Pawan Kalyan: ఏపీలో పొత్తుల వ్యవహారం ఇప్పట్లో కొలిక్కి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. జనసేనతో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుంది. మరోవైపు బిజెపితో చర్చలు జరుపుతోంది. ఢిల్లీ వెళ్లి చంద్రబాబు బిజెపి అగ్ర నేతలను కలిశారు. పొత్తులపై చర్చించారు. అయితే ఇది జరిగి పది రోజులు అవుతున్నా చంద్రబాబు నోరు మెదపడం లేదు. అటు బిజెపి హై కమాండ్ నుంచి సైతం ఉలుకూ పలుకూ లేదు. అసలు పొత్తు ఉంటుందా? లేదా? అన్నది తెలియడం లేదు. ఈ విషయంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.
అయితే తాజాగా చంద్రబాబు టిడిపి నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా పొత్తు అనివార్యమని.. కొందరు త్యాగాలు చేయాల్సి ఉంటుందని తేల్చి చెబుతున్నారు. కొందరు నేతలకు బుజ్జగింపులకు దిగుతున్నారు. దీంతో టిడిపి నేతల్లో ఒక రకమైన ఆందోళన నెలకొంది. కొందరు మెత్తబడుతున్నారు. మరికొందరు మాత్రం ధిక్కారస్వరం వినిపిస్తున్నారు. అయితే ఈ పరిణామాల నడుమ అసలు టిడిపి ఎన్ని సీట్లు త్యాగాలు చేయాల్సి ఉంటుంది? జనసేన ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది? బిజెపికి కేటాయించే సీట్లు ఎన్ని? అన్న దానిపై మాత్రం స్పష్టత లేదు.
అయితే ఆ మూడు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ప్రక్రియ పూర్తయినట్లు ప్రచారం జరుగుతోంది. కానీ వ్యూహాత్మకంగానే ఆ విషయాన్ని బయట పెట్టడం లేదని తెలుస్తోంది. ముందే బయట పెడితే టిడిపి నేతల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. ఆశావహులకు సీట్లు దక్కకుంటే వైసిపి ఆకర్ష మంత్రం పనిచేసే ఛాన్స్ కనిపిస్తోంది. అందుకే అధికార పార్టీకి ఏ అవకాశం ఇవ్వకుండా.. ఆ మూడు పార్టీలు వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్నట్లు సమాచారం.దాదాపు ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్ వరకు ఇదే గొప్యత పాటించాలని అనుకున్నట్లు తెలుస్తోంది.
మూడు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ప్రక్రియలో భాగంగా 40కుమించి స్థానాలు టిడిపి త్యాగం చేయాల్సి వస్తే.. ఆ పార్టీలో తిరుగుబాటు ఖాయమని చంద్రబాబు భయపడుతున్నారు. 40 కంటే సీట్లు జనసేనకు తగ్గితే.. జన సైనికులతో పాటు కాపు సామాజిక వర్గం నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని పవన్ భయపడుతున్నారు. మరోవైపు బిజెపిలో ఎప్పటినుంచో ఉన్న పాత తరం నాయకులు సైతం తమకు అవకాశం కావాలని కోరుతున్నారు. ఇలా మూడు పార్టీలు మూడు లెక్కలతో ఉన్నాయి. అందుకే ఎన్నికల నోటిఫికేషన్ వరకు సీట్ల సంఖ్య, అభ్యర్థుల పేర్లు బయట పెట్టకూడదని చంద్రబాబుతో పాటు పవన్ భావిస్తున్నారు. ఇదే విషయాన్ని బిజెపి హై కమాండ్ కు చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. మరి అందులో ఎంతవరకు వాస్తవం ఉందో చూడాలి.