Chandrababu : చంద్రబాబుకు కాలం కలిసి వస్తోంది.ఎప్పుడూ లేనివిధంగా రాజకీయంగా అన్ని అంశాలు కలిసి వస్తున్నాయి. ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ రికార్డ్ స్థాయిలో విజయం సాధించింది. కేంద్రంలో ఎన్డీఏకు అవసరమైన మెజారిటీని అందించింది. కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో కీలక భాగస్వామి అయింది. కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో రాష్ట్రానికి సహకారం అందుతోంది. అమరావతి రాజధాని నిర్మాణం తో పాటు పోలవరం ప్రాజెక్టుకు ఊపిరి వచ్చింది. జాతీయ స్థాయిలో సైతం చంద్రబాబు పరపతి పెరిగింది. రాష్ట్రంలో సైతం ఒక్క జగన్ మాత్రమే రాజకీయ ప్రత్యర్థిగా ఉన్నారు. మిగతా వారంతా చంద్రబాబు విషయంలో సానుకూలంగా ఉన్నారు. వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీ సైతం ఒక విధంగా చెప్పాలంటే సానుకూలమే. బిజెపి భాగస్వామ్య పక్షంగా ఉంది. జనసేన సైతం జతకట్టింది. ఈ తరుణంలో చంద్రబాబుకు ఒకే ఒక రాజకీయ శత్రువు జగన్ మిగిలారు. గత ఐదేళ్ల వైసిపి హయాంలో చంద్రబాబు పడిన ఇబ్బందులు అన్ని ఇన్ని కావు. వాటన్నింటిని అధిగమిస్తూ.. ఇప్పుడు ఉన్నత స్థానాన్ని అందుకున్నారు చంద్రబాబు. రాజకీయంగా చివరి దశలో ఉన్న సమయంలో పరిస్థితిని తనకు అనుకూలంగా మలుచుకున్నారు. ఇప్పుడు కొత్తగా ఐటీ మ్యాన్ అంటూ కొత్త బిరుదును పొందగలిగారు. అది కూడా జాతీయస్థాయిలోనే. అయితే ఈ ప్రశంస ఇచ్చింది మరెవరో కాదు.. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్.
* అది ఆయన ఘనత
ఐటీ అంటే జాతీయస్థాయిలో ముందుగా గుర్తొచ్చే పేరు చంద్రబాబు. ఐటీ గురించి ఎక్కడైనా మాట్లాడితే చంద్రబాబునే ప్రస్తావిస్తారు. దీనికి కారణం హైదరాబాద్ కు దీటుగా సైబరాబాద్ నిర్మించారు చంద్రబాబు. ప్రఖ్యాత ఐటి కంపెనీలు ఏర్పాటు చేసేలా ప్రోత్సహించారు. అంతర్జాతీయ సంస్థలను సైతం తీసుకొచ్చారు. దీంతో చంద్రబాబుపై ఐటి ముద్ర పడింది. రాజకీయంగా బద్ద విరోధులు సైతం ఒప్పుకోక తప్పని పరిస్థితి ఈ విషయంలో. మొన్నటివరకు తెలంగాణను పాలించిన కెసిఆర్, ఆయన కుమారుడు కేటీఆర్ చంద్రబాబు కృషిని ప్రశంసించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆ జాబితాలోకి వచ్చారు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్.
* ఆ సమావేశంలో కొనియాడిన కేంద్రమంత్రి
అమరావతి రాజధానికి అనుసంధానిస్తూ ప్రత్యేక రైల్వే లైన్ కేటాయించిన సంగతి తెలిసిందే. దీనికి క్యాబినెట్ ఆమోదముద్ర సైతం లభించింది. ఇటీవల చంద్రబాబు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తో భేటీ అయ్యారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే ఈ సమావేశం జరిగింది. సీఎం చంద్రబాబు,డిప్యూటీ సీఎం పవన్, ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి వంటి వారు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుతో పాటు పదుల సంఖ్యలో అధికారులు సైతం హాజరయ్యారు. అయితే ఇంతమంది ఒకేసారి వీడియో కాన్ఫరెన్స్లో సమావేశం కావడంతో రైల్వే శాఖ మంత్రిని చంద్రబాబు ప్రశంసించారు. అభినందనలు తెలిపారు. దీనికి రైల్వే శాఖ మంత్రి స్పందిస్తూ నేను కాదు.. అసలు ఐటీ మ్యాన్ మీరు అంటూచంద్రబాబును కొనియాడారు. దీంతో సమావేశంలో పాల్గొన్న వారు చప్పట్లతో ఆహ్వానించారు. అయితే ఇప్పుడు అదే అంశం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.