https://oktelugu.com/

Crime News : భర్తల ఎదుటే సామూహిక అఘాయిత్యం.. ఏపీలో ఏమిటి దారుణాలు.. వరుస ఘటనలు..

ఏపీలో మరో దారుణం వెలుగు చూసింది. మహిళలపై సామూహిక అత్యాచారం జరిగింది. వరుస ఘటనలతో ఏపీలో శాంతి భద్రతలు ప్రశ్నార్థకంగా మారాయి. విపక్షాలు ఇదే అంశంపై విమర్శలు కురిపిస్తున్నాయి.

Written By:
  • Dharma
  • , Updated On : October 13, 2024 10:43 am
    Crime News

    Crime News

    Follow us on

    Crime News :  మొన్న ఆ మధ్యన..పుంగనూరులో ఓ చిన్నారిని దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. ఇంటి నుంచి అదృశ్యమైన చిన్నారి మూడు రోజుల తర్వాత.. ఓ వాగులో శవమై కనిపించింది. అయితే ఈ హత్య చేసింది ఎవరు? అని పోలీసులు త్వరితగతిన ఛేదించలేకపోయారు. దీంతో రాష్ట్రస్థాయిలో ఈ ఘటన సంచలనంగా మారింది. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని వైసీపీ ఆరోపణలు చేయడం ప్రారంభించింది. టిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటువంటి ఘటనలు జరిగాయని చెప్పుకొచ్చింది. బాధ్యత కుటుంబాన్ని వైసీపీ అధినేత జగన్ పరామర్శిస్తారని కూడా పేర్కొంది. జగన్ పర్యటనకు సంబంధించి షెడ్యూల్ కూడా ఖరారు అయింది. అయితే ఈ నేపథ్యంలో స్పందించిన మంత్రులు పుంగనూరు ఘటనను సీరియస్ గా తీసుకున్నారు. వ్యాపార లావాదేవీల నేపథ్యంలోనే ఈ ఘటన జరిగినట్లు నిర్ధారించారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అటు బాధిత కుటుంబం సైతం ఈ విషయంలో రాజకీయాలు వద్దని విజ్ఞప్తి చేసింది. అయితే ఈ ఘటన మరువక ముందే శ్రీ సత్యసాయి జిల్లాలో మరో అమానుష ఘటన వెలుగు చూసింది. గుర్తు తెలియని నలుగురు వ్యక్తులు వచ్చి.. నిరుపేద కుటుంబానికి చెందిన అత్త, కోడలు పై సామూహిక అత్యాచారం చేశారు. భర్తల ఎదుట ఈ అమానుష ఘటనకు పాల్పడడం ఆందోళన కలిగిస్తోంది. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

    * ఉపాధి కోసం బళ్లారి నుంచి..
    కర్ణాటకలోని బళ్లారి ప్రాంతానికి చెందిన కొంతమంది వ్యక్తులు సత్యసాయి జిల్లా.. చిలమత్తూరు మండలంలో ఓ గ్రామానికి ఉపాధి నిమిత్తం వచ్చారు. నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్లకు వాచ్మెన్లు గా, భవన నిర్మాణ కార్మికులు గా ఉండేవారు. ఈ నేపథ్యంలో ఒక నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్ పర్యవేక్షణ బాధ్యతలను ఓ కుటుంబం చూసేది.ఆ కుటుంబంలో తండ్రి,తల్లి, కుమారుడు, కోడలు ఉన్నారు. ఈ నేపథ్యంలో రెండు ద్విచక్ర వాహనాలపై వచ్చిన నలుగురు వ్యక్తులు తండ్రి, కుమారుడ్ని బంధించారు. అత్త, కోడలిపై సామూహిక అత్యాచారం చేశారు. ఈ విషయాన్ని బయటకు చెబితే చంపేస్తామని హెచ్చరించారు. భర్తల ఎదుట ఈ అమానుష ఘటనకు పాల్పడడం సంచలనం గా మారింది.

    * ఎస్పీ పర్యవేక్షణలో దర్యాప్తు
    అయితే బాధితులు ధైర్యం కూడదీసుకుని చిలమత్తూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్పీ రంగంలోకి దిగారు. ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాధితుల నుంచి వివరాలు సేకరించారు. మరోవైపు ఈ ఘటనపై హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ స్పందించారు. దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జిల్లా ఎస్పీతో మాట్లాడారు. వీలైనంత త్వరగా నిందితులను పట్టుకోవాలని కోరారు. అయితే వరుసగా జరుగుతున్న ఈ ఘటనలపై వైసీపీ స్ట్రాంగ్ గా రియాక్ట్ అవుతుంది. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని ఆరోపణలు చేయడం ప్రారంభించింది.