IAS Transfers: ఏపీలో సంచలనం.. 18 మంది ఐఏఎస్ ల స్థానచలనం

విశాఖ జిల్లా కలెక్టర్ గా పని చేసిన మల్లికార్జున పై అనేక ఆరోపణలు ఉన్నాయి. విశాఖలో హయగ్రీవ, దాసపల్లా మొదలుకొని వందల కోట్ల విలువైన భూములను వైసీపీ నాయకుల పరం చేయడంలో మల్లికార్జున పాత్ర వివాదాస్పదం అయింది.

Written By: Dharma, Updated On : June 23, 2024 10:23 am

IAS Transfers

Follow us on

IAS Transfers: చంద్రబాబు సర్కార్ ప్రక్షాళన మొదలుపెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా 18 మంది ఐఏఎస్ అధికారులపై బదిలీ వేటు వేసింది. 12 జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమించింది. ముఖ్యంగా వివాదాస్పద కలెక్టర్లను పక్కన పెట్టింది. సాధారణ పరిపాలన శాఖకు అప్పగించింది. ముఖ్యంగా వైసీపీతో అంట కాగిన విశాఖ, తూర్పుగోదావరి, గుంటూరు జిల్లాల కలెక్టర్లు మల్లికార్జున, మాధవి లత, వేణుగోపాల్ రెడ్డి లకు పోస్టింగులు ఇవ్వలేదు. సాధారణ పరిపాలన శాఖలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 18 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.

విశాఖ జిల్లా కలెక్టర్ గా పని చేసిన మల్లికార్జున పై అనేక ఆరోపణలు ఉన్నాయి. విశాఖలో హయగ్రీవ, దాసపల్లా మొదలుకొని వందల కోట్ల విలువైన భూములను వైసీపీ నాయకుల పరం చేయడంలో మల్లికార్జున పాత్ర వివాదాస్పదం అయింది. వైసిపి నేతలు చెప్పినట్టుగానే ఆయన నడుచుకున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి. మాధవీలత కృష్ణాజిల్లా జెసిగా పనిచేసినప్పుడు వైసీపీతో అంటకాగారు. తూర్పుగోదావరి కలెక్టర్గా ఉన్నప్పుడు అమరావతి రైతుల పాదయాత్రను గోదావరి వంతెన పైనుంచి వెళ్ళనీయకుండా అడ్డుకున్నారు. వైసీపీ నేతల ఇసుక అక్రమాలను చూసీ చూడనట్టుగా వదిలేశారు. మరో కలెక్టర్ వేణుగోపాల రెడ్డి వ్యవహార శైలి సైతం వివాదాస్పదం అయింది. వైసీపీ నేతల ఇసుక, మట్టి దోపిడిని ఆయన పట్టించుకోలేదు. వాటికి పరోక్షంగా సహకరించారు. రాజధాని అమరావతిని నాశనం చేయడానికి వైసిపి ప్రభుత్వం చేసిన ప్రయత్నాలకు కూడా సహకరించారు. అందుకే ఈ ముగ్గురికి పోస్టింగ్ ఇవ్వలేదని తెలుస్తోంది.

అయితే మరికొందరు ఐఏఎస్ అధికారుల నియామకంపై విస్మయం వ్యక్తం అవుతోంది. చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి కి అన్ని విధాల సహకరించిన షగిలి షన్మోహన్ కు పదోన్నతి కల్పించారు.కాకినాడ కలెక్టర్ గా పోస్టింగ్ ఇవ్వడంపై విస్మయం వ్యక్తం అవుతోంది. అప్పట్లో సీఎంవో కార్యదర్శిగా ఉన్న ధనుంజయ రెడ్డి ఆదేశాలను తూచా తప్పకుండా పాటించడంలో ఈయన ముందుండే వారు. మరోవైపు ప్రకాశం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ను అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ గా పోస్టింగ్ ఇవ్వడంపై కూడా విస్మయం వ్యక్తం అవుతోంది. కాగా గత ప్రభుత్వ హయాంలో కలెక్టర్లుగా అవకాశం ఇవ్వని నాగరాణి, అంబేద్కర్ లకు కలెక్టర్లుగా ప్రభుత్వం పోస్టింగులు ఇవ్వడం విశేషం. మొత్తానికైతే పెద్ద ఎత్తున ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ కొత్త ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది.

Tags