Undavalli Arun Kumar re-entry: మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ( Undavalli Arun Kumar)పొలిటికల్ రీయంట్రీ ఇస్తారా? తిరిగి ఏదో ఒక పార్టీలో చేరుతారా? వైసీపీలో చేరుతారా? లేకుంటే జనసేనలోకి ఎంట్రీ ఇస్తారా? అసలు ఆ పరిస్థితి ఉందా? ఆయన చేరేందుకు సిద్ధపడినా పార్టీలు చేర్చుకుంటాయా? పొలిటికల్ సర్కిల్లో దీనిపైనే ఆసక్తికర చర్చ నడుస్తోంది. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు ఉండవల్లి అరుణ్ కుమార్. కానీ రాజకీయ విశ్లేషణలు మాత్రం చేస్తున్నారు. ఆయన విశ్లేషణలపై అనేక రకాల అభ్యంతరాలు ఉన్నాయి. అనుకూలంగా వ్యవహరించిన వారు మంచిగా ఉంటాయని చెబుతున్నారు. లేకున్న వారు మాత్రం ఆయన అంతేనని తేలిగ్గా తీసుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ పొలిటికల్ రీయంట్రి పై చర్చ నడుస్తోంది. కానీ ఆయన నుంచి అటువంటి సంకేతాలు రావడం లేదు.
రాష్ట్ర విభజనతో కాంగ్రెస్కు గుడ్ బై..
రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీకి ( Congress Party ) గుడ్ బై చెప్పారు ఉండవల్లి అరుణ్ కుమార్. తరువాత ఆయన ఏ పార్టీతో సంబంధం లేకుండా గడుపుతూ వచ్చారు. కానీ రామోజీరావు మార్గదర్శి చిట్ ఫండ్స్ పై మాత్రం పోరాటం కొనసాగిస్తూ వచ్చారు. సహజంగానే రామోజీరావు అంటే టిడిపి అనుకూల మీడియా అధినేత. ఆపై ఆ పార్టీ శ్రేయోభిలాషి కూడా. రాజశేఖర్ రెడ్డి తరువాత రామోజీరావు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉండేవారు. సో వారిద్దరి ఉమ్మడి శత్రువు ఒకరే కాబట్టి.. ఆయన చంద్రబాబుకు సన్నిహితుడు కాబట్టి.. ఉండవల్లి విశ్లేషణలు, ఆలోచనల గురించి చెప్పనవసరం లేదు. పైగా రాజశేఖర్ రెడ్డి పిలిచి మరి రాజకీయ ప్రోత్సాహం అందించారు. తప్పకుండా తన మాటల్లో జగన్ పట్ల ఫేవర్ కనిపిస్తుంది కూడా. నవ్యాంధ్రప్రదేశ్ కు తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించారు. ఆ ఐదేళ్లపాటు ఉండవల్లి విశ్లేషణ ఒకలా ఉండేది. వైసీపీ పాలించిన మరో ఐదేళ్లలో ఒకలా ఉండేది. ఇప్పుడు ఒకలా ఉంటుంది.
రెండుసార్లు ఎంపీగా..
2004లో పాదయాత్ర సమయంలో ఉండవల్లి అరుణ్ కుమార్ ను పిలిచారు రాజశేఖర్ రెడ్డి( Y S Rajasekhara Reddy ). ఉమ్మడి ఏపీలోనే అత్యంత కీలకమైన రాజమండ్రి పార్లమెంట్ టికెట్ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో ఉండవల్లి అరుణ్ కుమార్ గెలిచారు కూడా. 2009లో సైతం రెండోసారి గెలిచారు ఉండవల్లి అరుణ్ కుమార్. అయితే సంక్షేమ పథకాలు, ఆర్థిక లెక్కలు చెప్పే ఉండవల్లి అరుణ్ కుమార్.. రాజశేఖర్ రెడ్డి పథకాలు గురించి కానీ.. ఆయన పాలనా దక్షత గురించి గానీ ఎన్నడూ విమర్శలు చేయరు. అన్ని లెక్కలు బాగా చూపే చంద్రబాబును మాత్రం విమర్శిస్తారు. జగన్మోహన్ రెడ్డి మొండి వాడిగా అభివర్ణిస్తారు. అలా ప్రతికూలతలు చూపే క్రమంలో కూడా డిఫరెంట్ వేరియేషన్ ఉంటుంది ఉండవల్లి అరుణ్ కుమార్ లో. తెలుగుదేశంతో పాటు చంద్రబాబు విషయంలో చిన్న ప్రతికూలత ఉంటుంది. అదే జగన్మోహన్ రెడ్డి విషయంలో విమర్శలు చేసినా అందులో కొంత సానుకూలత కనిపిస్తుంది.
గౌరవిస్తాయ తప్ప..
ఉండవల్లి అరుణ్ కుమార్ విద్యాధికుడు. ఆపై న్యాయవాది కూడా. సమకాలీన అంశాలపై ఆయనకు అవగాహన ఉంటుంది కూడా. అయితే ఆయన ఇప్పుడు పొలిటికల్ ఎంట్రీ ఇస్తే పార్టీలు ఇట్టే చేర్చుకోవాలి. కానీ ఆయనను గౌరవించే పార్టీలు చేర్చుకునేందుకు మాత్రం ముందుకు రావు. ఎందుకంటే అవి ప్రాంతీయ పార్టీలు. కాంగ్రెస్ పార్టీలో మాదిరిగా ఉండవల్లి ఇష్టారాజ్యంగా విశ్లేషణలు చేసి.. లాజిక్ తో మాట్లాడితే ఇబ్బందికర పరిస్థితులు తప్పవు. అందుకే ఆయన పరోక్ష సహకారం తీసుకోవచ్చు కానీ.. ప్రత్యక్ష సహకారం పొందలేని పరిస్థితి ప్రాంతీయ పార్టీలది. సో ఉండవల్లి అరుణ్ కుమార్ మళ్లీ కాంగ్రెస్ పార్టీ యాక్టివ్ అయితే కానీ.. రాజకీయాలు చేయలేరన్నమాట.