AP Rain Alert: ఏపీలో( Andhra Pradesh) వర్షాలు కొనసాగుతున్నాయి. బంగాళాఖాతం లో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర రూపం దాల్చుతోంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు వర్షాలు నమోదు అవుతూనే ఉన్నాయి. ముఖ్యంగా గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. ఉత్తరాంధ్రలో సైతం వర్ష ప్రభావం అధికంగా ఉంది. బంగాళాఖాతం వాయిద్య ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో మరో రెండు రోజులపాటు ఈ భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. ప్రధానంగా దక్షిణ కోస్తాతో పాటు రాయలసీమకు భారీ వర్ష సూచన ఉంది. ఒకటి రెండు చోట్ల పిడుగులతో కూడిన వర్షం పడనుంది.
నైరుతి రుతుపవనాల నిష్క్రమణ..
సెప్టెంబర్ నెలలో వర్షాలు సమృద్ధిగా పడ్డాయి. ప్రస్తుతం మూడో వారం సమీపిస్తోంది. మరోవైపు దేశం నుంచి నైరుతి రుతుపవనాలు నిష్క్రమిస్తున్నాయని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. అయితే బంగాళాఖాతంలో( Bay of Bengal ) ఏర్పడుతున్న అల్పపీడనాల ప్రభావంతో వర్షాలు పడుతుండడం విశేషం. తాజాగా ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో గుంటూరు, విజయవాడలో విస్తారంగా వర్షాలు కురిసాయి. మరో రెండు రోజులపాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని తెలుస్తోంది. బుధవారం రాత్రి గుంటూరు, విజయవాడలో భారీ వర్షం కురిసింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. గత అనుభవాలు దృష్ట్యా విజయవాడ నగరవాసులు ఆందోళనకు గురయ్యారు. మరోవైపు కృష్ణానది ఉధృతంగా ప్రవహిస్తోంది.
దాదాపు అన్ని ప్రాంతాల్లో..
నేటి నుంచి రెండు రోజులపాటు ఉత్తరాంధ్ర( North Andhra ) నుంచి రాయలసీమ జిల్లాల వరకు భారీ వర్షాలు పడొచ్చు. ఇప్పటికే భారీ వర్షాలు గుంటూరును ముంచెత్తాయి. నేడు కూడా అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు పడొచ్చని వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాయలసీమలో సైతం వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. మరోవైపు అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షం పడనుంది. రాయలసీమ జిల్లాలకు సంబంధించి అక్కడక్కడ పిడుగులతో కూడిన వాన పడనుంది. గడిచిన 24 గంటల్లో ప్రకాశం జిల్లా ఒంగోలులో అత్యధికంగా వర్షపాతం నమోదయింది. ఏకంగా 64.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. కే.ఉప్పలపాడు లో 53.5, వేములపాడు లో 47, చిలకపాడులో 45, విజయనగరం జిల్లా రాజాంలో 40.2, కాకినాడలో 39 మిల్లీమీటర్ల మేర వర్షపాతం నమోదు అయింది. మరో రెండు రోజులపాటు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ చెబుతోంది. మరోవైపు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ముందస్తు జాగ్రత్తలను సూచిస్తోంది.