Veera Brahmendra Swamy Residence: ఏపీవ్యాప్తంగా వర్షాలు కొనసాగుతున్నాయి. మొంథా తుఫాను తీరం దాటినా దాని ప్రభావం కొనసాగుతోంది. చాలా జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం( Srikakulam) నుంచి నెల్లూరు వరకు.. అటు రాయలసీమలో సైతం భారీ వర్షాలు నమోదు అవుతున్నాయి. ఈ క్రమంలో వైయస్సార్ కడప జిల్లా బ్రహ్మంగారిమఠంలో భారీ వర్షాలకు పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి నివాస గృహం కుప్పకూలిపోయింది. కొద్ది రోజులుగా బ్రహ్మంగారి మట్టం పరిధిలో వర్షం పడుతోంది. ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో వీరబ్రహ్మేంద్రస్వామి నివాసం కూలిపోయింది. అయితే ఈ విషయంలో అధికారుల తీరుపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కొందరు అరిష్టమని చెబుతున్నారు.
నిత్యం భక్తులతో కిటకిట
కాలజ్ఞాన కర్తగా ప్రపంచవ్యాప్తంగా వీరబ్రహ్మేంద్రస్వామి( Veera brahmendra Swamy ) వారికి విశేష గుర్తింపు ఉంది. ఎంతోమంది భక్తులు వీరబ్రహ్మం స్వామి సమాధిని దర్శించుకుంటారు. ఆయన నివాస గృహాన్ని సందర్శిస్తుంటారు. అంతటి చారిత్రక ప్రాశస్త్యం కలిగిన బ్రహ్మంగారి నివాస గృహాన్ని కాపాడాల్సిన అధికారులు.. అలసత్వం ప్రదర్శిస్తున్నారని భక్తులు మండిపడుతున్నారు. ఈ నివాసం 16వ శతాబ్దపు నాటిది. పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. కానీ మరమ్మత్తులు చేయించలేదు. కోట్లు ఖర్చుపెట్టి బ్రహ్మంగారి మఠాన్ని అభివృద్ధి చేస్తున్నామంటున్న అధికారులు నివాస గృహం విషయంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించడం పై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
భక్తుల్లో ఆందోళన..
ఇక్కడ బ్రహ్మంగారి నివాసాన్ని, మఠాన్ని నిత్యం తెలుగు రాష్ట్రాల ప్రజలు సందర్శిస్తుంటారు. పక్కన కర్ణాటక నుంచి భక్తులు సైతం వస్తుంటారు. ఈ నేపథ్యంలో బ్రహ్మంగారిమఠం అభివృద్ధి చేస్తామని అధికారులు చెప్తున్నారు. కానీ ఆశించిన స్థాయిలో ఇక్కడికి వచ్చే భక్తులకు వసతులు అందడం లేదు. తాజాగా వర్షం కారణంగా బ్రహ్మంగారి నివాస గృహం కూలిపోవడంతో భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చారిత్రక కట్టడం కాపాడడంలో అధికారులతో పాటు వారసులు విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే అరిష్టం అంటూ కొంతమంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంకోవైపు బ్రహ్మంగారిమఠం నూతన అధిపతి నియామకం కోసం సన్నాహాలు మొదలయ్యాయి. ఎందుకుగాను మంగళవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మఠాధిపతిగా తమకు అవకాశం కల్పించాలని కోరుతూ వెంకటాద్రి స్వామి, గోవిందస్వామి, భద్రయ్య స్వామి కోరుతూ వచ్చారు. అందరి అభిప్రాయాలకు అనుగుణంగా.. సరైన అర్హతలు ఉన్నవారికి మఠాధిపతిగా అవకాశం కల్పించనున్నారు.