AP CM Jagan : ఏపీ సీఎం జగన్ పై దాడి సంచలనం రేపింది. భద్రతను ప్రశ్నించింది. గత ఎన్నికలకు ముందు కోడి కత్తి దాడి జరిగింది. అయితే అప్పట్లో ఆయన విపక్ష నేతగా ఉన్నారు. అయితే ఇది అధికార విపక్షాల మధ్యరాజకీయ రణరంగంగా మారిపోయింది. పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ ఘటనను లైట్ తీసుకుంటున్నారు. అయితే ఎన్నికలవేళ కేంద్రం సీరియస్ గా వ్యవహరిస్తోంది. సీఎం జగన్ భద్రతను పెంచుతోంది. అందులో భాగంగా సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిఐఎస్ఎఫ్ ను రంగంలోకి దించుతోంది.
రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్కు అసాధారణ భద్రత ఉంది. ఆయన అధికారం చేపట్టిన తర్వాత భద్రతకు పెద్దపీట వేస్తూ వచ్చారు. ఈ క్రమంలో ఎన్ని రకాల విమర్శలు వచ్చినా వెనక్కి తగ్గలేదు. సాధారణంగా జగన్ జిల్లాల టూర్ అంటేనే ప్రజలు బెంబేలెత్తేలా ఆంక్షలు విధించేవారు. రహదారులను తవ్వేసేవారు. చెట్లను తొలగించేవారు. అయితే ఇప్పుడు ఎన్నికలవేళ మేమంతా సిద్ధం పేరిట జగన్ బస్సు యాత్ర చేపడుతున్నారు. ఇప్పుడు కూడా ఆయనకు అసాధారణ భద్రత కొనసాగుతోంది. అయినా సరే విజయవాడలో గులకరాయి వచ్చి కంటి పై భాగాన గాయం చేసింది. గత ఎన్నికలకు ముందు కోడి కత్తిలాంటి ఘటన కావడంతో సొంత పార్టీలోనూ పెద్దగా రెస్పాన్స్ రాలేదు. విపక్షాలైతే జగనే తనకు తానుగా ఆ పని చేయించుకున్నారని ఆరోపించాయి. అయితే కేంద్రం మాత్రం ఈ విషయంలో సీరియస్ అయ్యింది. దీనిపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆరా తీసింది. రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారుల నుంచి నివేదికలు తెప్పించుకుంది. జగన్ బస చేసే నైట్ క్యాంపుకు సీఐఎస్ఎఫ్ తో భద్రత కల్పించాలంటూ ఉత్తర్వులు ఇచ్చింది. దీనికి అనుగుణంగానే డిజిపి ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం.
ప్రస్తుతం జగన్ కు ఆక్టోపస్ బలగాలతో పాటు పోలీస్ ప్రత్యేక బలగాలు భద్రత కల్పిస్తున్నాయి. ఇప్పుడు వారికి సిఐఎస్ఎఫ్ బలగాలు తోడు కానున్నాయి. నేటి నుంచే ఈ బలగాలు వైయస్ జగన్ నైట్ క్యాంప్ భద్రతను తమ ఆధీనంలోకి తీసుకుంటాయని తెలుస్తోంది. గాయం నేపథ్యంలో జగన్ ఆదివారం బస్సు యాత్రకు తాత్కాలికంగా విరామం ఇచ్చారు. ఈరోజు బస్సు యాత్ర ప్రారంభమైంది. ప్రస్తుతం గన్నవరం నియోజకవర్గంలో కొనసాగుతోంది. సాయంత్రానికి గుడివాడ నియోజకవర్గంలో అడుగుపెట్టనుంది. రాత్రికి అక్కడే జగన్ బస చేయనున్నారు. ఆ శిబిరం అంతా సిఐఎస్ఎఫ్ తన ఆధీనంలోకి తెచ్చుకొనుంది. మొత్తానికైతే ఏపీ విషయంలో కేంద్ర హోంశాఖ సీరియస్ గా ఉంది. వరుసగా జరుగుతున్న పరిణామాలతో అలర్ట్ అయ్యింది.