Big alert for Uttarandhra: ఏపీ వాసులకు బిగ్ అలర్ట్. భారీ వర్ష సూచన తెలిపింది ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ. ముఖ్యంగా ఉత్తరాంధ్రకు భారీ హెచ్చరికలు జారీ చేసింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రస్తుతం ఉత్తర వాయువ్య దిశగా కదులుతున్నట్లు స్పష్టం చేసింది. రాగల 12 గంటల్లో బలపడి అదే ప్రాంతంలో వాయుగుండంగా రూపాంతరం చెంది అవకాశం ఉందని పేర్కొంది. తీవ్ర వాయుగుండం గా బలపడి శుక్రవారం తెల్లవారుజామున దక్షిణ ఒడిస్సా, ఉత్తరాంధ్ర మధ్య తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేసింది. దీని ప్రభావంతో ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. వాయుగుండం నేపథ్యంలో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని.. మత్స్యకారులు నాలుగు రోజులపాటు వేటకు వెళ్ళద్దని కూడా ఆదేశాలు ఇచ్చింది విపత్తుల నిర్వహణ సంస్థ.
పిడుగులతో కూడిన వానలు..
మరోవైపు ఉత్తరాంధ్రకు భారీ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. వచ్చే మూడు రోజుల్లో శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయడం విశేషం. మరోవైపు విజయనగరం తో పాటు విశాఖ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. పిడుగులతో కూడిన మాస్టరు వర్షాలు పడతాయని తెలిపింది. వర్షాలు పడే సమయంలో ఈదురు గాలులు వీస్తాయని కూడా చెప్పుకొచ్చింది. చెట్లతోపాటు స్తంభాలు, టవర్ల వద్ద నిలబడరాదని సూచించింది విపత్తుల నిర్వహణ సంస్థ. మరోవైపు వరుసగా ఒకదాని తరువాత ఒకటి అల్పపీడనాలు ఏర్పడడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. వారం రోజుల వ్యవధిలోనే రెండు అల్పపీడనాలు ఏర్పడ్డాయి.
ఉధృతంగా నదులు..
మరోవైపు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ప్రధానంగా గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. భద్రాచలం వద్ద నీటిమట్టం 48.1 అడుగులకు చేరుకుంది. ధవలేశ్వరం వద్ద ఇన్ఫ్లో, అవుట్ ఫ్లో 6, 61,974 క్యూసెక్కులుగా నమోదయింది. ధవలేశ్వరం ప్రకాశం బ్యారేజీలకు ఎగువ నుంచి వచ్చిన నీటిని యధావిధిగా కిందకి విడిచి పెడుతున్నారు. రెండో నెంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. మొత్తానికైతే ఉత్తరాంధ్రకు భారీ హెచ్చరిక రావడం ఆందోళనకు గురిచేస్తోంది.