Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీ మోహన్ ( Vallabhaneni Vamsi) మరింత చిక్కుల్లో పడినట్టు కనిపిస్తున్నారు. ఒకవైపు ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే జైలు సిబ్బంది విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న వంశీని హుటాహుటిన వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. ఆక్సిజన్ ఎనలైజర్ పెట్టుకోవడం వల్ల ముక్కు వద్ద ఉన్న ఎముకలు నొప్పి వస్తున్నాయని వంశీ చెబుతున్నారు. గత కొద్ది నెలలుగా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు వంశీ. బెయిల్ కోసం ఆయన చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కి రావడం లేదు. దాదాపు 5 కేసులు నమోదు కాగా.. నాలుగు కేసుల్లో ఆయనకు బెయిల్ లభించింది. టిడిపి కార్యాలయం పై దాడి కేసుకు సంబంధించి ఇంకా బెయిల్ రావాల్సి ఉంది.
* మూడు నెలల కిందట అరెస్టు..
ఈ ఏడాది ఫిబ్రవరి 13న వంశీని ఏపీ పోలీసులు హైదరాబాదులో( Hyderabad) అదుపులోకి తీసుకున్నారు. ప్రధానంగా టిడిపి కార్యాలయంలో పనిచేస్తున్న సత్య వర్ధన్ కిడ్నాప్, బెదిరింపులపై వంశి పై కేసు నమోదయింది. కిడ్నాప్, బెదిరింపు, ఎస్సీ ఎస్టీ చట్టం కింద కేసులు నమోదు చేశారు. గత మూడు నెలలుగా వంశీ జైల్లోనే గడుపుతున్నారు. ఇటీవల సత్య వర్ధన్ కిడ్నాప్ నకు సంబంధించి బెయిల్ లభించింది. టిడిపి కార్యాలయం పై దాడికి సంబంధించి వాదనలు జరుగుతున్నాయి. రెండు రోజుల్లో తీర్పు వెలువడే అవకాశం ఉంది. ఇంతలోనే వల్లభనేని వంశీ మోహన్ జైల్లో అస్వస్థతకు గురయ్యారు. ప్రధానంగా దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు.
* మరో కేసుతో పోలీసులు సిద్ధం..
మరోవైపు పోలీసులు వల్లభనేని వంశీ మోహన్ పై పిటి వారెంట్( PT warrant) దాఖలు చేసేందుకు సిద్ధపడుతున్నారు. ఇప్పటికే ఆయనకు బెయిల్ లభించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భూ కబ్జాలకు సంబంధించి కేసు నమోదు చేసేందుకు పోలీసులు సిద్ధపడుతున్నారు. అదే జరిగితే మరికొద్ది రోజులపాటు వల్లభనేని వంశీ మోహన్ జైల్లో గడపాల్సిందే. గన్నవరం నియోజకవర్గంలో ఓ భూకబ్జా కేసుకు సంబంధించి పిటి వారెంట్ దాఖలు చేసేందుకు పోలీసులు సిద్ధపడుతున్నారు. వంశి అనారోగ్య సమస్యలతో బెయిల్ పొందే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే పోలీసులు పీటీ వారెంట్ దాఖలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.
* వైసీపీ నుంచి అందని న్యాయ సహాయం..
మరోవైపు వల్లభనేని వంశీ మోహన్ కు వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ పరంగా ఎటువంటి సాయం అందడం లేదని తెలుస్తోంది. ప్రారంభంలో వల్లభనేని వంశీ మోహన్ ను పరామర్శించారు జగన్మోహన్ రెడ్డి. అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కానీ తరువాత వైసిపి నుంచి న్యాయ సహాయం అందడం లేదు. అందుకే వంశీ మోహన్ భార్య స్వయంగా లాయర్లతో మాట్లాడుతూ న్యాయపరంగా ముందుకు వెళ్తున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి తగినంత సాయం అందకపోవడం పై వంశీ అనుచరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.