Tirupati Stampede: తిరుపతి( Tirupati) తొక్కిసలాట ఘటనకు సంబంధించి ప్రభుత్వం కఠిన చర్యలకు దిగింది. ఈ ఘటనకు బాధ్యులను చేస్తూ ఇద్దరు అధికారులపై సస్పెన్షన్ వేటు వేసింది. మరో ముగ్గురిపై బదిలీ వేటు పడింది. తిరుమలలో స్వామివారి ఉత్తర ద్వార దర్శనానికి సంబంధించి ఈనెల తొమ్మిదిన టోకెన్ల జారీ ప్రక్రియను ప్రారంభించింది. ఇందుకుగాను ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసింది. అయితే ఓ కేంద్రం వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు భక్తులు మృతి చెందారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. తిరుమల చరిత్రలోనే తొలి విషాద ఘటన ఇది. దీనిని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హుటాహుటిన తిరుమల చేరుకున్నారు. పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఈ ఘటనకు బాధ్యులను చేస్తూ తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు, తిరుపతి టీటీడీ జేఈవో గౌతమి పై బదిలీ వేటు వేశారు. త్వరలో టిటిడి ఈవో తో పాటు అడిషనల్ ఈవో పై వేటు వేస్తారని ప్రచారం నడుస్తోంది.
* ఎర్రచందనం టాస్క్ ఫోర్స్ ఎస్పీగా
అయితే ఇప్పటికే బదిలీ వేటు వేసిన ఐపీఎస్ అధికారి( IPS officer) సుబ్బారాయుడిని.. అదే తిరుపతిలో పోస్టింగ్ ఇవ్వడం విశేషం. తిరుపతి ఎర్రచందనం టాస్క్ ఫోర్స్ ఎస్పీగా సుబ్బారాయుడిని నియమించింది కూటమి ప్రభుత్వం. రాష్ట్రవ్యాప్తంగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది ప్రభుత్వం. అందులో భాగంగానే సుబ్బారాయుడు కు మరో అవకాశం కల్పించింది. అయితే టీటీడీ జేఈఓ గా ఉన్న గౌతమికి మాత్రం ఎలాంటి పోస్టింగ్ ఇవ్వలేదు. ఆమెపై కక్షతోనే పోస్టింగ్ ఇవ్వలేదని ప్రచారం నడుస్తోంది. ముఖ్యంగా సామాజిక వర్గం కోణంలోనే ఆలోచించి ఈ చర్యలకు దిగినట్లు అర్థమవుతోంది. మొన్నటికి మొన్న బదిలీతో పాటు సస్పెన్షన్ వేటు పడిన వారిలో ఎక్కువమంది రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అధికారులే. కానీ కమ్మ సామాజిక వర్గానికి చెందిన సుబ్బారాయుడు కు ఇప్పుడు పోస్టింగ్ ఇవ్వడం హాట్ టాపిక్ అవుతోంది.
* తెలంగాణ నుంచి డిప్యూటేషన్ పై
వాస్తవానికి తెలంగాణ( Telangana) నుంచి డిప్యూటేషన్ పై వచ్చారు సుబ్బారాయుడు. చంద్రబాబు ఏరి కోరి తిరుపతి జిల్లా ఎస్పీగా ఆయనను నియమించారు. తిరుమల తొక్కిసలాట ఘటన జరగడంతో ఆయనపై బదిలీ వేటు వేయాల్సి వచ్చింది. కానీ తిరిగి మళ్లీ మంచి పోస్టింగ్ లోనే ఆయనను నిలబెట్టడం.. మిగతా వారిని విస్మరించడం మాత్రం విమర్శలకు తావిస్తోంది.
* సామాజిక వర్గ ఆరోపణలు
వాస్తవానికి టీటీడీ( TTD ) అధికారులపై చర్యలు తీసుకోవడంలో సామాజిక వర్గ కోణం బయటపడింది. దీనిపైనే అప్పట్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. టీటీడీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ తో పాటు ఈవో, అడిషనల్ ఈవో క్షమాపణలు చెప్పాల్సిందేనని తేల్చి చెప్పారు. కులాల మాటున దాక్కుంటామంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అటు తరువాతే టీటీడీలో కదలిక వచ్చింది. మృతులతోపాటు బాధిత కుటుంబాలకు నేరుగా వెళ్లి చెక్కులు అందించారు.
* మళ్లీ అక్కడే పోస్ట్
అయితే తిరుపతి జిల్లా ఎస్పీ పై ( superintendent of police )బదిలీ వేటు వేసినట్లు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. కానీ ఆయనకు ఇబ్బంది కలగకుండా మళ్ళీ తిరుపతిలోనే పోస్టింగ్ ఇచ్చారు. ఎర్రచందనం టాస్క్ ఫోర్స్ ఎస్పీగా బాధ్యతలు ఇవ్వడం అంటే.. ఒకరకంగా పదోన్నతి. కేవలం సొంత సామాజిక వర్గం వారికి పెద్ద పీట వేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం నడుస్తోంది. ఇప్పటికే టీటీడీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ తో పాటు అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరిని వెనుకేసుకొచ్చినట్లు ప్రచారం నడుస్తోంది. సరిగ్గా ఇదే సమయంలో బదిలీ వేటు పడిన ఎస్పీకి మంచి స్థానాన్ని కట్టబెట్టడం కూడా చర్చకు దారితీస్తోంది.