Tirumala News : తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చే ప్రవాస భారతీయులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శుభవార్త అందించింది. ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ (APNRTS) ద్వారా 100 మంది ఎన్ఆర్ఐ భక్తులకు రోజూ వీఐపీ బ్రేక్ దర్శనాన్ని కల్పించాలని టీటీడీ నిర్ణయించింది.టీటీడీ నిర్ణయంతో శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చే పలువురు ప్రవాస భారతీయులకు దర్శనం విషయంలో కాస్త వెసులుబాటు కలినట్లు అయింది. ఎన్నారై భక్తుల డిమాండ్ దృష్ట్యా ఈ కోటాను టీటీడీ పెంచింది. ఈ కోటా కింద ఎన్ఆర్ఐ కుటుంబ సభ్యుల్లోనూ వృద్ధులకు మరింత ప్రాధాన్యం ఇవ్వనున్నారు.
ప్రస్తుతం వీఐపీ బ్రేక్ దర్శన కోటా రోజుకు 50 మంది ఎన్ఆర్ఐ భక్తులను మాత్రమే అనుమతిస్తున్నారు. అయితే, ఎన్ఆర్ఐ భక్తుల డిమాండ్‌ను పరిగణలోకి తీసుకుని ఈ కోటాను టీటీడీ 100 మందికి పెంచింది. కొత్త విధానం ప్రకారం, ప్రతి రోజు 100 మంది ప్రవాస భారతీయులకు, ముఖ్యంగా వృద్ధులకు, వీఐపీ బ్రేక్ దర్శన భాగ్యం లభించనుంది. టీటీడీ డిప్యూటీ ఈఓ లోకనాథం శనివారం నాడు ఉత్తర్వులు జారీచేశారు. జనవరి 6న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జీఏడీ నుండి లేఖ అందుకున్న టీటీడీ, భక్తుల సౌలభ్యం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంది.
సుపథంలో ఎన్ఆర్ఐలకు ప్రత్యేక టికెట్లు
శ్రీవారి దర్శనానికి వచ్చే ప్రవాస భారతీయులు (NRI), ఇతర దేశాల నుంచి వచ్చిన భక్తులకు టీటీడీ సుపథం మార్గంలో సులభంగా దర్శనం కల్పించే ప్రివిలేజ్‌ను కల్పిస్తోంది. ఇందుకోసం, భారతదేశం వచ్చినప్పుడు వారి పాస్‌పోర్ట్‌పై గుండా 30 రోజులలోపు శ్రీవారిని దర్శించుకోవాల్సి ఉంటుంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఒరిజినల్ పాస్‌పోర్టుతో వచ్చిన ఎన్ఆర్ఐ భక్తులకు సుపథం మార్గంలో రూ.300 ఎస్‌ఈడీ టికెట్ జారీ చేయనున్నారు. ప్రస్తుతం, బ్రహ్మోత్సవాలు, ఇతర ముఖ్యమైన వేడుకల సమయంలో ఈ సౌకర్యం అందించబడదు.
తిరుమల పుణ్యక్షేత్రంలో ఫిబ్రవరి 12 నుంచి శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి అత్యంత వైభవంగా జరుగనుంది. అందుకు సంబంధించిన టిటిడి అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య సమీక్ష నిర్వహించారు.తిరుమలలో జరిగే అతి ముఖ్యమైన తీర్థ ఉత్సవాల్లో ఒకటైన రామకృష్ణతీర్థ ముక్కోటికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. భక్తుల కోసం షామియానా, రేడియో బ్రాడ్‌కాస్టింగ్ ద్వారా ప్రకటనలు, డిస్‌ప్లే బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. టీటీడీ భద్రతాసిబ్బంది, పోలీసులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అలాగే భక్తుల సౌకర్యార్థం భద్రత, అన్నప్రసాదం, తాగునీరు, వైద్యం, ఆరోగ్యం, అటవీ విభాగాల ఏర్పాట్లపై తను సమీక్షించారు. పాపవినాశనం వద్ద భక్తులకు అన్నప్రసాదం పంపిణీకి అవసరమైన శ్రీవారి సేవకులను నియమించాలని కోరారు.