TTD: టీటీడీ వివాదాల నేపథ్యంలో ప్రక్షాళనకు దిగింది కూటమి ప్రభుత్వం. గత రెండు రోజులుగా తిరుమలలో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు వరుసగా అధికారులతో సమీక్షలు జరుపుతున్నారు. లడ్డూ వివాదం నేపథ్యంలో ఎటువంటి లోపాలు వెలుగు చూడకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని చంద్రబాబు ఆదేశించారు. తిరుమలలో ప్రతి విభాగాన్ని బలోపేతం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా లడ్డూ నాణ్యత పెరగాలే తప్ప.. తగ్గకూడదని స్పష్టం చేశారు. తిరుమల వచ్చే భక్తుడు సంతృప్తిగా స్వామి వారిని దర్శించుకుని వెళ్లే ఏర్పాట్లు చేయాలన్నారు. భక్తుల మనోభావాలను గౌరవించాలన్నారు. అయితే తాజాగా లడ్డూ వివాదం నేపథ్యంలో టీటీడీ చరిత్ర మసకబారింది. ప్రతిరోజు లక్షలాదిమంది సందర్శించుకునే పవిత్ర దేవస్థానంలో ఈ పరిస్థితి ఏంటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.ఏటా వందలాది కోట్ల ఆదాయం సమకూరే టీటీడీకి సొంత వనరులు లేకపోవడం లోటుగా కనిపిస్తోంది. ముఖ్యంగా డెయిరీ లేకపోవడం నిజంగా లోటే. తిరుమల లడ్డు తయారీలో నెయ్యిదే కీలక పాత్ర. అటువంటి నెయ్యికలుషితం కావడం ఆందోళనకు కారణమవుతోంది. అదే సొంత డెయిరీ ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. కేవలం ఇతర డెయిరీలపై ఆధారపడడం వల్లే ఈ వివాదాలు వచ్చిన విషయాన్ని విశ్లేషకులు సైతం గుర్తు చేస్తున్నారు. ఏటా వందలాది కోట్ల ఆదాయం సమకూరే టీటీడీకి సొంత డెయిరీ ఉండాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఓ రాజకీయ పార్టీ అధినేత తిరుమల తిరుపతి దేవస్థానం డెయిరీ ఏర్పాటు చేస్తే ఆవులను సమకూర్చే బాధ్యత తీసుకుంటానని ముందుకు రావడం విశేషం.
* కీలక ప్రతిపాదనలు
చిత్తూరు జిల్లా బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ రాష్ట్ర ప్రభుత్వానికి కీలక ప్రతిపాదనలు చేశారు. శనివారం సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. టీటీడీ సొంత డెయిరీ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. 1000 ఆవులను తాను అందిస్తానని.. లక్ష గోవులు సమకూర్చే బాధ్యతలు తీసుకుంటానని లేఖలో పేర్కొన్నారు. రోజుకు సగటున సుమారు లక్ష మంది భక్తులు దర్శించుకుని.. ఐదు కోట్ల రూపాయల ఆదాయం వచ్చే తిరుమల క్షేత్రంలో సొంతంగా డెయిరీ లేకపోవడం ఏంటని ప్రశ్నించారు. ప్రభుత్వం ఏర్పాటు చేస్తే భక్తులు కూడా సహకరిస్తారని గుర్తు చేశారు రామచంద్ర యాదవ్. టీటీడీని గత పాలకులు రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చేశారని.. వ్యాపార సమస్త గా తయారు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
* లక్ష గోవు లతో
లక్ష గోవులతో డెయిరీ నడిపిస్తే రోజుకు కనీసం 10 లక్షల లీటర్ల ఆవు పాలు ఉత్పత్తి చేయవచ్చని.. వాటి నుంచి రోజుకు 50 వేల కేజీల వెన్న తీసి.. 30 వేల కేజీల నెయ్యి తయారు చేసుకోవచ్చని అభిప్రాయపడ్డారు రామచంద్ర యాదవ్. ఈ నెయ్యిలో స్వామి అవసరాలకు సగం వాడగా.. మిగిలిన మొత్తాన్ని రాష్ట్రంలోని ప్రసిద్ధ దేవాలయాలకు పంపించవచ్చని.. తద్వారా నెయ్యిలో కల్తీ నియంత్రించవచ్చని రామచంద్ర యాదవ్ అభిప్రాయపడ్డారు. అలాగే టీటీడీ బోర్డులో ఆధ్యాత్మిక గురువులు, ధార్మిక ప్రతినిధులు ఉండేలా చూడాలని కూడా విజ్ఞప్తి చేశారు. రామచంద్ర యాదవ్ ప్రతిపాదనకు ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: This is a wonderful solution to solve adulterated ghee in ttd will chandrababu respond
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com