Chandrababu Latest News: ఏపీ సీఎం చంద్రబాబుకు( AP CM Chandrababu) ప్రకృతి కూడా సహకారం అందిస్తోంది. గతంలో ఒక విమర్శ చంద్రబాబుపై ఉండేది. ఆయన హయాంలో వర్షాలు పడవన్నది ఒక అపవాదు. దీనినే రాజకీయ ప్రత్యర్థులు ప్రచార అస్త్రంగా చేసుకుంటూ వచ్చారు. అయితే ఇప్పుడు చంద్రబాబు మరోసారి అధికారంలోకి వచ్చారు. తనపై వ్యతిరేక ప్రచారాన్ని పటాపంచలు చేశారు. రాజకీయంగాను బలోపేతం అవుతున్నారు. ఇప్పుడు విస్తారంగా ఏపీలో వర్షాలు కురిసాయి. సమయానుకూలంగా పడడంతో పంటలు కూడా బాగానే ఉన్నాయి.
వెంటాడిన వైయస్ కామెంట్స్
ఉమ్మడి రాష్ట్రంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి(YS Rajasekhar Reddy ) సీఎం గా ఉన్నప్పుడు సరదాగా చేసిన వ్యాఖ్యలు చంద్రబాబును ఇప్పటివరకు వెంటాడుతూ వచ్చాయి. 1995 నుంచి 2003 వరకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్న సమయంలో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు కొన్ని సంవత్సరాలు పాటు కొనసాగాయి. అప్పట్లో వర్షాలు పడకపోవడంతో రైతులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. 2004లో రాజశేఖర్ రెడ్డి సీఎం అయిన తర్వాత వర్షాలు సమృద్ధిగా పడ్డాయి. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ రాజశేఖర్ రెడ్డి చంద్రబాబుపై వ్యంగ్యంగా విమర్శలు చేశారు. వరుణుడు తమ పార్టీగా చెప్పుకునేవారు. ఆ తరువాత క్రమంలో చంద్రబాబుపై వర్షాల అపవాదు కొనసాగింది.
సగటు కంటే ఎక్కువ వర్షపాతం..
చంద్రబాబు ఈ రాష్ట్రానికి నాలుగో సారి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. అయితే చంద్రబాబు సీఎం గా బాధ్యతలు స్వీకరించిన సమయంలో ఆయనపై వర్షాల సెంటిమెంటును లేపడానికి ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి. వైసిపి హయాంలో సైతం విస్తారంగా వర్షాలు పడ్డాయని అనుకూల మీడియా ప్రచారం చేసుకుంటూ వచ్చింది. కానీ చంద్రబాబు తాజాగా అధికారంలోకి వచ్చి 16 నెలలు అవుతుంది. రెండు ఖరీఫ్ లతోపాటు ఒక రబీ సీజన్ కూడా నడిచింది. కానీ ఇప్పుడు వర్షాలు విస్తారంగా కురుస్తుండడంతో చంద్రబాబు పార్టీ వైపు వరుణుడు వెళ్లిపోయాడా? అనే ఆసక్తికర చర్చ నడుస్తోంది. టిడిపి అనుకూల మీడియా కూడా దీనినే హైలెట్ చేస్తోంది. చంద్రబాబు 4.0 ప్రభుత్వంలో ఇది రెండో వర్షాకాలం. భారత వాతావరణ శాఖ గణాంకాల ప్రకారం ఈ నైరుతి సీజన్లో ఏపీలో 530.9 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. ఇది సాధారణం కంటే ఎక్కువ. ఎప్పుడు రాయలసీమలో కురవని వర్షాలు కూడా ఈ ఏడాది విస్తారంగా కురిసాయి. రాయలసీమ ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారు. దీంతో చంద్రబాబు వైపు వరుణుడు యు టర్న్ తీసుకున్నాడు అన్న కామెంట్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.