Arava Sridhar: ఏపీ( Andhra Pradesh) రాజకీయాల్లో రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహార శైలి హాట్ టాపిక్ అవుతోంది. ఈ విషయంలో జనసేన నాయకత్వం కార్నర్ అవుతోంది. అయితే అరవ శ్రీధర్ 2024 ఎన్నికల్లో టికెట్ దక్కించుకున్నారు జనసేన నుంచి. పొత్తులో భాగంగా రైల్వే కోడూరు నియోజకవర్గాన్ని జనసేనకు కేటాయించారు. అయితే ఆ సమయంలో అనూహ్యంగా అరవ శ్రీధర్ కు టికెట్ దక్కింది. అయితే ఆయన కంటే ముందే మరొకరికి టికెట్ కేటాయించారు పవన్ కళ్యాణ్. కానీ జనసేన తో పాటు టిడిపి నుంచి వచ్చిన అభ్యంతరాలతో అభ్యర్థిని మార్చారు. అరవ శ్రీధర్ కు చాన్స్ ఇచ్చారు. అయితే ఇప్పుడు అదే శ్రీధర్ వివాదాల్లో చిక్కుకోవడం, జనసేనకు ఇబ్బందుల్లో పెట్టడం విశేషం.
* సాధారణ సర్పంచ్..
అరవ శ్రీధర్( Arava Sridhar) ఒక సాధారణ సర్పంచ్. అయితే 2024 ఎన్నికలకు కొద్ది రోజుల ముందు జనసేనలో చేరారు. అయితే అప్పటికే జనసేన అభ్యర్థిగా యనమల భాస్కరరావు అనే నేత పేరును ప్రకటించారు. కానీ క్షేత్రస్థాయి నుంచి అందిన నివేదికలు, జిల్లా నాయకుల అభిప్రాయాలను పవన్ కళ్యాణ్ తో పాటు జనసేన అగ్రనేతలు పరిశీలించారు. ఆపై టిడిపి, జనసేన వర్గాలతో చర్చించిన పవన్ కళ్యాణ్ రైల్వే కోడూరు అభ్యర్థిగా అరవ శ్రీధర్ను ప్రకటించారు. పార్టీలో చేరిన నాలుగు రోజులకే టికెట్ దక్కించుకున్న శ్రీధర్ అనూహ్యంగా 11 వేల కు పైగా ఓట్ల మెజారిటీతో గెలిచారు.
* రిజర్వుడు నియోజకవర్గం కావడంతో..
రైల్వే కోడూరు నియోజకవర్గ పరిధిలోని ముక్కావారిపల్లె( mukkabari Palli ) పంచాయితీకి సర్పంచ్ గా ఉండేవారు అరవ శ్రీధర్. యువకుడు కావడంతో ప్రజల్లోకి బాగా చొచ్చుకెళ్లారు. రైల్వే కోడూరు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం కావడంతో ఆలోచన చేశారు అరవ శ్రీధర్. వెంటనే జనసేనలోకి జంప్ చేశారు. అయితే అప్పటికే యనమల భాస్కరరావు అనే నేత పేరును ప్రకటించారు. కానీ నియోజకవర్గంలోని టిడిపి తో పాటు జనసేన నేతలను సమన్వయం చేసుకున్నారు శ్రీధర్. అలా అరుదైన అవకాశం దక్కించుకున్నారు. పోటీ చేసిన తొలిసారి గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టారు.. కానీ ఏడాదిన్నరలోనే ఈ వివాదాలన్నింటినీ మూటగట్టుకున్నారు. తన పొలిటికల్ కెరీర్ ను ప్రమాదంలో పెట్టుకున్నారు.