Ugadi 2025 Panchangam: ఉగాది( Ugadi) పర్వదినం నాడు పంచాంగ శ్రవణం కీలక పాత్ర పోషిస్తుంది. రైతుల నుంచి అన్ని వర్గాల ప్రజలు పంచాంగ శ్రవణం కోసం ఆసక్తిగా చూస్తుంటారు. ఈ ఏడాదిలో బాగోగులు, కష్ట నష్టాలు, చీడపీడలు, ప్రకృతి విపత్తులు, వాతావరణ పరిస్థితులు పంచాంగ శ్రవణం ద్వారా తెలుసుకుంటారు. అయితే కొత్తగా రాజకీయ పంచాంగ శ్రవణాలు బలంగా వినిపిస్తుంటాయి. రాజకీయ పార్టీలకు అనుకూలంగా పంచాంగ శ్రవణం వినిపిస్తుండడం గత కొన్నేళ్లుగా చూస్తున్నాం. అందుకే పొలిటికల్ పంచాంగ శ్రవణాలకు ప్రజలు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వరు. ఆ పార్టీ అధినేత ప్రాపకం కోసం.. ఆ పార్టీ శ్రేణుల్లో ఆనందం కోసం నచ్చిన విధంగా చెబుతుంటారు. అందుకే పంచాంగ శ్రవణాలకు విలువ తగ్గిపోయింది.
* రాజకీయ మకిలి
పంచాంగం చాలా ప్రత్యేకమైనది. పంచాంగ శ్రవణమే ఎన్నో శుభాలను తీసుకొస్తుంది. అయితే దురదృష్టవశాత్తు పంచాంగానికి కూడా రాజకీయ మకిలి పట్టింది. గత కొంతకాలంగా అది కాంగ్రెస్( Congress) పంచాంగమా? టిడిపి( Telugu Desam) పంచాంగమా? వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పంచాంగమా? ఇంకో పార్టీ పంచాంగమా? అని అడగాల్సిన ఓ దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడింది. జ్యోతిషాన్ని ఓ శాస్త్రంగా చెబుతారు. కానీ దానిని కూడా రాజకీయం చేసేశారు. ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్లకు అనుకూలంగా జాతకాలు మారిపోతున్నాయి. పంచాంగాలకు కూడా అవే వర్తిస్తున్నాయి. టిడిపి కార్యాలయంలో పంచాంగ శ్రవణం జరిగితే అందుకు తగ్గట్టు పంచాంగం రాసుకొస్తున్నారు పండితులు. ఇలా శాస్త్రాన్ని మరిచి రాజకీయ పండితులుగా మారిపోయారు.
* ఉత్తమ పండితులు ఎందరో..
అయితే అందరినీ ఒకే గాటిలో కట్టలేము. చాలామంది పండితులు ఇప్పటికీ క్రమశిక్షణను కొనసాగిస్తున్నారు. తమ పాండిత్యాన్ని పారదర్శకంగా ప్రదర్శిస్తున్నారు. పంచాంగ శ్రవణానికి ఒక విలువ ఉంది. పంచాంగాలు చదివి పండితుడికి ఓ విలువ ఉంటుంది. ఫలానా రాజకీయ పార్టీకి పరిస్థితిలో అనుకూలం అని పండితులు ఎలా చెప్పగలుగుతున్నారో తెలియడం లేదు. అదే పంచాంగ శ్రవణాన్ని పట్టుకొని రాజకీయ నేతలు( political leaders) రాజకీయాలు చేస్తున్నారు. తమ పార్టీ గ్రహ స్థితి బాగుందని.. వచ్చేది మేమేనని.. లెక్కలు తేల్చుతామని హెచ్చరికలు పంపుతున్నారు ప్రత్యర్థులకు.
* హిందూ సమాజం మేల్కొనుకుంటే..
పంచాంగ శ్రవణం విషయంలో జరుగుతున్న ఈ దురాచారాన్ని నియంత్రించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా హిందూ సమాజం( Hindu religion) అప్రమత్తం గా ఉండాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. ఓవైపు హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయి. కానీ వాటిని పట్టించుకోని ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు.. పంచాంగ శ్రవణాల పేరుతో పొలిటికల్ పబ్లిసిటీ స్టంట్ చేయడమంటే.. అది హిందూ ధర్మాన్ని అవమానించడం తప్ప మరొకటి కాదు.