Chandrababu: తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు దాదాపు ఖరారు అయ్యారు.చివరి నిమిషంలో నాలుగు చోట్ల అభ్యర్థులను మార్చింది ఆ పార్టీ.పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ 141 అసెంబ్లీ, 17 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలాచోట్ల పార్టీ ప్రకటించిన అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. మరికొందరు నామినేషన్లు వేసేందుకు సిద్ధపడుతున్నారు. ఈ క్రమంలో ఓ 14 మంది అభ్యర్థులు చంద్రబాబుకు షాక్ ఇచ్చారు. ఆదివారం బీఫారం పంపిణీ కార్యక్రమానికి గైర్హాజరయ్యారు. ఇది తెలుగుదేశం పార్టీలో వైరల్ గా మారింది.
చివరివరకు కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ప్రక్రియ జరుగుతూనే ఉంది. చివరి నిమిషంలో ఉండి అభ్యర్థిగా రఘురామకృష్ణంరాజును చంద్రబాబు ప్రకటించారు. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజును తప్పించి రఘురామకు క్లియర్ చేశారు. మరోవైపు మాడుగుల టికెట్ను మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తికి, పాడేరును గిడ్డి ఈశ్వరికి మార్చి కేటాయించారు.మరోచోట కూడా అభ్యర్థిని మార్చారు. దీంతో ఒక రకమైన గందరగోళం నెలకొంది. తంబళ్లపల్లె, దెందులూరు లో ఏదో ఒక నియోజకవర్గాన్ని బిజెపికి కేటాయించే అవకాశం ఉంది. అనపర్తి నియోజకవర్గాన్ని టిడిపికి కేటాయించేందుకు ఆ రెండు స్థానాలను పెండింగ్ లో పెట్టారు. ఇటువంటి పరిస్థితుల్లో బీఫారాల అందుకునేందుకు 14 మంది అభ్యర్థులు రాకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
నిన్నటి బి ఫారంల పంపిణీ కార్యక్రమానికి ఉరవకొండ, రాయదుర్గం, నరసరావుపేట, చిలకలూరిపేట, విజయవాడ తూర్పు, ఆత్మకూరు, పలమనేరు, బనగానపల్లి, తాడిపత్రి, రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులు గైర్హాజరయ్యారు. కొందరు వ్యక్తిగత కారణాలతో, మరికొందరు దూరాభారంతో రాలేమని ముందుగానే సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు కోవూరు అసెంబ్లీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తరఫున ఆమె భర్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కడప అసెంబ్లీ అభ్యర్థి మాధవి రెడ్డి తరఫున ఆమె భర్త శ్రీనివాసులు రెడ్డి బి ఫామ్ లను అందుకున్నారు. మొత్తానికి అయితే పెద్ద ఎత్తున అభ్యర్థులు రాకపోవడం తెలుగుదేశం పార్టీలో చర్చకు దారి తీసింది.