Tirumala Annaprasadam History 40 Years: ఆ సత్రంలోకి అడుగుపెడితే ఆధ్యాత్మికత పరిడవిల్లుతుంది. ఎక్కడి నుంచి వచ్చిన భక్తులు క్యూ లైన్లో వెళ్తుంటారు. అందరూ బుద్ధిగా కూర్చుంటారు. చేతులు కడుక్కుని వచ్చి.. తమ ముందు వేసిన పచ్చటి అరిటాకులో పెట్టిన భోజనాన్ని గోవిందా గోవిందా అనుకుంటూ సంతృప్తిగా తింటారు. అన్నప్రసాదం అంటే ఏదో పులిహోరో.. మరొకటి ఉండదు.. ముందుగా చక్కెర పొంగలి లేదా దద్దోజనం పెడతారు. ఆ తర్వాత వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైన కట్టగారె వడ్డిస్తారు. ఆ తర్వాత ఒక వేపుడు కూర పెడతారు. అనంతరం అన్నం.. పప్పు వడ్డిస్తారు. మరో విడతలో అన్నం.. సాంబార్ వడ్డిస్తారు. చివరిగా మజ్జిగ వేసి భక్తుల జిహ్వను సంతృప్తి పరుస్తారు.
ఇది తిరుమల కొండపై ఏర్పాటు చేసిన వెంగమాంబ అన్నదాన సత్రంలో నిత్యం భక్తులకు వడ్డించే అన్న ప్రసాదం. తిరుమలలో అన్న ప్రసాదం భక్తులకు వితరణగా ఇవ్వడం వెనక 40 సంవత్సరాల చరిత్ర ఉంది. సరిగ్గా 40 సంవత్సరాల క్రితం నాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీనియర్ ఎన్టీఆర్ ఈ పథకానికి రూపకల్పన చేశారు. దీని వెనక ఒక అద్భుతమైన చరిత్ర ఉంది.
తరిగొండ వెంగమాంబ అనే అపర వెంకటేశ్వర స్వామి భక్తురాలు 87 సంవత్సరాల వయసులో తుది శ్వాస విడిచారు. ఆమె జీవించి ఉన్నప్పుడు స్వామి ఏకాంత సేవలో పాల్గొనేందుకు వెళ్లేవారు. రాత్రిపూట స్వామివారికి చివరి హారతి ఆమె ఇచ్చేవారు. దానికోసం దేవస్థానం ఆమెకు ప్రత్యేకంగా అనుమతి ఇచ్చేది. తిరుమల వచ్చిన భక్తుల కోసం ఆమె అన్నదానం నిర్వహించేవారు. ఆమె గొప్పతనం గురించి తెలుసుకున్న సీనియర్ ఎన్టీఆర్ ఆ సాంప్రదాయాన్ని పునరుద్ధరించారు. అన్నదాన సత్రానికి తరిగొండ వేంగమాంబ అన్నప్రసాద కేంద్రం అని పేరు పెట్టారు..
ఈ సాంప్రదాయాన్ని పునరుద్ధరించిన తర్వాత తిరుమలలో భక్తులకు ఉచితంగా అన్న ప్రసాదం లభించడం మొదలైంది. ఈ పథకానికి విరాళాలు ఇవ్వాలని సీనియర్ ఎన్టీఆర్ పిలుపు ఇచ్చినప్పుడు.. మద్రాస్ నగరానికి చెందిన ఎల్వి రామయ్య స్పందించారు. అప్పటికప్పుడు 10 లక్షల రూపాయలను విరాళంగా ఇచ్చారు. మాన్సింగ్ చారిటీస్ వారు 20 లక్షల విరాళంగా ఇచ్చారు. 1985 ఏప్రిల్ ఆరున ఈ పథకం మొదలైంది. ప్రస్తుతం ఈ స్కీం మూల నిధి 2,200 కోట్లు దాటిపోయింది. నాడు 2000 మందితో ఈ పథకం ప్రారంభమైంది. నేడు లక్ష మంది భక్తులకు అన్నప్రసాదాన్ని వితరణ చేసే స్థాయికి అభివృద్ధి చెందింది. 2014లో ఈ పథకాన్ని శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుగా మార్చారు. ఈ ట్రస్ట్ లో మొత్తం 9.7,00,000 మంది దాతలు ఉన్నారు. ఒకరోజు తిరుమలలో అన్నప్రసాదానికి అయ్యే ఖర్చు అక్షరాల 44 లక్షలు.. ప్రతిరోజు లక్ష మందికి పైగా భక్తులు ఇక్కడ ఆహారాన్ని స్వీకరిస్తారు.
అత్యంత ఆధునికమైన యంత్రాలతో ఇక్కడ ఆహారాన్ని తయారుచేస్తారు.. గతంలో భక్తులకు అన్నం, పచ్చడి, పప్పు, మజ్జిగ మాత్రమే వడ్డించేవారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భక్తులకు ఉదయం పూట అల్పాహారం, మధ్యాహ్నం రుచికరమైన భోజనం, రాత్రి కూడా అదే స్థాయిలో భోజనం వడ్డిస్తున్నారు. ఉత్తరాది ప్రాంతాల నుంచి వచ్చిన భక్తుల కోసం రోటీలను కూడా వడ్డిస్తున్నారు. ఇటీవల దేవస్థానం అత్యంత ఆధునికమైన వంటశాలను నిర్మించేందుకు రంగం సిద్ధం చేసింది. దీనికోసం ముఖేష్ అంబానీ కోట్ల రూపాయలను వితరణగా ఇచ్చినట్టు తెలుస్తోంది. అన్నదానానికి ప్రతిరోజు భక్తులు విరాళాలుగా నగదు లేదా వస్తువులను ఇస్తూ ఉంటారు. ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన మనవడు దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా అన్నదానం చేశారు. ఆరోజు అన్నదానానికి ఆయన ఖర్చు 44 లక్షల ను తిరుమల తిరుపతి దేవస్థానానికి అందజేశారు .
ప్రపంచంలో ఎన్నో పెద్ద దేవాలయాలు ఉన్నాయి. ఆ దేవాలయాల కంటే తిరుమలలో భక్తులకు అన్నదానం జరుగుతూ ఉంటుంది. ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసిన వారు సీనియర్ ఎన్టీఆర్. తిరుమల ఉన్నంతవరకు.. సీనియర్ ఎన్టీఆర్ పేరు అక్కడి కొండపై మారుమోగుతూనే ఉంటుంది. అన్నదాత సుఖీభవ.