Annadata Sukhibhava Money: ఏపీ ప్రభుత్వం ( AP government) సంక్షేమ పథకాలను కొనసాగించాలని భావిస్తోంది. ఇటీవల భారీగా పెట్టుబడుల సదస్సు నిర్వహించిన సంగతి తెలిసిందే. మరోవైపు అభివృద్ధితో పాటు అమరావతి రాజధాని కి ఎంతో ప్రాధాన్యమిస్తోంది. అయితే సంక్షేమాన్ని కొనసాగిస్తూనే మిగతా వాటిని అమలు చేయాలని చూస్తోంది. అందులో భాగంగా రేపు అన్నదాత సుఖీభవ పథకం నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. గత ఆగస్టులో మొదటి విడత నిధులు విడుదల చేసింది. ఇప్పుడు రెండో విడతగా కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ తో కలిపి రూ.7000 అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. రేపు కడప జిల్లాలో రైతుల ఖాతాల్లో నిధులు జమకు సంబంధించి శ్రీకారం చుట్టనున్నారు సీఎం చంద్రబాబు. దాదాపు 3 వేల కోట్ల రూపాయలకు పైగా రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. ఇప్పటికే దీనికి సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి.
* గత 11 సంవత్సరాలుగా..
కేంద్రంలో నరేంద్ర మోడీ( Prime Minister Narendra Modi) అధికారంలోకి వచ్చిన తరువాత పీఎం కిసాన్ పేరిట ఏటా రైతులకు రూ.6000 చొప్పున సాగు ప్రోత్సాహం కింద సాయం అందించడం ప్రారంభించారు. ఇప్పటివరకు 21 విడతల్లో 42 వేల రూపాయలను అందించారు. అయితే వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత రైతు భరోసా పేరిట మరో రూ.7500 అందిస్తూ వచ్చింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి రూ. 13,500 అందించేవి. అయితే తాము అధికారంలోకి వస్తే ఏటా కేంద్ర ప్రభుత్వంతో కలిపి 20 వేల రూపాయలు సాగు ప్రోత్సాహం కింద అందిస్తామని చంద్రబాబు ప్రకటించారు. అందుకు తగ్గట్టుగానే ఈ ఏడాది ఆగస్టులో తొలి విడతగా కేంద్ర ప్రభుత్వం అందించే పీఎం కిసాన్ 2000 తో కలిపి రాష్ట్ర ప్రభుత్వ అన్నదాత సుఖీభవ వాటా 5 వేల రూపాయలను అందించారు. మొత్తం 48 లక్షల మంది రైతుల ఖాతాల్లో 7000 రూపాయల చొప్పున జమ అయ్యింది.
* రెండో విడతగా సాయం..
పీఎం కిసాన్( pm Kisan) పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం రేపు రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయనుంది. దీంతో రెండో విడతగా అన్నదాత సుఖీభవ పథకం కింద మరో రూ.5000 జత చేసి అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. చివరిగా ఏప్రిల్ లో కేంద్ర ప్రభుత్వం అందించే 2000 రూపాయలతో మరో నాలుగు వేల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ కింద అందించనుంది. రేపు కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. దాదాపు 3 వేల కోట్లకు పైగా రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
* అభివృద్ధితో పాటు సంక్షేమం..
ఒకవైపు అభివృద్ధిని కొనసాగిస్తూనే సంక్షేమ పథకాలను( welfare schemes) అమలు చేయాలని చంద్రబాబు సర్కార్ నిర్ణయించింది. జగన్ సర్కార్ అప్పట్లో సంక్షేమానికి ప్రాధాన్యమిచ్చి అభివృద్ధి చేయలేదన్న విమర్శను మూటగట్టుకుంది. దాని ప్రభావం ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. అటువంటి పరిస్థితి రాకుండా ఉండేందుకు చంద్రబాబు సర్కార్ సంక్షేమంతో పాటు అభివృద్ధిని కొనసాగించాలని చూస్తోంది. మొత్తానికి అయితే రైతుల ఖాతాల్లో నిధులు జమ కానుండడంతో అన్నదాతల్లో ఆనందం నెలకొంది.