Times Now Survey : మరీ నేను అంత వెర్రి పుష్పంలా కనిపిస్తున్నానా? ఓ మాదిరిగా కూడా కనిపించడం లేదా? బ్రహ్మానందం సీరియస్ గా చెప్పిన కామెడీ డైలాగు ఇది. ఇప్పుడు ఏపీ ప్రజలు కూడా తమకు తాము ఇదే ప్రశ్న వేసుకుంటున్నారు. రాష్ట్రంలో మరోసారి జగన్ కు ఏకపక్షంగా ప్రజలు మద్దతు తెలుపుతున్నారని.. వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తుందన్న ఓ సర్వేతో ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అంతలా జగన్ కు, వైసీపీకి ఆదరణ ఉందా? అని తమలో తామే ప్రశ్నించుకుంటున్నారు. తమను సర్వేరాయుళ్లు ఎవరూ అడగలేదు కదా? మరి ఎలా ఈ సర్వే ఫలితాలను విడుదల చేశారు అని విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో వాస్తవం ఎంత? అని ఆరాతీసే పనిలో పడ్డారు.
టైమ్స్ నౌ నవభారత్ పేరిట సర్వే ఒకటి వెల్లడైంది. ‘జన్ గన్ కామన్’ పేరుతో జాతీయ మీడియా సంస్థ నిర్వహించిన సర్వేలో జాతీయ స్థాయిలో మోదీ ప్రభ తగ్గలేదని తేలింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్డీఏ తిరుగులేని విజయం సాధిస్తుందని సర్వేలో వెల్లడైంది. బీజేపీ కూటమికి 543 సీట్లకు గాను 285 నుంచి – 325 మధ్య సీట్లు వస్తాయని సర్వే వెల్లడించింది. ఇక కాంగ్రెస్ పార్టీకి 111 నుంచి -149 స్థానాలు వస్తాయని సర్వే తెలిపింది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ 20-22 స్థానాలు, ఒడిశాలోని బీజేడీ పార్టీ 12-14 ఎంపీ సీట్లు గెలుస్తుందని సర్వేలో అంచనా వేసింది. దేశంలో కీలకమైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ ఏకంగా 50.30 శాతం ఓట్లు సాధిస్తుందని సర్వే అంచనా వేసింది.
ఏపీలో అధికార వైసీపీ దాదాపు క్లీన్ స్వీప్ చేస్తుందని సర్వే తేల్చింది. ఆ పార్టీ ఏకంగా 24 నుంచి 25 స్థానాలు దక్కుతాయని తేల్చింది. దేశంలోనే అత్యధిక లోక్ సభ స్థానాలు గెలిచిన మూడో పార్టీగా వైసీపీ అవతరించనుందని సర్వే వెల్లడించింది. బీజేపీ, కాంగ్రెస్ తరువాత వైసీపీ నిలవనుందని తేల్చేసింది. కనీసం టీడీపీ, జనసేన ఉనికి చాటలేవని తేల్చడం విశేషం. అయితే ఈ సర్వే ప్రమాణికత, విశ్వసనీయతపై రకరకాల ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. వైసీపీ సోషల్ మీడియా మాత్రం అదే పనిగా ప్రచారం మొదలుపెట్టింది. వైసీపీకి తిరుగులేదని ఊదరగొడుతోంది.
వాస్తవానికి ఏపీలో వైసీపీకి ఆ స్థాయిలో హోప్ ఉందా అంటే మాత్రం ధైర్యంగా కూడా సమాధానం రావడం లేదు. గతసారి ఒక్క చాన్స్ అంటూ జగన్ అడిగిన విన్నపాన్ని ప్రజలు ఆమోదించారు. ఒక అవకాశం ఇచ్చారు. అయితే గతసారి మద్దతు తెలిపిన ఏ వర్గమూ సంతృప్తిగా లేదు. అయినా సరే అంతులేని విజయం దక్కుతుందని సర్వే తేల్చడం కాస్తా అనుమానాలకు తావిస్తోంది. కేవలం సంక్షేమ పథకాల లబ్దిదారులే సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అందులోనూ పథకాలు దక్కని వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారారు. మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి,ఆపై స్థాయిలో ఉన్నవారు బహటంగానే వ్యతిరేకిస్తున్నారు.
గత ఎన్నికల ముందు వైసీపీ కుల, మత, వర్గ వైషమ్యాలతో గట్టెక్కింది. కాదు ప్రశాంత్ కిశోర్ అలియాస్ పీకే టిమ్ గట్టిగానే పోరాడింది. దీనికితోడు ఉద్యోగులు, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు అలవికాని హామీలిచ్చారు. ఉపాధ్యాయులకు అంతులేని విశ్వాసాన్నిచ్చారు. తీరా అధికారంలోకి వచ్చాక చాలా కులాలు దూరమయ్యాయి. ఉద్యోగులు, ఉపాధ్యాయ వర్గాలు ప్రత్యర్థులుగా మారాయి. సమాజంలో ఓ సెక్షన్ ప్రజలు పూర్తిగా ప్రభుత్వ చర్యలను తప్పుపడుతున్నారు. ఇటువంటి సమయంలో వైసీపీకి ఏకపక్ష విజయం సాధ్యమా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. తాజా సర్వే వాస్తవానికి దూరమని ఎక్కువ మంది నమ్ముతున్నారు.విశ్లేషకులు సైతం అదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.