Homeఆంధ్రప్రదేశ్‌BARC Rating : ఎన్టీవీ ని మరింత గట్టిగా కొట్టిన టీవీ9..ఎవరూ బ్రేక్ చేయని రేటింగ్స్...

BARC Rating : ఎన్టీవీ ని మరింత గట్టిగా కొట్టిన టీవీ9..ఎవరూ బ్రేక్ చేయని రేటింగ్స్ సొంతం..

BARC Rating : టీవీ9 ఛానల్ కొనుగోలు చేసిన యాజమాన్యం నక్కతోక తొక్కినట్టుంది. అందుకే నెత్తి మాసిన వార్తలు ప్రసారం చేస్తున్నప్పటికీ.. బ్రేకింగ్ పేరుతో న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నప్పటికీ.. శుష్క కథనాలతో ఎలపరం కలిగిస్తున్నప్పటికీ.. ఇప్పటికీ నెంబర్ వన్ స్థానంలోనే కొనసాగుతోంది. ప్రస్తుత బార్క్ రేటింగ్స్ (వీటి విషయంలో బొచ్చెడు ఆరోపణలు) ప్రకారం టీవీ9 ఎన్టీవీ మరింత బలంగా కొట్టింది. గత ఏడాది ఇదే సమయానికి టీవీ9 ను క్రాస్ చేసి ఎన్టీవీ నెంబర్ వన్ పొజిషన్ కు వచ్చేసింది. ఆ సమయంలో కుట్రలతో నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్నారని టీవీ9 అడ్డగోలు ప్రచారం చేసింది. మరి ఇప్పుడు అదే టీవీ 9 గత కొంతకాలంగా నెంబర్ వన్ స్థానంలో ఉంది. ఏ కుట్రలు చేస్తే నెంబర్ వన్ స్థానంలోకి వచ్చిందో ఆ ఛానల్ లో తిష్ట వేసిన పెద్దలకే తెలియాలి. వాస్తవానికి ఆ పెద్దల మీద ఎవరికీ సదాభిప్రాయం లేదు. పైగా వాట్సాప్ గ్రూప్ లలో వారి వ్యవహార శైలిపై బోలెడన్ని కథనాలు వస్తున్నాయి. తలతిక్క వార్తలు ప్రసారం చేస్తున్నప్పటికీ టీవీ9 కు ఇప్పట్లో ఎవరూ అధిగమించలేని రేటింగ్స్ ఎలా వస్తున్నాయనేది ఎంతకీ అంతు పట్టడం లేదు.. బార్క్ రేటింగ్ మీటర్లు ఉన్న ఇళ్లు అదనంగా దొరికాయని.. వాటిని గట్టిగా పట్టుకోవడంలో ఎన్టీవీ విఫలమైందని.. మీడియా సర్కిళ్లలో జోరుగా ప్రచారం జరుగుతోంది.

ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అటు టీవీ9, ఇటు ఎన్టీవీ ని కాస్త దూరం పెట్టింది. వైసిపి అధికారంలో ఉన్నప్పుడు ఈ రెండు చానల్లో జగన్ కు భజన చేశాయని, తమను బద్నాం చేశాయని టిడిపి ప్రధాన ఆరోపణ.. ఈ రెండు వైసిపి ప్రో ఛానల్స్ అయినప్పటికీ.. ప్రస్తుత రేటింగ్స్ ప్రకారం చూసుకుంటే ఒకప్పుడు టీవీ9 స్థానాన్ని ఆక్రమించి.. తాత్కాలిక ప్రథమ స్థాన విజేతగా ఆవిర్భవించిన ఎన్టీవీ.. ప్రస్తుతం టీవీ9 సాధించిన బార్క్ రేటింగ్స్ లో దాదాపు సగం అంటే ఆశ్చర్యం అనిపించక మానదు. ఈ ప్రకారం టీవీ9 తో పోల్చి చూసుకుంటే ఎన్టీవీ తన పాపులారిటీని సగం కోల్పోయిందనుకోవాలి. వాస్తవానికి అంతకుముందు ఎన్టీవీ ఎటువంటి సత్తాను ప్రదర్శించింది? ఇప్పుడెందుకు రేసులో వెనకబడింది? అది ప్రథమ స్థానాన్ని సాధించలేదా? నరేంద్ర చౌదరి ఆ స్థాయిలో దాన్ని ప్రొజెక్ట్ చేయలేడా? ప్రస్తుతం తెలంగాణలో గవర్నమెంట్ కు పాజిటివ్ గానే ఎన్టీవీ వ్యవహరిస్తోంది కదా? ఆ మధ్య రేవంత్ రెడ్డి నరేంద్ర చౌదరి ఇంట్లో లంచ్ కూడా చేశాడు కదా? ఈ అంశాలు సానుకూలంగా ఉన్నా ఎన్టీవి ఎందుకు నెంబర్ వన్ కాలేకపోతుందనేది అంతు పట్టడం లేదు. ఇక ఈ జాబితాలో సాక్షి మరింత దారుణంగా పడిపోయింది. సేమ్ దాని ఓనర్ జగన్మోహన్ రెడ్డి 11 సీట్లు సాధించిన ఘనత లాగానే.. వాస్తవానికి ఎన్నికలకు ముందు సాక్షి పరిస్థితి కాస్త బెటర్ అనిపించింది. కచ్చితంగా టాప్ త్రీ లోకి వస్తుందనిపించింది. కానీ ఎన్నికల తర్వాత సాక్షి ఏకంగా ఎనిమిదో స్థానానికి పడిపోయింది..

ఇక హైదరాబాద్ రేటింగ్స్ ప్రకారం చూసుకుంటే టీవీ9 152 తో తిరుగులేని స్థానంలో కొనసాగుతోంది. ఎన్టీవీ 63 రేటింగ్స్ తో ఐదో స్థానంలో ఉంది. 10 టీవీకి ఐతే ఏకంగా 3.9 రేటింగ్స్.. ఈ లెక్కన హైదరాబాదులో ఆ ఛానల్ ను ఎవరూ చూడడం లేదని అర్థం. ఇక టాల్కం పౌడర్ ఛానల్ మహా న్యూస్ సాక్షి టీవీ కంటే బెటర్ పొజిషన్లో ఉండడం జగన్మోహన్ రెడ్డికి దారుణమైన పరాభవం. ఇక మిగతా చానల్స్ అంటారా.. వాటి గురించి చర్చ ఇక్కడ అనవసరం. సాధన సంపత్తి విషయంలో గొప్ప స్థానంలో ఉన్న ఈటీవీ, సాక్షి నానాటికి దారుణమైన రేటింగ్స్ నమోదు చేస్తుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. వాస్తవానికి ఈ రేటింగ్స్ చూసి వాటి యాజమాన్యాలు ఏమాత్రం సమీక్ష నిర్వహించవా? క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో పట్టించుకోవా? సిబ్బంది తో మాట్లాడవా? వాస్తవ పరిస్థితి చూస్తుంటే అలాంటిది జరగడం లేదని తెలుస్తోంది. ఒకవేళ అలాంటివే జరిగి ఉంటే రేటింగ్స్ ఇలా ఎందుకు ఉంటాయి? అంటే మిగతా చానల్స్ లో జరుగుతున్నాయని కాదు.. కాకపోతే అందులో కాస్త లెగ్ వర్క్ జరుగుతోందని.. అది ఎంతో కొంత జనాల్ని టచ్ చేస్తోందని అర్థం.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version