Unemployed people protesting
Unemployees : ఏపీలో నిరుద్యోగులు( unemployees ) రోడ్డు ఎక్కారు. ఆందోళనలు తీవ్రతరం చేయాలని నిర్ణయించారు. కూటమి అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతోంది. ఇంకా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభం కాలేదు. మరోవైపు ప్రకటించిన నిరుద్యోగ భృతిపై ఎటువంటి కార్యాచరణ ప్రారంభించలేదు. మరోవైపు గ్రూప్ 2 మెయిన్స్ లో రాష్ట్ర విధానం మార్చాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. డీఎస్సీ ప్రక్రియ ప్రారంభం కాకపోవడంతో నిరుద్యోగ వర్గాల్లో ఒక రకమైన ఆందోళన ప్రారంభమైంది. ఈ కారణాలతో రోడ్ ఎక్కుతున్నారు నిరుద్యోగ యువత. కూటమి హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనబాట పడుతున్నారు.
* మెగా డీఎస్సీ ఆలస్యం
అధికారంలోకి వచ్చిన మరుక్షణం మెగా డీఎస్సీ నోటిఫికేషన్( DSc notification) జారీ చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ హామీకి తగ్గట్టుగానే సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా డీఎస్సీ ఫైల్ పైనే సంతకం చేశారు. కానీ ఇంతవరకు డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వలేదు. అప్పట్లో వైయస్సార్సీపి ప్రభుత్వం 6000 ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చింది. కానీ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తి చేయలేకపోయింది. అయితే ఆ 6000 ఉపాధ్యాయ పోస్టులకు తోడు.. మరో 10 వేల పోస్టులు జత కలిపి.. 16,400 ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తామని చంద్రబాబు చెప్పుకొచ్చారు. అయితే అదిగో ఇదిగో అంటూ కాలయాపన అయ్యింది. కానీ ఇంతవరకు నోటిఫికేషన్ జారీ చేయలేదు.
* రోస్టర్ విధానం పై ఆగ్రహం
ఇంకోవైపు గ్రూప్ 2 మెయిన్స్ ( group 2 mains )పరీక్ష సమీపించింది. కానీ రోస్టర్ విధానంలో ఎటువంటి మార్పు చేయలేదు. దీంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని గ్రూప్ 2 పరీక్షకు హాజరయ్యే వారు ఆందోళన చెందుతున్నారు. విధానాన్ని మార్చిన తర్వాతనే మెయిన్స్ పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. విశాఖలో నిరుద్యోగ యువత ఒక్కసారిగా ఆందోళనకు దిగారు. జగన్ సర్కార్ చేసిన తప్పిదమే చంద్రబాబు ప్రభుత్వం చేస్తోందని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా 92,000 మందికి పైగా నిరుద్యోగులు ఈ పరీక్ష రాస్తున్నారని..రోస్టర్ విధానం కారణంగా వారంతా ఆందోళన చెందుతున్నారని.. ఏపీపీఎస్సీ అధికారులు స్పందించకుంటే ఉద్యమాన్ని చేపడుతామని హెచ్చరించారు.
* ప్రారంభం కాని ఉద్యోగ నియామక ప్రక్రియ
అయితే కూటమి( Alliance ) అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతవరకు ఉద్యోగ నియామకాల ప్రక్రియ ప్రారంభం కాలేదు. దీంతో నిరుద్యోగ యువతలో ఒక రకమైన అసంతృప్తి కనిపిస్తోంది. అదే సమయంలో నిరుద్యోగ భృతి కూడా అమలు చేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది. తాము అధికారంలోకి వస్తే నిరుద్యోగ యువతకు భృతి అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ ఇంతవరకు ఆ హామీ కార్యరూపం దాల్చలేదు. దీంతో నిరుద్యోగ యువతలో ఒక రకమైన అసంతృప్తి నెలకొంది. అటు ఉద్యోగాల నియామక ప్రక్రియ లేక.. ఇటు భృతి ఇవ్వక వారంతా సతమతమవుతున్నారు. అందుకే రోడ్డుపైకి వచ్చి ఆందోళనలు జరుపుతున్నారు. మున్ముందు నిరుద్యోగుల ఆందోళన తీవ్రతరం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.