Lok Sabha Election 2024: సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీకి సంబంధించి పోలింగ్ గడువు మరో రెండు రోజులు మాత్రమే ఉంది. రేపు సాయంత్రంతో ఎన్నికల ప్రచారానికి కూడా గడువు ముగియనుంది. దీంతో 11, 12, 13 తేదీలే కీలకం. ఇప్పటికే ఏపీలో మెజారిటీ ప్రజలు ఏ పార్టీకి ఓటు వేయాలో డిసైడ్ అయ్యారు. తటస్తులు, ఏ పార్టీతో సంబంధం లేని వారు మాత్రం వేవ్ ను చూసి ఓటు వేసే అవకాశం ఉంది. అటువంటి వారి కోసమే అన్ని పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి.తమ వైపు తిప్పుకునేందుకు పావులు కదుపుతున్నాయి.ఈ క్రమంలో మద్యం, డబ్బు విపరీతంగా ప్రభావం చూపుతాయనడం అతిశయోక్తి కాదు. అయితే ఈ మూడు రోజుల్లో ప్రజల అభిప్రాయం మార్చేందుకు అన్ని పార్టీలు శతవిధాలా ప్రయత్నం చేస్తాయి.
ఏడాది కిందట వరకు ఏపీలో ఒక రకమైన మూడ్ ఉండేది. అధికార వైసిపి మరోసారి అధికారంలోకి రావడం ఖాయం అన్న ధీమా వ్యక్తం అయ్యేది. కానీ ఈ విషయంలో చంద్రబాబు ఆలోచన పనిచేసింది. ప్రతి అడుగు వ్యూహాత్మకంగా వేయడంతో.. ప్రస్తుతం గట్టి ఫైట్ ఉందన్న స్థితికి చేర్చడంలో చంద్రబాబు పాత్ర ఉంది. మూడు పార్టీల మధ్య పొత్తు కుదుర్చుకున్నారు. సీట్ల సర్దుబాటు చేసుకున్నారు. కేంద్రం నుంచి అన్ని విధాలా సహాయం పొందగలుగుతున్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని రకాల అనుకూలతలు సాధించగలుగుతున్నారు. గత కొన్ని వారాలుగా వైసీపీకి ఫేవర్ గా పనిచేసే అధికారులపై బదిలీ వేటు వేయగలిగారు. డీజీపీని మార్చగలిగారు. మరోవైపు సిఎస్ ను భయంతో ఉంచగలిగారు. వైసిపి ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచగలగడంలో సక్సెస్ అయ్యారు.
గత ఎన్నికలకు ముందు చంద్రబాబు పై చేసిన ప్రయత్నాలను.. ఇప్పుడు జగన్ పై ప్రయోగించడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారు. కూటమికి పాజిటివ్ వైబ్రేషన్ తెప్పించడంలో కూడా అనుకున్నది సాధించగలిగారు.అయితే ప్రస్తుతానికి వైసీపీ వర్సెస్ కూటమి అన్న రేంజ్ కు తీసుకు రాగలిగారు. కానీ ఇంతవరకు ఒక ఎత్తు.. ఇకనుంచి మరో ఎత్తు అన్న పరిస్థితి ఉంది. ఈ మూడు రోజులపాటు తమ పట్టు నిలుపుకుంటే.. విజయం తప్పకుండా వరిస్తుందని టిడిపి కూటమి భావిస్తోంది. అయితే అదే రీతిలో వైసీపీ కూడా తమ ధీమా కనబరుస్తోంది. ఇలా ఎలా చూసుకున్నా ఏపీలో ఈ మూడు రోజులపాటు కీలకం. అయితే ఎన్నికల వ్యూహంలో కూటమి సక్సెస్ అవుతుందా? లేకుంటే వైసిపి అధిగమిస్తుందా? అన్నది చూడాలి.