పలేదని రాధాకృష్ణ బ్యూరో చీఫ్ లతో వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. ఆధారాలు ఉంటే తప్పనిసరిగా వార్తలు రాయాల్సిందేనని చెప్పినట్టు సమాచారం.
ఏళ్లుగా పాతుకుపోయారు
అయితే ఇక్కడ ఖమ్మం నుంచి మొదలు పెడితే కాకినాడ వరకు ప్రతి జిల్లాలో బ్యూరో చీఫ్ లు పాతుకుపోయారు. బ్రాంచ్ మేనేజర్లు సామంత రాజులుగా జిల్లాలను ఏలుతున్నారు. మేనేజ్మెంట్ చెప్పిన యానివర్సరీ టార్గెట్, ఇయర్లీ టార్గెట్, పేపర్ చందాలు రిపోర్టర్లను ముక్కుపిండి మరీ చేయిస్తున్నారు. మేనేజ్మెంట్ వద్ద ఆ ఘనత మొత్తం తమదేనని చెప్పుకుంటున్నారు. ఇక మేనేజ్మెంట్ కు కూడా కావాల్సింది అదే కావడంతో అటు బ్రాంచ్ మేనేజర్ల విషయంలో, ఇటు బ్యూరో చీఫ్ ల విషయంలో ఏమీ చేయలేని పరిస్థితి. గతంలో ఆంధ్రకు సరిహద్దులో ఉండే తెలంగాణ జిల్లాలో బ్యూరో చీఫ్ కు బదిలీ జరిగింది. అయితే ఆయన ఆ జిల్లాలో పనిచేసే ఓ కీలకమంత్రికి అత్యంత సన్నిహితుడు. పైగా ఆ మంత్రికి వేమూరి రాధాకృష్ణకు అత్యంత దగ్గర సంబంధం ఉంది.. దీంతో ఆయన కల్పించుకొని ఆ బ్యూరో చీఫ్ బదిలీని నిలిపివేయించాడు. ఇది జరిగి కూడా దాదాపు 8 సంవత్సరాల దాకా అవుతోంది.. ఇక స్టాఫర్లు కూడా అదే స్థాయిలో పాతుకుపోయారు. వారిని కదిలించడం కూడా దాదాపు అసాధ్యమేనని తెలుస్తోంది.
ఆ ప్రక్రియ ఆగిపోయింది
సరిగ్గా 7 నెలల క్రితం ఓ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ను బ్యూరోను చేశారు. జిల్లాలో పనిచేస్తున్న బ్యూరోను మరో జిల్లాకు బదిలీ చేశారు. ఇదే తీరుగా స్టాఫర్లను కూడా బదిలీ చేశారు. తెలంగాణలో కీలకమైన రెండు జిల్లాల ఎడిషన్ ఇన్ ఛార్జ్ లను బదిలీ చేశారు. అయితే మిగతా జిల్లాలోనూ చేయడానికి అప్పట్లో ప్రయత్నాలు జరిగినప్పటికీ.. గట్టి రాజకీయ బలం ఎంట్రీ ఇవ్వడంతో ఆ ప్రక్రియ ఆగిపోయినట్టు తెలుస్తోంది. మరోవైపు ఆంధ్రా లోని అన్ని జిల్లాల బ్యూరో చీఫ్ లకు అధికార పార్టీ నేతలతో గట్టి సంబంధాలు ఉన్నాయి. ఎడిషన్ ఇంచార్జీ లకు అదే స్థాయిలో సంబంధాలు ఉన్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో రాధాకృష్ణ ఆంధ్రజ్యోతిని ప్రక్షాళన చేయగలడా అనేది అనుమానంగా ఉంది..
ఎక్స్ టెన్షన్ లో ఎడిటర్
ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె శ్రీనివాస్ ప్రస్తుతం ఎక్స్ టెన్షన్ లో కొనసాగుతున్నారు. ఇటీవల జిల్లాలో మీటింగ్లో ఆయన కనిపించలేదు. నెట్వర్క్ ఇన్చార్జి కూడా దర్శనమీయలేదు. క్వాలిటీ సెల్ ఇంచార్జి, అసిస్టెంట్ ఎడిటర్ వక్క లంక రమణను ఎడిటర్ చేస్తారని ప్రచారం జరుగుతోంది. జిల్లాల మీటింగ్లో వేమూరి రాధాకృష్ణ వెంట వక్కలంక రమణ ఉండడం పై వ్యాఖ్యలకు బలం చేకూర్చుతోంది. మరోవైపు ఈనాడు లాగానే రెండు రాష్ట్రాలకు, ఇద్దరు ఎడిటర్లను నియమిస్తారని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ అదే జరిగితే ప్రస్తుతం సెంట్రల్ డెస్క్ ఇన్చార్జిగా ఉన్న రాహుల్ ను తెలంగాణకు, వక్కలంక రమణను ఆంధ్రకు ఎడిటర్లుగా చేస్తారని తెలుస్తోంది. రామోజీరావు తర్వాత స్థానాన్ని భర్తీ చేయాలని భావిస్తున్న రాధాకృష్ణ.. అదే ఊపులో రామోజీరావు చూపించిన తోవనే అనుసరించడంలో తప్పులేదని సీనియర్ జర్నలిస్టులు వ్యాఖ్యానిస్తున్నారు. మరి రాధాకృష్ణ మదిలో ఏమున్నదో..
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Vemuri radhakrishna tours in a chartered flight is it possible to purification of andhra jyoti
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com