Heat Waves
Heat Wave: ఏపీలో (Andhra Pradesh) ఎండల తీవ్రత కొనసాగుతోంది. భానుడి భగభగలు కొనసాగుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచి ఎండ తీవ్రత పెరుగుతోంది. గతంలో ఎన్నడూ లేని పరిస్థితి ఎదురవుతోంది. మార్చిలోనే సాధారణం కంటే నాలుగు నుంచి ఆరు డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు ఎండ తీవ్రతతో అల్లాడిపోతున్నారు. ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు ఇబ్బంది పడుతున్నారు. ఉదయం 10 గంటలకే రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. అక్కడా ఇక్కడా అన్న తేడా లేకుండా అన్నిచోట్ల ఉష్ణోగ్రతలు అలానే ఉన్నాయి. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ఉష్ణోగ్రతలు అమాంతం పెరుగుతూ వస్తున్నాయి.
* రాష్ట్రవ్యాప్తంగా అదే పరిస్థితి..
గత కొద్ది రోజులుగా ఎండల తీవ్రత( summer heat) అధికం అవుతూ వస్తోంది. శనివారం 22 జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా 96 చోట్ల ఉష్ణోగ్రతలు 41 డిగ్రీలకు పైగా రికార్డ్ అయ్యాయని పేర్కొంది. 27 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 13 మండలాల్లో వడగాల్పులు వీచినట్లు పేర్కొంది. మరో రెండు రోజులపాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని స్పష్టం చేసింది వాతావరణ శాఖ.
* ఉత్తరాంధ్రలో అధికం
ఉత్తరాంధ్రలో( North Andhra Pradesh) ఎండల తీవ్రత అధికంగా ఉంది. ముఖ్యంగా అనకాపల్లి జిల్లా మాడుగులలో 41.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. ఆ జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు 41 డిగ్రీలకు దాటినట్లు తెలుస్తోంది. ఆదివారం కూడా పలు జిల్లాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. అల్లూరి జిల్లా చింతూరు మండలంలో తీవ్ర వడ గాలులు ఇస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ జిల్లాకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. సోమవారం కూడా అల్లూరు జిల్లాలోని రెండు మండలాల్లో తీవ్ర వడ గాలులు వీస్తాయని పేర్కొంది. చింతూరులో ఆదివారం 43.7 డిగ్రీలు, సోమవారం 45.4° ఉష్ణోగ్రత, మారేడుమిల్లి మండలంలో సోమవారం 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఈ మండలాలతో పాటు మరో 15 మండలాల్లో వడ గాలులు వీస్తాయని స్పష్టం చేసింది వాతావరణ శాఖ.
* ఈరోజు తీవ్ర వడ గాలులు
రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు తీవ్రవడ గాలులు వీచే అవకాశం ఉంది. శ్రీకాకుళం( Srikakulam) జిల్లాలో 20 మండలాల్లో, విజయనగరం జిల్లాలో 23, పార్వతీపురం మన్యం జిల్లాలో 13, అనకాపల్లి జిల్లాలో 11, తూర్పుగోదావరి జిల్లాలో 19, కాకినాడ జిల్లాలో ఏడు, ఏలూరు జిల్లాలో ఏడు, అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఏడు, ఎన్టీఆర్ జిల్లాలో ఐదు మండలాల్లో వడ గాలులు వీస్తాయని హెచ్చరించింది. ఈ జిల్లాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అత్యవసరం అయితే తప్ప ఇళ్ళ నుంచి బయటకు రావద్దని.. జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది.