TTD Ghee Controversy: టీటీడీ లడ్డూ కేసు విచారణ పూర్తయింది. కోర్టులో ప్రత్యేక దర్యాప్తు బృందం చార్జ్ షీట్ దాఖలు చేసింది. దాదాపు 600 పేజీల్లో నివేదించింది. అయితే కొన్ని మీడియా సంస్థలు అతిగా స్పందిస్తున్నాయి. తమ చేతిలో సిట్ చార్జ్ షీట్ నివేదిక అంటూ ప్రచారం మొదలుపెట్టాయి. వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో లడ్డు తయారీకి సంబంధించి నెయ్యిలో జంతు కొవ్వు కలిసింది అన్నది ప్రధాన ఆరోపణ. అయితే ఈ చార్జ్ షీట్లో ఎటువంటి జంతు కొవ్వు నెయ్యిలో కలపలేదని.. చాలా తక్కువ శాతం జంతువు కలిసిందని.. అసలు ఇది నెయ్యి కాదని.. పామాయిల్ తో కూడిన మిశ్రమంతో తయారు చేసిన నెయ్యి అని.. ఇలా రకరకాలుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి. కానీ అసలైన లాజిక్ ను మరిచిపోతున్నారు. నెయ్యి కల్తీ జరిగిందా? లేదా? అనే విషయంపై స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. అయితే సిట్ తాజా చార్జ్ షీట్ చూస్తే మాత్రం కల్తీ జరిగిందని మాత్రం స్పష్టంగా తెలిసిపోతుంది.
* పూర్తి ఆధారాలతో నివేదిక.. సుప్రీంకోర్టు( Supreme Court) ఆదేశాలతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించారు. గత కొద్ది నెలలుగా విచారణ చేపట్టారు. ఈ దర్యాప్తులో అనేక అక్రమాలపై నిగ్గు తేల్చారు. దాదాపు పదికి పైగా రాష్ట్రాల్లో విస్తరించిన ఈ భారీ నెట్వర్క్ లో 36 మంది నిందితులు, డజన్ల కొద్ది డైరీ సంస్థలు, ప్రభుత్వ అధికారులు, హవాలా మధ్యవర్తులు ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. నిబంధనల మార్పు నుంచి నకిలీ రికార్డుల సృష్టి వరకు ప్రతి దశలోనూ వ్యవస్థీకృత కుట్ర జరిగినట్లు సిట్ నిర్ధారించింది. విశ్వసనీయమైన సహకార డైరీ లను టెండర్ల నుంచి తప్పించి.. ప్రైవేటు సంస్థలకు లబ్ధి చేకూర్చేలా 2020లో నిబంధనలను భారీగా సడలించిన విషయాన్ని కూడా ప్రస్తావించింది.. పాల సేకరణ, సామర్థ్యం, అనుభవ కాలం వంటి కీలక అంశాల్లో రాజీ పడడం వల్ల నాణ్యత లేని చిన్న డైరీలకు మార్గం సుగమం అయినట్లు గుర్తించింది. దీనివల్ల శ్రీవారి లడ్డూ నాణ్యత పై తీవ్ర ప్రభావం పడింది.
* వైసిపి వింత వాదన..
అయితే వైయస్సార్ కాంగ్రెస్ ( YSR Congress )పార్టీ, దాని అనుకూల మీడియా ఆరాటం వేరేలా ఉంది. జంతు కొవ్వు కలపలేదన్న వాదనను తెరపైకి తెస్తున్నారు. అసలు పాలు లేదా వెన్నను వాడకుండానే పామాయిల్, కర్నెల్ ఆయిల్ వంటి నూనెలను కలిపి కృత్రిమ నెయ్యిని తయారు చేసినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణలో తేలింది. ల్యాబ్ పరీక్షల్లో దొరక్కుండా ఉండేందుకు బీటా క్యారోటిన్, అసిటిక్ యాసిడ్ ఎస్టర్ వంటి రసాయనాలను, కృత్రిమ సువాసనలను జోడించారు. సుమారు 68 లక్షల కిలోల కెమికల్ నెయ్యిని లడ్డూ తయారీలో వినియోగించినట్లు గుర్తించారు. గుజరాత్ లోని NDDB ల్యాబ్ లో ఈ నెయ్యిలో జంతువుల కొవ్వు, అవశేషాలు కలవలేదని నిర్ధారణ అయింది. కానీ కెమికల్ నెయ్యి తయారుచేసినట్లు మాత్రం గుర్తించారు. మరోవైపు నిందితులు డిలీట్ చేసిన డిజిటల్ డేటాను ఫోరెనిక్స్ ద్వారా వెలికి తీసింది సిట్. దాదాపు 500 రకాల బలమైన ఆధారాలను కోర్టుకు సమర్పించింది. ఇంత జరిగిన తరువాత కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, దాని అనుకూల మీడియా మాత్రం జంతు కొవ్వు కలవలేదని.. కల్తీ జరగలేదని అర్థం వచ్చేలా ప్రచారం చేస్తుండడం విశేషం.