Pilli Subhash Chandra Bose: వైసీపీ రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్( pilli Subhash Chandra Bose) పార్టీ మారే ఆలోచనతో ఉన్నారా? టిడిపిలో చేరుతారా? వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెబుతారా? అందుకే సొంత పార్టీ నేతలపై ఆరోపణలు చేస్తున్నారా? త్వరలో ఆయన ఎందుకు చంద్రబాబును కలవనున్నారు? పొలిటికల్ సర్కిల్లో దీనిపైనే ఆసక్తికర చర్చ నడుస్తోంది. నిన్నటికి నిన్న ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. రామచంద్రపురం నియోజకవర్గంలో వైసిపి హయాంలో భారీ అవినీతి జరిగిందని ఆరోపించారు. గృహ నిర్మాణంలో భాగంగా కోట్లాది రూపాయలు అప్పట్లో పక్కదారి పట్టించారని ఆరోపణలు చేశారు. మరో నాలుగు నెలలు రాజ్యసభ పదవీకాలం ముగియడం, సొంత పార్టీ నేతలపై బోస్ ఆరోపణలు చేయడంతో.. ఆయన పార్టీ మారుతారని ప్రచారం మొదలైంది.
వైసీపీ హయాంలో కోల్డ్ వార్..
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ ఏర్పాటు తర్వాత జగన్ వెంట అడుగులు వేశారు సుభాష్ చంద్రబోస్. 2014 ఎన్నికల్లో ఓటమి చవి చూశారు. 2019 ఎన్నికల్లో సుభాష్ చంద్రబోస్ విషయంలో ప్రయోగం చేశారు జగన్. ఆయన సొంత నియోజకవర్గాన్ని కాదని మండపేట టిక్కెట్ ఇచ్చారు. రామచంద్రపురం నుంచి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణను రంగంలోకి దించారు. అయితే రామచంద్రపురం నుంచి వేణుగోపాలకృష్ణ గెలిచారు. మండపేట నుంచి సుభాష్ చంద్రబోస్ ఓడిపోయారు. అయితే ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు జగన్ బోస్ కు. అలా ఎమ్మెల్సీగా ఉన్న బోస్ ను మంత్రిని కూడా చేశారు. అయితే ఇంతలో మండలిని రద్దు చేయాలని ఆలోచన చేశారు. ఈ క్రమంలోనే బోస్ను రాజ్యసభకు పంపించారు. ఆయన రాజీనామా చేసిన మంత్రి పదవిని చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణకు ఇచ్చారు. అయితే ఎంపీగా ఉన్న బోస్ కు, మంత్రిగా ఉన్న వేణుగోపాల కృష్ణ మధ్య విభేదాలు నడిచాయి.
మరో ఆరు నెలల్లో రిటైర్మెంట్..
రాజ్యసభ సభ్యుడిగా ఉండడంతో సుభాష్ చంద్రబోస్ కు మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం చిక్కలేదు. పైగా రామచంద్రపురం( Ramachandrapuram) నియోజకవర్గ బాధ్యతల విషయంలో ఆయన అసంతృప్తితో ఉన్నారు. మరో ఆరు నెలల్లో రాజ్యసభ పదవి కూడా ఖాళీ కానుంది. ఇప్పుడు ఏదో ఒక పొలిటికల్ ప్లాట్ఫారం కావాలి. అందుకే పిల్లి సుభాష్ చంద్రబోస్ ఇప్పుడు సౌండ్ చేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు గృహ నిర్మాణ అవినీతి ఆయనకు గుర్తుకు రాలేదు. ఇప్పుడు అదే అంశాన్ని పట్టుకొని సొంత పార్టీ నేతలపై విమర్శలు చేస్తున్నారు. సీఎం చంద్రబాబును కలుస్తానని చెబుతున్నారు. తద్వారా టిడిపిలో ఎంట్రీ కి సిద్ధమని సంకేతాలు పంపిస్తున్నారు. మరి తెలుగుదేశం పార్టీ ఈ విషయంలో ఎలా స్పందిస్తుందో చూడాలి. అటు వైసిపి నాయకత్వం సైతం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.