TTD: టీటీడీ ట్రస్ట్ బోర్డ్.. బిజెపి నేతలకు దక్కని చోటు!

ఏపీ బీజేపీ నేతలు ఆవేదనలో ఉన్నారు. అవకాశాలు దక్కకపోయేసరికి అసంతృప్తితో గడుపుతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు నియామకంలో బిజెపి నేతలకు అవకాశం ఇవ్వలేదు. దీంతో వారు పడుతున్న బాధ వర్ణనాతీతం.

Written By: Dharma, Updated On : November 1, 2024 11:19 am

TTD

Follow us on

TTD: టీటీడీ ట్రస్ట్ బోర్డును ప్రకటించారు. చైర్మన్ గా టీవీ5 అధినేత బిఆర్ నాయుడు నియమితులయ్యారు. మరో 24 మంది సభ్యులను సైతం తీసుకున్నారు. సభ్యులుగా టిడిపి ఎమ్మెల్యేలు ముగ్గురికి అవకాశం దొరికింది. ఆ పార్టీ నేతలకు సైతం ఛాన్స్ ఇచ్చారు. జనసేన సిఫార్సులకు పెద్దపీట వేశారు. వివిధ రంగాల ప్రముఖులకు అవకాశాలు కల్పించారు. అయితే ఏపీ బీజేపీ నేతలను మాత్రం కనీస పరిగణలోకి తీసుకోలేదు. ఒక్కరంటే ఒక్కరిని కూడా సభ్యులుగా నియమించలేదు. దీంతో బిజెపిలో ఒక రకమైన అసంతృప్తి కనిపిస్తోంది. చాలామంది బిజెపి నేతలు తిరుమల వ్యవహారాలపై ఎక్కువగా దృష్టి పెడతారు. గత ఐదేళ్ల వైసిపి పాలనలో టీటీడీలో వైఫల్యాలను చాలామంది బిజెపి నేతలు బయటపెట్టారు. హై కమాండ్ కు ఫిర్యాదు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ అప్పట్లో ఉన్న రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా హైకమాండ్ పెద్దగా పట్టించుకోలేదు. అయితే తాము భాగస్వామ్యంగా ఉన్న కూటమి ప్రభుత్వం రావడంతో.. తమ సేవలను వినియోగించుకుంటారని బిజెపి నేతలు భావించారు. కానీ టీటీడీ ట్రస్ట్ బోర్డు జాబితాలో తమ పేర్లు లేకపోయేసరికి సదరు బిజెపి నేతలు తెగ బాధపడిపోయారు. తమను కనీస పరిగణలోకి తీసుకోకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. తొలి నుంచి బిజెపిని నమ్ముకున్న తమకు అన్యాయమే జరుగుతోందన్న ఆవేదన, బాధ వారిలో కనిపిస్తోంది.

* సార్వత్రిక ఎన్నికల్లో అలా
మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో జతకట్టింది బిజెపి. జనసేన ను కలుపుకొని మూడు పార్టీలు కలిసి పోటీ చేశాయి. అయితే బిజెపికి ఆరు పార్లమెంట్ స్థానాలతో పాటు పది అసెంబ్లీ సీట్లు కేటాయించారు. అయితే అందులో ఒకటి రెండు తప్ప మిగిలిన సీట్లలో కొత్తగా వచ్చిన వారు మాత్రమే పోటీ చేశారు. బిజెపి కోసం అహర్నిశలు శ్రమించిన చాలామంది నేతలకు అప్పట్లో టిక్కెట్లు దక్కలేదు. పోనీ కూటమి గెలిచిన తర్వాత నామినేటెడ్ పోస్టులు దక్కుతాయని భావించారు. అక్కడ కూడా వారికి మొండి చేయి మిగిలింది. ఇప్పుడు టీటీడీ ట్రస్ట్ బోర్డులో సైతం తమకు చాన్స్ దక్కలేదని బిజెపి నేతలు చాలామంది బాధపడుతున్నారు. పదవులు, భవిష్యత్తుపై ఆశలు వదులుకుంటున్నారు.

* ఆ యాక్టివ్ నేతలకు సైతం
తిరుపతికి చెందిన భాను ప్రకాష్ రెడ్డి నిత్యం టిటిడి వైఫల్యాల గురించి మాట్లాడుతుంటారు. ఆయన చాలా రోజులుగా బిజెపిలో కొనసాగుతున్నారు. బిజెపి భావజాలాన్ని వ్యక్తం చేయడంలో ముందుంటారు. అదే సమయంలో రాయలసీమకు చెందిన చాలామంది బిజెపి నేతలు తిరుమల తిరుపతి దేవస్థానం వ్యవహారాలపై ఎక్కువగా దృష్టి పెడుతుంటారు. కూటమి రావడంతో దేవుడు సేవకు తమకు చాన్స్ ఇస్తారని వారు భావించారు. ఓ నేత అయితే బిజెపి మాజీ చీఫ్ ద్వారా హై కమాండ్ కు దరఖాస్తు కూడా చేసుకున్నారు. కేంద్ర పెద్దలకు కూడా విజ్ఞప్తి చేశారు. అయితే బిజెపి నేతలకు ఛాన్స్ మాత్రం ఇవ్వలేదు. కానీ గుజరాత్ కు చెందిన డాక్టర్ అజిత్ దేశాయ్ మాత్రం బిజెపి కీలక మంత్రి సిఫారసులతో టీటీడీ ట్రస్ట్ బోర్డు సభ్యుడిగా పదవి దక్కించుకోవడం విశేషం.