https://oktelugu.com/

Nara Bhuvaneshwari: షర్మిలకు, భువనేశ్వరికి తేడా ఇదే

ప్రమాణ స్వీకార వేదిక పైకి వచ్చిన నారా భువనేశ్వరిని సోదరుడు నందమూరి బాలకృష్ణ నుదుటిపై ముద్దు పెట్టి తనలో ఉన్న ఆప్యాయతను చూపించారు.

Written By:
  • Dharma
  • , Updated On : June 13, 2024 / 05:51 PM IST

    Nara Bhuvaneshwari

    Follow us on

    Nara Bhuvaneshwari: ఏపీ ప్రభుత్వ ప్రమాణ స్వీకారం లో బలమైన బంధాలు, భావోద్వేగాలు వెలుగు చూశాయి. సమాజానికి అవసరమైన దృశ్యాలు ఆవిష్కృతమయ్యాయి. నందమూరి, నారా, కొణిదెల కుటుంబాలు బలమైన ముద్రను చాటుకున్నాయి. తమ మధ్య ఉన్న కుటుంబ అనుబంధాలు, ఆప్యాయతలను ప్రతిబింబించాయి. సామాన్య ప్రజలను సైతం ఆలోచింపజేశాయి. అందరినీ దూరం చేసుకుంటూ జగన్ అపజయాన్ని మూట కట్టుకోగా.. అందర్నీ కలుపుకొని, అన్ని కుటుంబాలు ఏకమై విజయాన్ని అందుకున్నాయి. విజయాన్ని ఆస్వాదించాయి. ప్రమాణ స్వీకారం మహోత్సవం అసాంతం కుటుంబ విలువలు తెలిపేలా దృశ్యాలు కనిపించాయి.

    ప్రమాణ స్వీకార వేదిక పైకి వచ్చిన నారా భువనేశ్వరిని సోదరుడు నందమూరి బాలకృష్ణ నుదుటిపై ముద్దు పెట్టి తనలో ఉన్న ఆప్యాయతను చూపించారు. అన్న దీవెనలను ఆమె సంతోషంగా స్వీకరించారు. దానిని ప్రతి ఒక్కరూ చూసి సంతోషించారు. చంద్రబాబు, నారా లోకేష్ ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు.. కుటుంబ సభ్యుల ఆనందాలకు అవధులు లేవు. నారా బ్రాహ్మణి, ఆమె కుమారుడు దేవాన్సు లేచి సందడి చేశారు. వెనుకనే కూర్చుని ఉన్న నందమూరి రామకృష్ణ, సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు తీవ్ర ఉద్వేగానికి గురయ్యారు.

    పవన్ కళ్యాణ్ అను నేను అని జనసేన అధినేత ప్రమాణం చేసే సమయంలో జనసైనికుల సందడి అంతా ఇంతా కాదు. బాహుబలి సినిమాలో ప్రభాస్ పట్టాభిషిక్తుడు అయినప్పుడు వచ్చిన వైబ్రేషన్ కేసరపల్లిలో వినిపించాయి. ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం పవన్ చంద్రబాబు, నరేంద్ర మోడీ వద్దకు వెళ్లి వారికి పాదాభివందనం చేయబోయారు. కానీ వారు వద్దని వారించారు. అక్కడకు కొద్ది దూరంలో ఉన్న చిరంజీవిని పాదాభివందనం చేసి తన అభిమానాన్ని చాటుకున్నారు పవన్. ఆ సమయంలో మెగా కుటుంబం భావోద్వేగానికి గురైంది. చప్పట్లతో ఆహ్వానించింది. ప్రమాణ స్వీకార అనంతరం ప్రధాని మోదీ మెగా బ్రదర్స్ కు ఇచ్చిన గౌరవానికి అంతా ఫిదా అయ్యారు. అయితే ఈ కార్యక్రమంలో వెలుగు చూసిన కుటుంబ విలువలు, బలమైన బంధాలు చూసి ఎన్నెన్నో ఆలోచనలు బయటకు వచ్చాయి. ముఖ్యంగా జగన్ కుటుంబ సభ్యులకు వ్యవహరించిన తీరు చర్చకు వచ్చింది. షర్మిల విషయంలో జగన్ వ్యవహరించిన తీరు, భువనేశ్వరి విషయంలో బాలకృష్ణ వ్యవహరించిన తీరును ఎక్కువమంది సరిపోల్చుకున్నారు. జగన్ వైఖరిని తప్పుపట్టారు.