Twist in AP liquor scam: ఏపీలో మద్యం కుంభకోణం( liqour scam) కేసు మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో ఒకవైపు విచారణ.. ప్రత్యేక దర్యాప్తు బృందం తనిఖీలు.. మరోవైపు నిందితుల అరెస్టు.. కోర్టు బెయిళ్లు కొనసాగుతున్నాయి. తాజాగా జగన్మోహన్ రెడ్డి సన్నిహితుడు నర్రెడ్డి సునీల్ రెడ్డికి సంబంధించిన కార్యాలయాల్లో ఏకకాలంలో ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు తనిఖీలు చేపడుతున్నారు. హైదరాబాద్ తో పాటు విశాఖలోని 11 కార్యాలయాల్లో సోదాలు జరుపుతున్నారు. మద్యం కుంభకోణం కేసులో సునీల్ రెడ్డి సైతం ఉన్నారు. హైదరాబాద్లోని బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3 స్నేహ హౌస్ లో, సాగర్ సొసైటీలో, ఖైరతాబాద్ కమలాపురి కాలనీలో, విశాఖలోని వాల్తేరు రోడ్డులో ఉన్న కార్యాలయాల్లో సిట్ అధికారుల తనిఖీలు ముమ్మరంగా సాగుతున్నాయి. అక్కడ ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులకు కొన్ని ఆధారాలు పట్టుబడినట్లు సమాచారం.
పట్టు బిగిస్తున్న సిట్
మద్యం కుంభకోణం కేసులో పట్టు బిగిస్తోంది ప్రత్యేక దర్యాప్తు బృందం( special investigation team). కానీ ఈ కేసులో అరెస్ట్ అయిన మాజీ ఐఏఎస్ అధికారి ధనంజయ రెడ్డి, అప్పటి జగన్ ఓ ఎస్ డి కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీలు బెయిల్ పై విడుదలయ్యారు. వారిపై ఆధారాలకు సంబంధించి చార్ట్ సీట్లో సరైనవి చూపించలేదు. దీంతో కోర్టు వారికి బెయిల్ ఇచ్చింది. అయితే మిగతా నిందితులకు సంబంధించి బెయిల్ వస్తుందని అంతా భావిస్తున్నారు. అయితే ఆ ముగ్గురు బెయిల్ విషయంలో సిట్ వ్యూహాత్మకంగా వ్యవహరించిందని తెలుస్తోంది. అదే సమయంలో ఐదు రోజుల కిందట మధ్యంతర బెయిల్ పై విడుదలయ్యారు ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి. ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి సమన్వయం చేసుకునేందుకుగాను ఆయన వేసిన పిటిషన్ మేరకు ఏసిబి కోర్టు బెయిల్ ఇచ్చింది. ఐదు రోజుల అనంతరం కోర్టు ఆదేశాల మేరకు రాజమండ్రి సెంట్రల్ జైల్లో సరెండర్ అయ్యారు మిధున్ రెడ్డి.
తేలిగ్గా తీసుకున్న వైసీపీ..
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ మద్యం కుంభకోణం కేసును చాలా తేలిగ్గా తీసుకుంది. అసలు ఇందులో ఆధారాలు లేవని చెప్పుకొచ్చింది. కానీ సిట్ దర్యాప్తు చూస్తుంటే లోతైన విచారణలా కనిపిస్తోంది. మరోవైపు నిందితులకు బెయిల్ వస్తోంది. ఇటువంటి కన్ఫ్యూజన్ వాతావరణంలో జగన్మోహన్ రెడ్డికి సన్నిహితుడిగా భావిస్తున్న సునీల్ రెడ్డి కంపెనీల్లో ఏకకాలంలో సోదాలు జరుగుతుండడం ప్రాధాన్యతను సంతరించుకుంది.ఏక కాలంలో 10 కంపెనీల్లో తనిఖీలు చేస్తుండడం సంచలనంగా మారింది. అక్కడ కీలక ఆధారాలు లభ్యమైనట్లు ప్రచారం నడుస్తోంది.