CM KCR Schedule : ‘రెండు మూడు రోజుల్లో మా పులి వస్తోంది.. కాచుకోండి.. సిద్ధంగా ఉండండి’ నాలుగు రోజుల క్రితం కేసీఆర్‌ను ఉద్దేశించి ఆయన తనయుడు, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్న మాటలు ఇవీ..
‘కేసీఆర్‌కు ఏమైంది.. మా కేసీఆర్ సార్‌ను ఎందుకు చూపించడం లేదు. ఆయనకు కుటుంబ సభ్యులతోనే ముప్పు ఉంది.. మా కేసీఆర్‌సార్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో బతకాలి’ రెండు రోజుల క్రితం ఆదిలాబాద్ జనగర్జన సభలో బీజేపీ జాతీయ కార్యదర్శి బండి సంజయ్ చేసి వ్యాఖ్యలు.
‘కేసీఆర్ హెల్త్ బులిటెన్ విడుదల చేయాలి. ముఖ్యమంత్రికి ఏమైందో తెలుసుకోవాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజలపై ఉంది. చెప్పాల్సిన బాధ్యత కేసీఆర్ కుటుంబ సభ్యులపై ఉంది’ కొన్ని రోజుల క్రితం నిజామాబాద్ ఎంపీ అర్వింద్ చేసిన మాటలు ఇవీ..
కేసీఆర్ ఆరోగ్యంపై సందేహాలు విమర్శలు, ప్రతి విమర్శలు వ్యక్తమవుతున్న క్రమంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రానే వచ్చింది. కేసీఆర్ అనారోగ్యం విషయంలో ఎంత నిజముందో తెలియదు కానీ.. ఎట్టకేలకు కేసీఆర్ మాత్రం 20 రోజుల తర్వాత మళ్లీ జనం ముందుకు రాబోతున్నారు. ఎన్నికల రణరంగంలోకి దిగబోతున్నారు.
అన్ని పార్టీల దూకుడు..
అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడులైన నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు ప్రచారాన్ని వేగవంతం చేశాయి. అధికార బీఆర్‌ఎస్ పార్టీ కూడా దూకుడుగా ప్రచారాన్ని కొనసాగిస్తోంది. ఇక బీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ కూడా రంగంలోకి దిగుతున్నారు. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి రేసులో ముందున్న బీఆర్‌ఎస్ పార్టీ.. ప్రచార షెడ్యూల్ కూడా ప్రకటించింది.
41 నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటన..
అక్టోబర్ 15 నుంచి కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి రాబోతున్నారు. వరుసగా 41 నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేయనున్నారు. ఈనెల 15న మేనిఫెస్టో విడుదల అనంతరం కేసీఆర్ పర్యటనలు ప్రారంభం కానున్నాయి. ఆ రోజు నుంచి నవంబర్ 9 వరకు బీఆర్‌ఎస్ అధినేత సభలకు షెడ్యూల్ ఖరారైంది. రోజుకు రెండు లేదా మూడు సభల్లో కేసీఆర్ పాల్గొనేలా బీఆర్‌ఎస్ నేతలు షెడ్యూల్ సిద్ధం చేశారు.
సెంటిమెంట్ ప్రకారమే..
బీఆర్‌ఎస్‌కు హుస్నాబాద్ సెంటిమెంట్ బాగా కలిసి వస్తోంది. రెండుసార్లు టీఆర్‌ఎస్ పార్టీగా ఎన్నికల్లోకి వెళ్లిన కేసీఆర్ విజయం సాధించారు. ఈసారి బీఆర్‌ఎస్ పార్టీగా బరిలోకి దిగబోతున్నారు. తన సెంటిమెంట్ నియోజవర్గమైన హుస్నాబాద్ నుంచే ప్రచారానికి శ్రీకారం చుట్టబోతున్నారు. హుస్నాబాద్‌లో కేసీఆర్ ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. 2018లో కూడా కేసీఆర్హుస్నాబాద్ నుంచే ఎన్నికల ప్రచార భేరీ మోగించడం గమనార్హం. ఈసారి సభకు భారీ ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. మంత్రి హరీశ్‌రావు ఏర్పాట్లను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. అక్టోబర్ 16న జనగామ, భువనగిరిలో జరిగే సభలకు కేసీఆర్ హాజరుకానున్నారు. ఈనెల 17న సిరిసిల్ల, సిద్దిపేట సభల్లో పాల్గొంటారు.
సీఎం కేసీఆర్ ప్రచార షెడ్యూల్:
అక్టోబర్ 15 హుస్నాబాద్ అక్టోబర్ 16 జనగాం, భువనగిరి అక్టోబర్ 17 సిరిసిల్ల, సిద్దిపేట అక్టోబర్ 18 జడ్చర్ల, మేడ్చల్ అక్టోబర్ 26 అచ్చంపేట, నాగర్‌కర్నూలు, మునుగోడు అక్టోబర్ 27 పాలేరు, స్టేష¯Œ ఘ¯Œ పూర్ అక్టోబర్ 29 కోదాడ, తుంగతుర్తి, ఆలేరు అక్టోబర్ 30 జుక్కల్, బాన్సువాడ, నారాయణ్‌ఖేడ్ అక్టోబర్ 31 హుజూర్‌నగర్, మిర్యాలగూడ, దేవరకొండ నవంబర్ 01 సత్తుపల్లి, ఇల్లెందు నవంబర్ 02 నిర్మల్, బాల్కొండ, ధర్మపురి నవంబర్ 03 భైంసా(ముధోల్), ఆర్మూర్, కోరుట్ల నవంబర్ 05 కొత్తగూడెం, ఖమ్మం నవంబర్ 06 గద్వాల్, మఖ్తల్, నారాయణపేట నవంబర్ 07 చెన్నూరు, మంథని, పెద్దపల్లి నవంబర్ 08 సిర్పూర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లిలో పర్యటిస్తారు. కేసీఆర్ ప్రచారంతో తెలంగాణ హోరెత్తడం ఖాయమంటున్నారు విశ్లేషకులు.
ఒకే రోజు రెండుచోట్ల నామినేషన్లు
సీఎం కేసీఆర్ ఈ ఎన్నికల్లో గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. నవంబర్ 9న ఒకేరోజు ఈ రెండు నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తారు కేసీఆర్. ఆనవాయితీ ప్రకారం 9న ఉదయం సిద్దిపేట నియోజకవర్గంలోని కోనాయపల్లి వెంకటేశ్వరస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం గజ్వేల్‌లో మొదటి నామినేషన్, మధ్యాహ్నం రెండు గంటలకు కామారెడ్డిలో రెండో నామినేషన్ దాఖలు చేస్తారు. 4 గంటలకు కామారెడ్డిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు.