TTD Declaration Issue: తిరుమలలో అన్యమతస్తులు డిక్లరేషన్ ఇవ్వాలన్న నిబంధన ఉంది. లడ్డు వివాదం నేపథ్యంలో తిరుమల సందర్శనకు వెళ్లిన జగన్ సైతం డిక్లరేషన్ ఇవ్వాల్సిందే నన్న డిమాండ్ టిడిపి నుంచి వినిపించింది.అయితే అప్పట్లో ఎటు తేల్చుకోలేక జగన్ చివరి నిమిషంలో తన తిరుమల పర్యటన రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇదే అంశంపై ఇద్దరు టిడిపి ఎమ్మెల్యేలు ఇప్పుడు అడ్డంగా బుక్కయ్యారు. సీఎం చంద్రబాబు సతీ సమేతంగా తిరుమలను సందర్శించారు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం టిటిడి అధికారులతో సమావేశం నిర్వహించారు.సీఎం అధికారిక ప్రకటన కావడంతో ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. వీరిలో గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం థామస్, మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ భాషా తదితరులు ఉన్నారు. వీరిద్దరూ అన్యమతస్తులు కావడంతో డిక్లరేషన్ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. అయితే ఇందులో ఒక్కరు డిక్లరేషన్ ఇవ్వలేదన్నట్లు తెలుస్తోంది. మరొకరు డిక్లరేషన్ ఇచ్చినట్లు ప్రచారం సాగుతోంది.అయితే వీరిద్దరూ ఇప్పుడు ప్రమాదంలో పడినట్లు సమాచారం.జగన్ విషయంలో జరిగిన ప్రచారం నేపథ్యంలో వైసిపి వీరిపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది.
* ఒకరు అలా.. మరొకరు ఇలా
మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా అన్యమతస్థుడు.తప్పకుండా ఆయన తిరుమలలో డిక్లరేషన్ ఇచ్చి స్వామి వారిని దర్శించుకోవాలి. కానీ ఆయన డిక్లరేషన్ ఇవ్వలేదని వైసిపి అనుకూల మీడియా తెగ ప్రచారం చేస్తోంది. జగన్ విషయంలో పట్టుబడిన టిడిపి ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుంటుందని ప్రశ్నిస్తున్నారు వైసీపీ నేతలు. ఇక గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. రిజర్వుడు నియోజకవర్గం నుంచి గెలిచారు. క్రిస్టియన్ మతానికి చెందిన వ్యక్తి కావడంతో డిక్లరేషన్ ఇచ్చారు. అయితే వాస్తవానికి ఆయన రిజర్వుడు నియోజకవర్గం నుంచి గెలవడంతో.. క్రిస్టియన్ అని తేలితే రిజర్వేషన్ రద్దు అవుతుంది. బీసీ రిజర్వేషన్ మాత్రమే ఉంటుంది. అయితే ఈ లెక్కన ఆయన ఎమ్మెల్యే పదవికి అనర్హుడు అంటూ వైసీపీ ఆరోపిస్తోంది.
* డిఫెన్స్ లో పడిన జగన్
సీఎం హోదాలో జగన్ చాలాసార్లు తిరుమలలో పర్యటించారు. నాడు డిక్లరేషన్ అంశం తెరపైకి వచ్చింది. సీఎం హోదాలో పర్యటించిన వ్యక్తికి డిక్లరేషన్ అవసరం లేదన్నట్టు అప్పట్లో వైసిపి నేతలు చెప్పుకొచ్చారు. అయితే తాజాగా లడ్డు వివాదం నేపథ్యంలోనే జగన్ తిరుమల సందర్శనకు బయలుదేరారు. ఈ క్రమంలో డిక్లరేషన్ అంశం తెరపైకి వచ్చింది.ఒకవేళ డిక్లరేషన్ ఇస్తే.. ఇన్ని రోజులు ఇవ్వనందున క్షమాపణలు చెప్పాల్సి వస్తుందని… ఇవ్వకుంటే అన్య మతస్తుడిగా ముద్ర వేసి మరింతగా ఆరోపణలు చేసే అవకాశం ఉందని.. జగన్ భయపడి తిరుమల పర్యటన రద్దు చేసుకున్నారని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అయితే తాజాగా అన్యమతస్తులైన ఇద్దరు టిడిపి ఎమ్మెల్యేల్లో.. ఒకరు డిక్లరేషన్ ఇచ్చి.. మరొకరు డిక్లరేషన్ ఇవ్వకపోవడం అనేది కొత్త వివాదానికి దారి తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి