TTD Trust Board : తిరుమల( Tirumala) తొక్కిసలాట ఘటనకు సంబంధించి ఇంకా ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి టోకెన్ల జారీ ప్రక్రియలో అపశృతి చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. తొక్కిసలాట జరిగి ఆరుగురు భక్తులు మృతి చెందారు. 40 మంది వరకు గాయపడ్డారు. ఈ ఘటన యావత్ దేశంలోనే దిగ్భ్రాంతి కలిగించింది. టీటీడీతోపాటు కూటమి ప్రభుత్వంపై కూడా విమర్శలు ఆగడం లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వంతో పాటు టీటీడీ దిద్దుబాటు చర్యలకు దిగింది. మృతుల కుటుంబాలకు 25 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా తో పాటు ప్రభుత్వ కాంట్రాక్టు ఉద్యోగాన్ని ఇచ్చేందుకు టీటీడీ( TTD ) ముందుకు వచ్చింది. ఈరోజు మృతుల కుటుంబాలకు స్వయంగా టిటిడి సభ్యులు వెళ్లి చెక్కులు అందించనున్నారు. టీటీడీ సర్వసభ్య సమావేశం నిర్వహించిన చైర్మన్ బి ఆర్ నాయుడు ఆరుగురు మృతులకు సంబంధించిన కుటుంబ సభ్యులకు స్వయంగా చెక్కులు పంపిణీ చేయడానికి బోర్డు సభ్యులతో రెండు కమిటీలను ఏర్పాటు చేశారు. ఆ కమిటీలు ఈరోజు మృతుల కుటుంబ సభ్యులను కలవనున్నాయి. చెక్కులు అందించనున్నాయి.
* రెండు కమిటీల ఏర్పాటు విశాఖపట్నం( Visakhapatnam), నర్సీపట్నం సందర్శించే బృందంలో బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ, జంగా కృష్ణమూర్తి, పనబాక లక్ష్మి, జానకి దేవి, మహేందర్ రెడ్డి, ఎమ్మెస్ రాజు, భాను ప్రకాష్ రెడ్డి ఉన్నారు. ఇక తమిళనాడుతో పాటు కేరళలో మృతుల కుటుంబాలను కలవనున్న కమిటీలు రామమూర్తి, కృష్ణమూర్తి వైద్యనాథన్, నరేష్ కుమార్, శాంతారామ్, సుచిత్ర ఎలా ఉన్నారు. ఈ రెండు కమిటీలు ఆయా ప్రాంతాల్లోని మృతుల కుటుంబాల ఇళ్లను సందర్శించి చెక్కులు అందించనున్నాయి. ఈ చెక్కుల పంపిణీలో స్థానిక ఎమ్మెల్యేలు కూడా పాల్గొనాలని ప్రభుత్వం సూచించింది.
* గాయపడిన వారికి సాయం
మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయంతో పాటు ఇంటిలో ఒకరికి కాంట్రాక్టు ఉద్యోగం( contract basic job) ఇవ్వనున్నారు. సంబంధిత కుటుంబాల్లో చిన్నపిల్లలు ఉంటే టీటీడీ సంస్థల్లో ఉచిత విద్యను అందించడానికి నిర్ణయించారు. అయితే ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వారికి సైతం టీటీడీ సాయం ప్రకటించింది. ఇప్పటికే గాయపడిన ఏడుగురికి ఆసుపత్రికి వెళ్లి మరి చెక్కులు పంపిణీ పూర్తి చేశారు. కార్యక్రమంలో టిడిపి ఎమ్మెల్యేలు షాజహాన్, పులివర్తి నాని, బొజ్జల సుధీర్ రెడ్డి, గాలి భాను ప్రకాష్, టీటీడీ జేఈవో వీరబ్రహ్మం, తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్ వి కుమార్ పాల్గొన్నారు. కాగా ఈ రెండు కమిటీల పర్యటనకు సంబంధించి రవాణా, ఇతరత్రా ఖర్చులను చైర్మన్ బి ఆర్ నాయుడు సొంతంగా భరించనున్నారు.
* అదే పనిగా వైసీపీ విమర్శలు
అయితే ఈ ఘటనకు సంబంధించి వైసీపీ( YSR Congress ) నుంచి ఇంకా విమర్శలు ఆగడం లేదు. ప్రభుత్వంతో పాటు టీటీడీని టార్గెట్ చేసుకుంటూ తీవ్ర విమర్శలకు దిగుతున్నారు వైసీపీ నేతలు. కూటమి ప్రభుత్వంలో టీటీడీ చరిత్ర మసకబారిందని తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అటు పవన్ పై కూడా విరుచుకుపడుతున్నారు. పవన్ కు ధైర్యం ఉంటే ఇప్పుడు ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టాలని సవాల్ చేస్తున్నారు. మరోవైపు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారా దర్శనాలు జరుగుతున్నాయి. తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది.