https://oktelugu.com/

Visakha Steel Industry : వందమంది ఉద్యోగులకు చత్తీస్ గడ్ బదిలీ.. విశాఖ స్టీల్ పై కేంద్రం సంచలనం

ఒక్కసారిగా ముడి సరుకులు నిలిపివేశారు. బొగ్గు సరఫరా సైతం ఆగిపోయింది. మేనేజింగ్ డైరెక్టర్ దీర్ఘకాలిక సెలవు పై వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏకంగా 100 మంది ఉద్యోగులను వేరే ప్లాంట్ కు బదిలీ చేశారు. దీంతో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పై అనుమానాలు బలపడుతున్నాయి.

Written By:
  • Dharma
  • , Updated On : September 17, 2024 / 04:37 PM IST

    Visakha Steel Industry

    Follow us on

    Vishaka steel plant : విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు శరవేగంగా అడుగులు పడుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటికరించాలన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఉక్కు ఉత్పత్తికి సంబంధించి ముడి సరుకులు, బొగ్గు సరఫరా నిలిచిపోయింది. ఇప్పుడు అక్కడ పనిచేస్తున్న శాశ్వత ఉద్యోగులు 100 మందికి వేరే స్టీల్ ప్లాంట్లో సర్దుబాటు చేశారు. దీంతో అనుమానాలు బలపడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ చర్యలు మరింత అనుమానాస్పదంగా మారాయి. ఇంకోవైపు స్టీల్ ప్లాంట్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ దీర్ఘకాలిక సెలవు పై వెళ్ళిపోయారు. నవంబర్ 30న ఆయన పదవీ విరమణ చేయనున్నారు. అప్పటివరకు ఆయన సెలవు పెట్టడంతో.. తెర వెనుక ఏదో జరుగుతోందన్న అనుమానం బలపడుతోంది.ఏకకాలంలో ప్లాంట్లో ఉత్పత్తి నిలిచిపోవడం, మేనేజింగ్ డైరెక్టర్ సెలవులోకి వెళ్లిపోవడం, శాశ్వత ఉద్యోగుల సర్దుబాటు జరగడంతో.. ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం వెనక్కి తగ్గేలా కనిపించడం లేదని స్పష్టమైంది.

    * అప్పట్లో వైసీపీ కార్నర్
    వాస్తవానికి కొన్నేళ్ల కిందటే విశాఖ స్టీల్ ప్రైవేటుకరించాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించింది.అప్పట్లో వైసీపీ అధికారంలో ఉండేది.కేంద్రంలోని బిజెపితో వైసిపి స్నేహం కొనసాగించేది. దీంతో స్టీల్ ప్లాంట్ విషయంలో వైసిపి కార్నర్ అయింది. అప్పట్లో టిడిపి, జనసేన వైసీపీని టార్గెట్ చేసుకున్నాయి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు జగన్ సహకరిస్తున్నారని ఆరోపణలు చేసేవి. అంతకుముందు ఎన్నికల్లో జగన్ సైతం విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో స్పష్టమైన ప్రకటన చేశారు. ఎట్టి పరిస్థితుల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ కు అండగా నిలబెడతామని.. అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం ముడిసరుకు అందిస్తుందని కూడా తేల్చి చెప్పారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ చేస్తానని బిజెపి పలుమార్లు ప్రకటించింది. కానీ నేరుగా ఖండించేందుకు అప్పట్లో వైసీపీ సర్కార్ తట పటాయించింది. దీంతో వైసిపి పై ప్రజల్లో ఒక రకమైన అపోహ వచ్చింది. దానిని అప్పట్లో విపక్షాలు ప్రచార అస్త్రంగా మార్చుకున్నాయి.

    * ఇప్పుడు సానుకూల ప్రభుత్వం
    అయితే ఇప్పుడురాష్ట్రంలో బిజెపి సానుకూల ప్రభుత్వం వచ్చింది. మూడు పార్టీల కూటమి ప్రభుత్వం నడుపుతోంది. ఈ నేపథ్యంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని అంతా భావించారు. అంతటి సాహసం చేయదని అనుకున్నారు. కానీ ఇప్పుడు కేంద్రం గట్టిగానే పావులు కాదపడం ప్రారంభించింది. ముడి సరుకు లేకపోవడంతో ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో ఉద్యోగులకు పని లేకుండా పోయింది. అందుకే వారిని చత్తీస్గడ్ లోని మరో సీల్ ప్లాంట్ కు సర్దుబాటు చేశారు. దీంతో ప్రైవేటీకరణకు చకచకా అడుగులు పడుతున్నాయని స్పష్టమైంది.

    * రాజీనామాలకు సిద్ధం
    విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంలో ఇప్పుడు టిడిపి కూటమి ప్రభుత్వం కార్నర్ అవుతోంది. స్టీల్ ప్లాంట్ ఉన్న గాజువాక కు టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. విశాఖ ఎంపీగా శ్రీ భరత్ ఉన్నారు. ఇప్పుడు టిడిపి చుట్టూ రాజకీయం జరుగుతుండడంతో వారు అలర్ట్ అయ్యారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రంతో సానుకూల చర్చలు జరుగుతున్నాయని.. ఒకవేళ వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటే పదవులకు రాజీనామా చేసి ఆందోళనలో కూర్చుంటామని వారు హామీ ఇచ్చారు. వారు అలా హామీ ఇచ్చిన గంటల వ్యవధిలోనే ఉద్యోగులను వేరే స్టీల్ ప్లాంట్లో సర్దుబాటు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్లాంట్ ఎండి ఏకంగా సెలవు పై వెళ్లిపోవడం కూడాఉద్యోగుల్లో ఆందోళనకు కారణమైంది.