Tirumala Laddu Case: టీటీడీ( Tirumala Tirupati Devasthanam) లడ్డూ కేసు విచారణ పూర్తయింది. గత కొద్ది నెలలుగా సాగుతున్న దర్యాప్తు పూర్తి కావడంతో సిట్ కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేసింది. 600 పేజీల చార్జ్ షీట్ లో సంచలన విషయాలు వెలుగులోకి తెచ్చింది సిట్. వైసిపి హయాంలో లడ్డూ తయారీకి వినియోగించే నెయ్యిని కల్తీ చేశారనేది ప్రధాన ఆరోపణ.. దీనిపై ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం 14 నెలల పాటు 12 రాష్ట్రాల్లో లోతైన విచారణ జరిపింది. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ డైరీ సంస్థల పాత్రను విశ్లేషించి.. పక్కా ఆధారాలతో ఈ నివేదికను సిద్ధం చేశారు.
60 లక్షల కిలోల నెయ్యి కల్తీ..
సిట్ చార్జ్ షీట్ లో( charge sheet) సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఐదేళ్ల కాలంలో సుమారు 60 లక్షల కిలోల కల్తీ నెయ్యి తిరుమలకు సరఫరా అయింది. ఈ నెయ్యి తోనే దాదాపు 20.1 కోట్ల లడ్డూలు, ఇతర ప్రసాదాలను తయారు చేసినట్లు అధికారులు గుర్తించారు. నేయి స్థానంలో తక్కువ ధర కలిగిన పామాయిల్, పామ్ కర్నెల్ ఆయిల్ వంటి నూనెలను కలిపి లడ్డు తయారు చేసినట్లు విచారణలో తేలింది. ఈ కల్తీ నెయ్యికి స్వచ్ఛమైన నెయ్యి వాసన వచ్చేలా బీటా కెరోటిన్ వంటి రసాయనాలను సైతం కలిపారని గుర్తించింది సిట్. ఈ మొత్తం వ్యవహారంలో సుమారు 25 కోట్ల రూపాయల టీటీడీ నిధుల దుర్వినియోగం అయినట్లు దర్యాప్తులో తేలింది.
* వై వి సుబ్బారెడ్డి హయాంలో..
వై వి సుబ్బారెడ్డి( YV Subba Reddy ) టీటీడీ ట్రస్ట్ బోర్డు చైర్మన్గా ఉండే సమయంలోనే ఈ అవకతవకలు జరిగినట్లు గుర్తించింది సిట్. ఆయన హయాంలో నిబంధనలను సడలించారని గుర్తించింది. డైరీలకు ఉండాల్సిన కనీస పాలు సేకరణ, వెన్న ఉత్పత్తి సామర్థ్యం వంటి కీలక అర్హతలను తొలగించడం ద్వారా.. అనుభవం లేని సంస్థలకు మార్గం సుగమం చేసినట్లు గుర్తించింది. ఏకంగా సెక్యూరిటీ డిపాజిట్ మొత్తాన్ని 250 కోట్ల నుంచి 150 కోట్ల రూపాయలకు తగ్గించినట్లు కూడా ఈ దర్యాప్తులో తేలింది. వై వి సుబ్బారెడ్డి పీఏగా భావిస్తున్న చిన్న అప్పన్న పాత్రపై కూడా కీలక ఆధారాలు దొరికినట్లు తెలుస్తోంది. ప్రతి కిలో నెయ్యి పై 25 రూపాయల లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనికి బలం చేకూరుస్తూ 2019 నుంచి 20204 మధ్య చిన్న అప్పన్న ఖాతాల్లో రూ.4.69 కోట్లు చేరాయని.. అందులో సింహ భాగం ఇతర ఖాతాలకు మళ్ళించారని సిట్ గుర్తించింది.
* వ్యవస్థీకృత నేరంగా..
ఈ నెయ్యి కల్తీ కేసుకు సంబంధించి 36 మందిని నిందితులుగా చేర్చారు. అందులో 12 మంది టీటీడీ ఉద్యోగులు ఉన్నారు. అధికారులు, డైరీ సమస్యలు కుమ్మక్కై ఈ వ్యవస్థీకృత నేరానికి పాల్పడినట్లు స్పష్టమవుతోంది. ప్రధానంగా ఏఆర్ డైరీ, వైష్ణవి డైరీ, బోలో బాబా ఆర్గానిక్ వంటి సంస్థలు నాణ్యతలేని నెయ్యిని సరఫరా చేయడంలో కీలక పాత్ర పోషించినట్లు ఈ దర్యాప్తులో తేలింది. చార్జిషీట్ దాఖలు చేసిన క్రమంలో మున్ముందు ఈ కేసులో అరెస్టులు జరిగే అవకాశం ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.