BJP: తెలుగుదేశం పార్టీ ఎన్డీఏకు చేరువ అవుతోంది. ఈ మేరకు బిజెపితో చంద్రబాబు సానుకూల చర్చలు జరుపుతున్నారు. ఇవి ఒక కొలిక్కి వచ్చినట్లు కనిపిస్తున్నాయి. ఏపీలో పొత్తుపై చర్చించేందుకు చంద్రబాబుతో పాటు పవన్ ఢిల్లీ వెళ్లారు. గురువారం రాత్రి కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశం అయ్యారు. సీట్ల సర్దుబాటుపై చర్చించారు. వారి మధ్య సానుకూలంగా చర్చలు జరిగినట్లు సమాచారం. ఈరోజు కూడా సీట్ల సర్దుబాటుపై వారి మధ్య చర్చలు జరగనున్నట్లు తెలుస్తోంది. ఇవి పూర్తయితే ఎన్డీఏలోకి టిడిపి ఎంట్రీ, ఏపీలో బిజెపికి కేటాయించాల్సిన సీట్లపై స్పష్టమైన ప్రకటన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
గత నెల 7న ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు అమిత్ షా తో సమావేశమయ్యారు. సరిగ్గా నెలరోజుల వ్యవధిలోనే చంద్రబాబు రెండోసారి కలవడం విశేషం. అయితే ఏడు లోక్ సభ, 10 అసెంబ్లీ స్థానాలు బిజెపి అడుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే టిడిపి నాలుగు పార్లమెంటు స్థానాలతో పాటు ఆరు అసెంబ్లీ సీట్లు ఇచ్చేందుకు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. అంతకుమించి సీట్లు ఇస్తే వైసీపీకి లాభిస్తుందని చంద్రబాబు అమిత్ షా తో చెప్పినట్లు తెలుస్తోంది. ఇప్పటికే జనసేనకు 24 అసెంబ్లీ, మూడు పార్లమెంట్ స్థానాలు కేటాయించిన సంగతి తెలిసిందే. మొత్తంగా పొత్తులో భాగంగాఆ రెండు పార్టీలకు 30 అసెంబ్లీ స్థానాలు, ఏడు పార్లమెంట్ స్థానాలు వదులుకునేందుకు టిడిపి సిద్ధపడినట్లు తెలుస్తోంది. అయితే ఈరోజు జరిగే తుది చర్చల అనంతరం ఈ సంఖ్యలో కొంత అటూ ఇటూ మార్పు ఉండవచ్చని భావిస్తున్నారు.
2014 ఎన్నికల్లో బిజెపికి నాలుగు ఎంపీ, 13 అసెంబ్లీ స్థానాలను తెలుగుదేశం పార్టీ కేటాయించింది. ఆ ఎన్నికల్లో జనసేన బయట నుండి మద్దతు తెలిపింది. అయితే ఈసారి మూడు పార్టీలు కలిసి పోటీ చేయనున్నందున దాదాపు 30 అసెంబ్లీ స్థానాలను త్యాగం చేయాల్సి వస్తోంది. ఈ తరుణంలో పవన్ సైతం బిజెపి ఆగ్రనేతలను ఒప్పిస్తున్నట్లు సమాచారం. అయితే ఒకటి రెండు స్థానాలు అటు ఇటు అయినా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో చేరడం ఖాయంగా తేలుతోంది. ఇప్పటికే బీహార్ లోని నితీష్ కుమార్, ఉత్తరప్రదేశ్ లోని ఆర్ఎల్డి నేత జయంత్ చౌదరిని ఎన్డీఏలో చేర్చుకున్నారు. రేపో మాపో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ సైతం ఎన్డీఏలో చేరతారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో చంద్రబాబు చేరిక కూడా ఖాయమని తేలుతోంది. దీనిపై ఈరోజు కానీ, రేపు కానీ స్పష్టమైన ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.