Twist in AP liquor scam: ఏపీలో( Andhra Pradesh) మద్యం కుంభకోణం ప్రకంపనలు సృష్టిస్తోంది. రోజుకో మలుపు తిరుగుతోంది. ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తేలిగ్గా తీసుకుంది. కానీ సిట్ మాత్రం లోతైన దర్యాప్తు చేస్తోంది. రోజుకో కొత్త కోణాన్ని బయటపెడుతోంది. మరోవైపు ఈ కేసులో ముగ్గురు నిందితులు బెయిల్ పై బయటకు వచ్చారు. మిగతా వారి సైతం బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. 90 రోజులు రిమాండ్ దాటిన వారు డిఫాల్ట్ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రస్తుతం వారు ఆ ప్రయత్నాల్లో ఉండగా.. ప్రత్యేక దర్యాప్తు బృందం మాత్రం వెనక్కి తగ్గలేదు. మొన్నటికి మొన్న హైదరాబాద్ తో పాటు విశాఖలో తనిఖీలు చేపట్టిన సిట్ సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఏకంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రంగంలోకి దిగింది. ఏకకాలంలో ఐదు రాష్ట్రాల్లో తనిఖీలు జరిపింది. తద్వారా సంచలనాల నమోదుకు అవకాశం కలుగుతోంది. మున్ముందు మద్యం కుంభకోణం లో సరికొత్త అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
దేశంలో పెద్ద కుంభకోణం..
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ హయాంలో భారీ మద్యం కుంభకోణం జరిగిందన్నది కూటమి ప్రభుత్వ అనుమానం. అందుకే ఇందుకుగాను విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది. ఇప్పటివరకు 29 మంది వ్యక్తులు, 19 సంస్థలను నిందితులుగా చేర్చింది. 12 మంది అరెస్ట్ కూడా జరిగింది. రాజ్ కసిరెడ్డి నుంచి ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వరకు అరెస్టుల పర్వం నడిచింది. ఇక అంతిమ లబ్ధిదారుడు అరెస్టు అన్నంతవరకు పరిస్థితి వెళ్ళింది. అయితే చార్జ్ షీట్లో సరైన ఆధారాలు చూపలేదన్న కారణంతో అప్పటి సీఎం ఓ అధికారి ధనంజయ రెడ్డి, జగన్ ఓ ఎస్ డి కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, పైలా దిలీప్ బయటకు వచ్చారు. కానీ ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడుతో సహా మొత్తం ఎనిమిది మంది ఇంకా జైల్లోనే ఉన్నారు. మరోవైపు మద్యం ముడుపులను ఎన్నికలకు ముందు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు తరలించారు అన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తో పాటు వెంకటేష్ నాయుడు పాత్ర ఉందని అనుమానాలు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రాయలసీమకు చెందిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల పేర్లు సైతం బయటకు వస్తున్నాయి. సిట్ దాఖలు చేసిన మూడో చార్జిషీట్లో సైతం ఇలా ముడుపులు వైసీపీ అభ్యర్థులకు అందినట్లు ప్రస్తావన ఉంది. ఇలా ఒకవైపు సిట్ లోతైన దర్యాప్తు కొనసాగిస్తోంది.
ఐదు రాష్ట్రాల్లో ఈడి..
అయితే ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్( enforcement directorate) రంగంలోకి దిగడం కేసు తీవ్రతను తెలియజేప్పుతోంది. రూ. 3500 కోట్ల మద్యం కుంభకోణం బయటపడడంతోనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రంగంలోకి దిగింది. తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీలో ఈడీ తనిఖీలు చేపట్టింది. మద్యం కుంభకోణం కేసులో నిందితుల సంస్థలు, కార్యాలయాల్లో అధికారులు ఏకకాలంలో సోదాలు చేశారు. దాదాపు 5 రాష్ట్రాల్లోని 20 ప్రాంతాల్లో ఈ తనిఖీలు కొనసాగాయి. దీంతో జాతీయ స్థాయిలో సైతం ఏపీ మద్యం కుంభకోణం ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. భారీ స్థాయిలో అవినీతి జరిగినట్టు కూటమి ప్రభుత్వం అనుమానించింది. ఆ అనుమానాలకు తగ్గట్టే పరిస్థితులు ఉన్నాయి. మున్ముందు మద్యం కుంభకోణంలో సంచలనాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. చూడాలి ఏం జరుగుతుందో..