Tuni Incident: ఇద్దరు పిల్లలు.. వారికి పెళ్లిళ్లు అయ్యాయి.. మనవళ్లు ఉన్నారు.. మనవరాలు ఉన్నారు. అటువంటి వ్యక్తి ఏడు పదుల వయసులో ముక్కు పచ్చలారని ఓ బాలికపై అత్యాచారం చేశాడు. తాతయ్యనని చెప్పి పాఠశాల నుంచి బయటకు తీసుకెళ్లాడు. లైంగిక దాడి చేశాడు. ఓ యువకుడు వీడియో తీసి ప్రశ్నించాడు. సోషల్ మీడియాలో( social media) పెట్టాడు. పోలీసులు అరెస్టు చేశారు. కుటుంబ పరువు గంగ పాలయ్యింది. ఇక బతకడం వేస్ట్ అనుకున్న ఆ వృద్ధుడు చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తనకు తానే శిక్ష విధించుకున్నాడు. తుని బాలిక ఘటనకు సంబంధించి నిందితుడి ఆత్మహత్యతో కొత్త మలుపు తిరిగింది. అయితే ఈ ఘటన ఎన్నెన్నో గుణపాఠాలు నేర్పింది. మనిషిలో ఉన్న కామ వాంఛ పతాక స్థాయికి చేరితే.. వయసుకు మించి ఆలోచనలు చేస్తే దాని దుష్పరిణామాలు ఎలా ఉంటాయో ఈ ఘటన తెలియజేస్తోంది.
* భావోద్వేగాలు అదుపులో ఉంటేనే..
ప్రతి మనిషిలో బాల్యం, యవ్వనం, నడి వయస్సు, వృద్ధాప్యం ఉంటాయి. ఏ వయసులో చేయాల్సిన పనులు.. ఆ వయసులో చేస్తేనే సంఘంలో గౌరవం. లేకుంటే తుని నారాయణరావు( Narayan Rao ) ఘటనే ఒక గుణపాఠం. విపరీతమైన భావోద్వేగాలలో కామం ఒకటి. దాన్ని అదుపులో ఉంచుకుంటేనే మంచిది. లేకుంటే ఇబ్బందికరమే. సమాజంలో అగౌరవమే. ప్రస్తుతం ఏదో ఒకచోట చిన్నారిపై వృద్ధుడి అఘాయిత్యం.. తాత వయసులో ఉన్న వ్యక్తి లైంగిక దాడి.. లాంటి వార్తలు వింటూనే ఉన్నాము. కానీ ఆ పరిస్థితులకు దారి తీసే కోరికలను అదుపు చేసుకోవడం ఉత్తమం. లేకుంటే ఒక కుటుంబాన్ని నిర్మించి.. ఎన్నో కుటుంబాలతో స్నేహం, బంధుత్వం కలుపుకున్న తరువాత పెద్దరికానికి మాయని మచ్చ తెచ్చుకోవడం కూడా స్వయంకృతాపమే అవుతుంది.
* ఎన్నెన్నో ప్రశ్నలు..
తునిలో( tuni) జరిగిన ఈ ఘటనకు సంబంధించి రాజకీయ కోణంలోనే ఎక్కువగా ప్రచారం సాగుతోంది. అప్పుడెప్పుడో ఆయన రాజకీయ నాయకుడు కానీ ఇప్పుడు క్రియాశీలకంగా లేరట. మరోవైపు తాతయ్య అని పేరు చెప్పి బాలికను బయటకు తీసుకెళ్లడం ఏంటి? అంత జరుగుతుంటే కుటుంబ సభ్యులకు తెలియదా? సమీప బంధువు కాకుంటే పాఠశాలలో విడిచి పెడతారా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. అఘాయిత్యానికి బాధితురాలిగా ఆ బాలికతో పాటు కుటుంబం నిలవగా… నారాయణరావు మృతితో ఆ కుటుంబం అంతులేని విషాదంలోకి వెళ్లిపోయింది. అంతకంటే మించి విపరీతమైన పరువు నష్టం జరిగింది ఆ కుటుంబానికి. కానీ తప్పు చేయాలనుకున్న వారికి.. పిల్లల విషయంలో నిర్లక్ష్యంగా ఉన్న కుటుంబ సభ్యులు, పాఠశాలల యాజమాన్యాలకు ఈ ఘటన ఒక హెచ్చరిక.