Vangalapudi Anitha: రాజకీయాల్లో మహిళా నేతలది ప్రత్యేక స్థానం. వారు ఏ పార్టీలో ఉన్నా హుందాతనంతో వ్యవహరించేవారు. ప్రత్యర్థులు సైతం మహిళా నేతలను గౌరవించేవారు. కానీ ఇదంతా గతం. ఇప్పుడంతా వ్యక్తిగత ఆరోపణలు, హేళనలు, వెకిలి నవ్వులతో అవమానాలకు గురి చేయడం పరిపాటిగా మారింది. మొన్నటికి మొన్న మంత్రి రోజా వ్యక్తిగత జీవితంపై టిడిపి సీనియర్ నాయకుడు బండారు సత్యనారాయణమూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ దుమారం తగ్గక ముందే… రోజాపై తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత సరికొత్త చర్చను లేవదీశారు. ఏకంగా రోజా నటించిన ఏ గ్రేడ్ సినిమాల్లోని వీడియోలను ఏకంగా ప్రెస్ మీట్ లో చూపించడం పెను దుమారానికి కారణం అవుతోంది.
రోజా సినీ రంగం నుంచి రాజకీయాల వైపు అడుగులు వేశారు. తొలుత తెలుగుదేశం పార్టీలో సేవలందించారు. అనంతరం వైసీపీలో చేరి ఎమ్మెల్యే అయ్యారు. మంత్రిగా కూడా ఎంపికయ్యారు. అయితే ఈ పరిణామ క్రమంలో ఆమె దూకుడుగా వ్యవహరించారు. ఆ దూకుడు తనమే ఆమెకు కలిసి వచ్చింది. అదే సమయంలో వివాదాస్పదంగా కూడా మారారు. వివాదాలకు చిరునామాగా మారారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ లతో తో పాటు రాజకీయ ప్రత్యర్థులు ఏ హోదాలో ఉన్నా.. వారిపై విమర్శలు చేసేందుకు వెనుకాడరు. వైసిపి విపక్షంలో ఉన్నప్పుడే అప్పటి టిడిపి మంత్రులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. శాసనసభలో ఓ మహిళా మంత్రి బాడీ షేమింగ్ పై సైతం మాట్లాడి విమర్శలకు గురయ్యారు. అసెంబ్లీ నుంచి మూడేళ్ల పాటు సస్పెన్షన్ గురయ్యారు.
నగిరి నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలవడం, వైసిపి అధికారంలోకి రావడంతో రోజా మరింత రెచ్చిపోయారు. చంద్రబాబుతో పాటు లోకేష్ ల తీరును ఎండగట్టారు. అటు పవన్ కళ్యాణ్ పై సైతం అనుచిత వ్యాఖ్యలు చేశారు. తాజాగా చంద్రబాబు అరెస్ట్ తర్వాత స్వీట్లు పంచిపెట్టారు. డ్యాన్సులతో సంబరాలు చేసుకున్నారు. దీంతో రోజా తెలుగుదేశం పార్టీ శ్రేణులకు టార్గెట్ అయ్యారు. ఈ క్రమంలోనే బండారు సత్యనారాయణమూర్తి వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకున్నారు. కానీ రోజాకు తెలుగు సినిమా పరిశ్రమ నుంచి కానీ.. వైసీపీ నుంచి కానీ ఆశించిన స్థాయిలో సపోర్ట్ లభించలేదు.
ఈ తరుణంలో తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత రోజా వీడియోలను ప్రెస్ మీట్ లో లైవ్ గా చూపించడం విశేషం. నీ బతుకు ఇది అంటూ చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే నీ అశ్లీల వీడియోలు ఉన్నాయని బండారు సత్యనారాయణమూర్తి హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అవే వీడియోలను అనిత లైవ్ లోనే బయట పెట్టడం విశేషం. ఇది మంత్రి రోజాపై ఒత్తిడి పెంచేందుకేనని టాక్ నడుస్తోంది. ఓ మహిళా మంత్రిపై మరో మహిళా నేత ఆరోపణలు చేయడంపై పెను దుమారం రేగుతోంది.