Vallabhaneni Vamsi : వల్లభనేని వంశీ మోహన్ ( Vamsi Mohan )ఆరోగ్యం క్షీణిస్తోంది. గత కొద్ది రోజులుగా రిమాండ్ ఖైదీగా ఉన్న వల్లభనేని వంశీ మోహన్ తరచూ అనారోగ్యానికి గురవుతున్న సంగతి తెలిసిందే. ఈరోజు ఆయన ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోవడంతో జైలు అధికారులు ఆసుపత్రికి తరలించారు. గుంటూరు జి జి హెచ్ కు తరలించి పరీక్షలు చేశారు. వీటికి సంబంధించి హెల్త్ బులిటెన్ ను గుంటూరు జి జి హెచ్ అధికారులు విడుదల చేశారు. శ్వాసకోశ సంబంధ సమస్యలతో బాధపడుతున్న వంశీని తొలుత విజయవాడ జి జి హెచ్ కు తరలించాలని భావించారు. అక్కడ స్పెషలిస్టులు లేరనే కారణంతో గుంటూరు జి జి హెచ్ కు తరలించారు.
Also Read : 250 సినిమాలలో నటించి గుర్తింపు తెచ్చుకున్న వెంకటేష్ జెమిని సినిమా విలన్.. కానీ చివరకు..
* వంద రోజుల కిందట అరెస్ట్..
వల్లభనేని వంశీ ఈ ఏడాది ఫిబ్రవరి 13న అరెస్టయ్యారు. గన్నవరం( Gannavaram) టిడిపి కార్యాలయం పై దాడితోపాటు అక్కడ పని చేస్తున్న సత్య వర్ధన్ ను కిడ్నాప్ చేశారన్న ఫిర్యాదుతో అరెస్టు చేశారు ఏపీ పోలీసులు. గత 100 రోజులుగా ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇప్పటివరకు ఆయన పై ఏడు కేసులు నమోదయ్యాయి. ఓ అయిదు కేసుల్లో బెయిల్ లభించింది. మరో రెండు కేసుల్లో లభించాల్సి ఉంది. అయితే ఒక కేసులో బెయిల్ లభిస్తుంటే మరో కేసు నమోదు చేస్తుండటపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. రాజకీయ కక్షపూరిత చర్యలతోనే కూటమి ప్రభుత్వం వల్లభనేని వంశీని హింసిస్తోందని ఆరోపిస్తోంది. రెండు రోజుల కిందటే ఆయనకు ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి పర్వాలేదని అక్కడి వైద్యులు ధ్రువీకరించడంతో తిరిగి జైలుకు తరలించారు. ఈరోజు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడడంతో హుటాహుటిన గుంటూరు జి జి హెచ్ కు తరలించారు.
* వేరే ఆసుపత్రికి రిఫర్..
వల్లభనేని వంశీ తాజా ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్( health bulletin ) జారీ చేసింది గుంటూరు జి జి హెచ్. అక్కడ అధికారులు ప్రత్యేక ప్రకటన చేశారు. వంశీ ఫిట్స్ తో బాధపడుతున్నట్లు డాక్టర్లు తేల్చారు. ఆయనకు నిద్రలో శ్వాస ఆగిపోతోందని కూడా గుర్తించారు. నిద్రలో శ్వాస ఆగిపోతున్న విషయాన్ని లోతుగా పరిశీలించేందుకు స్లీప్ టెస్ట్ చేయాల్సి ఉంది. గుంటూరు జి జి హెచ్ లో ఈ సదుపాయం అందుబాటులో లేదని అక్కడి డాక్టర్లు తేల్చేశారు. దీంతో వంశీని మరో ఆసుపత్రికి రిఫర్ చేసినట్లు జిజిహెచ్ సూపరింటెండెంట్ తెలిపారు. ఈరోజు జనరల్ ఫిజిషియన్, పల్మనాలజిస్ట్ ఆయనకు పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించారు. అయితే పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని డాక్టర్లు చెప్పిన విషయాన్ని చెప్పారు. దీంతో స్విమ్స్ లేదా ఆయన కోరుకున్న మరో ఆసుపత్రిలో స్లీప్ టెస్ట్ నిర్వహించేందుకు నిర్ణయించారు.
* కుటుంబ సభ్యుల్లో ఆందోళన..
వల్లభనేని వంశీ ఆరోగ్య పరిస్థితి పై కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఆయన భార్య పంకజాశ్రీ గుంటూరు జి జి హెచ్ కు( Gunturu ggh) చేరుకున్నారు. గత కొద్దిరోజులుగా వంశీ ఆరోగ్యం క్షీణిస్తుండడంపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వంశీకి ఏదైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఇప్పటికే మాజీమంత్రి పేర్ని నాని హెచ్చరించారు. వంశీ కి ఏమైనా అయితే.. వంగవీటి మోహన్ రంగ పరిస్థితులు తలెత్తుతాయని హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు దీనిపై వైయస్సార్సీపి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తోంది. అదే సమయంలో గతంలో ఇదే వంశీ మాట్లాడిన ఆడియోలు, వీడియోలు ప్రత్యర్ధులు వైరల్ చేస్తున్నారు.