Homeఆంధ్రప్రదేశ్‌TDP Janasena First List: టిడిపి,జనసేన శ్రేణుల్లో 'టిక్కెట్ల' మంట

TDP Janasena First List: టిడిపి,జనసేన శ్రేణుల్లో ‘టిక్కెట్ల’ మంట

TDP Janasena First List: తెలుగుదేశం, జనసేన తొలి జాబితా విడుదలైంది. జనసేనకు 24 అసెంబ్లీ సీట్లు, మూడు పార్లమెంట్ స్థానాలను కేటాయించారు. తెలుగుదేశం పార్టీ 94 మందితో జాబితా ప్రకటించింది. జనసేన సైతం ఐదుగురు అభ్యర్థులను ఖరారు చేసింది. అయితే రెండు పార్టీల్లోనూ అసంతృప్తి కనిపిస్తోంది.కొన్నిచోట్ల నేతలు పార్టీకి రాజీనామా ప్రకటించారు. గత ఐదు సంవత్సరాలుగా పార్టీ అభివృద్ధికి కృషి చేస్తే.. తమను పరిగణలోకి తీసుకోకపోవడం పై వారు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. అందుకే ప్రత్యామ్నాయల కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ తరుణంలో కొందరు బాహటంగానే హై కమాండ్ పై విమర్శలకు దిగుతున్నారు. అటు తెలుగుదేశం పార్టీ సీనియర్లలో చాలామందికి తొలి జాబితాలో చోటు దక్కలేదు. వారు సైతం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

టిడిపి చాలాచోట్ల ఇన్చార్జిల స్థానంలో కొత్తవారికి టికెట్లు కేటాయించింది. విజయనగరం జిల్లా గజపతినగరం టిడిపి ఇన్చార్జిగా ఉన్న కొండపల్లి అప్పలనాయుడు బదులు.. ఆయన సోదరుడు కుమారుడు కొండపల్లి శ్రీనివాస్ రావు టిక్కెట్ కేటాయించారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన కొండపల్లి అప్పలనాయుడు పార్టీకి రాజీనామా ప్రకటించారు. గత ఐదు సంవత్సరాలుగా గజపతినగరం నియోజకవర్గ ఇంచార్జిగా కొనసాగుతున్నారు. ఇన్ని రోజులు పాటు నన్ను వాడుకొని.. ఇప్పుడు టిక్కెట్ లేదని చెప్పడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నిస్తున్నారు.

విశాఖపట్నం నియోజకవర్గంలో కూడా ఇదే పరిస్థితి ఉంది. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా గణబాబు ఉన్నారు. అదే సీటును పాశర్ల ప్రసాద్ ఆశించారు. కానీ దక్కలేదు. తొలి జాబితాలో సిట్టింగ్ ఎమ్మెల్యే గణబాబు పేరును ఖరారు చేశారు. తీవ్ర మనస్థాపానికి గురైన ప్రసాద్ పార్టీకి రాజీనామా చేశారు. రాయచోటి నియోజకవర్గంలో పోటీచేయాలని రమేష్ రెడ్డి భావించారు. కానీ తొలి జాబితాలో ఆయనకు సీటు దక్కలేదు. దీంతో అనుచరులతో పాటు రాజీనామా చేయడానికి ఆయన సిద్ధపడినట్లు తెలుస్తోంది. అనంతపురం జిల్లా పెనుకొండ నియోజకవర్గ టికెట్ ను సవితకు కేటాయించారు. దీనిని టిడిపి శ్రేణులు వ్యతిరేకించాయి. ఏకంగా కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. అటు తెనాలి టికెట్ను జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ కు కేటాయించారు. అక్కడ టిడిపికి బలమైన అభ్యర్థిగా మాజీ మంత్రి ఆలపాటి రాజా ఉన్నారు. గత ఐదు సంవత్సరాలుగా ఆయన ఇన్చార్జిగా కొనసాగుతున్నారు. గెలుస్తానన్న ధీమాతో ఉన్నారు. కానీ అక్కడ అనూహ్యంగా జనసేనకు సీటు కేటాయించడంతో ఆలపాటి రాజా అనుచరులు అసంతృప్తితో ఉన్నారు. మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధపడుతున్నారు. కృష్ణాజిల్లా పెడన టిక్కెట్ను కాగితా కృష్ణ ప్రసాద్ కేటాయించారు. దీంతో మరో సీనియర్ బూరగడ్డ వేదవ్యాసు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కార్యకర్తల సమావేశంలో ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. ఆయన్ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది.

జనసేనలో సైతం అసంతృప్తి కనిపిస్తోంది. 24 అసెంబ్లీ స్థానాలకే జనసేన పరిమితం కావడంపై జనసైనికులు ఆగ్రహంగా ఉన్నారు. జగ్గంపేట టిక్కెట్ను నియోజకవర్గ ఇన్చార్జ్ పాఠం శెట్టి సూర్య చంద్ర ఆశించారు. కానీ అక్కడ టిడిపి అభ్యర్థిగా జ్యోతుల నెహ్రూను ప్రకటించారు. గత ఐదేళ్లుగా కష్టపడి పనిచేసిన తనకు గుర్తింపు రాకపోవడం పై సూర్యచంద్ర కంటతడి పెట్టుకున్నారు. అయితే తీవ్ర కసరత్తు నడుమ జరిగిన అభ్యర్థుల ఎంపికలో చిన్న చిన్న ఇబ్బందులు ఎదురుకాక తప్పదని.. రెండు రోజుల్లో అన్ని సర్దుకుంటాయని రెండు పార్టీల నాయకత్వాలు భావిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular