Homeఆంధ్రప్రదేశ్‌AP Politics : ఇలా వచ్చి అలా వెళ్ళిపోయిన పార్టీలు.. రాజకీయంగా నిలదొక్కుకున్నవి కొన్నే!

AP Politics : ఇలా వచ్చి అలా వెళ్ళిపోయిన పార్టీలు.. రాజకీయంగా నిలదొక్కుకున్నవి కొన్నే!

AP Politics : రాజకీయ పార్టీలను నడపడం అత్యంత కష్టంతో కూడుకున్న పని. అందున సుదీర్ఘకాలం మనగలగడం ఇబ్బందికరమే. సంక్షోభాలను, సవాళ్లను అధిగమించాల్సి ఉంటుంది. సుదీర్ఘకాలం ప్రజాదరణ పొందడం కూడా అంత ఈజీ కాదు. దేశవ్యాప్తంగా ఒక వెలుగు వెలిగిన పార్టీలు సైతం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి. మరికొన్ని కాలగర్భంలో కలిసిపోయాయి. ఏపీలో సైతం ఎన్నో పార్టీలు పుట్టుకొచ్చాయి. కానీ వాటిలో నిలబడినవి కొన్నే. ఇలా వచ్చి అలా వెళ్ళిపోయిన పార్టీలు సైతం ఉన్నాయి. అటువంటి జాబితాలో చాలా పార్టీలు ఉన్నాయి.

* టిడిపి ది ఒక చరిత్ర
రాజకీయం పూల బాట కాదు. నిత్యం సంక్షోభాలను ఎదుర్కోవాల్సిందే. ఓర్పుతో, నేర్పుతో, వ్యూహాలతో ప్రత్యర్థి అంచనాలకు మించి ముందంజలో ఉంటేనే మనుగడ సాధించేది. లేకుంటే కష్టమే. ఉమ్మడి ఏపీని సుదీర్ఘ కాలంగా ఏలింది కాంగ్రెస్ పార్టీ. కేవలం కాంగ్రెస్, హస్తం గుర్తు మాత్రమే ఏపీ ప్రజలకు సుపరిచితం. అటువంటి సమయంలో తెలుగు జాతిని మేల్కొల్పుతూ తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేశారు నందమూరి తారక రామారావు. పసుపు జెండాను, సైకిల్ గుర్తును పరిచయం చేశారు. పార్టీ పెట్టిన తొమ్మిది నెలలకే అధికారంలోకి తెచ్చి తెలుగు వాడి పౌరుషాన్ని ఢిల్లీకి చూపించారు. జాతీయ రాజకీయాల్లో సైతం చక్రం తిప్పారు. దేశంలో ప్రాంతీయ పార్టీలకు దిక్సూచిగా మారారు.

ఎన్టీఆర్ నుంచి తెలుగుదేశం పార్టీని హస్తగతం చేసుకున్నారు చంద్రబాబు. అయితే ఎన్టీఆర్ మరణంతో టిడిపిలో సైతం చీలికలు ఏర్పడ్డాయి. ఎన్టీఆర్ సతీమణిగా చలామణి అయిన లక్ష్మీపార్వతి 1995లో ఎన్టీఆర్ టిడిపి అంటూ మరో పార్టీని ఏర్పాటు చేశారు. ఆ పార్టీకి సింహం గుర్తును కేటాయించింది ఎలక్షన్ కమిషన్. రెండు సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొంది ఆ పార్టీ. కానీ కనీస స్థాయిలో కూడా ఓట్లు దక్కించుకోలేకపోయింది. స్వయంగా పోటీ చేసిన లక్ష్మీపార్వతి కి కేవలం 900 ఓట్లు మాత్రమే వచ్చాయి. అందుకే ఆమె తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. చంద్రబాబుతో విభేదాలు తలెత్తడంతో నందమూరి హరికృష్ణ 1999లో అన్న ఎన్టీఆర్ అంటూ మరో పార్టీని ఏర్పాటు చేశారు. స్వయంగా తాను గుడివాడ నియోజకవర్గం నుంచి పోటీ చేసి టిడిపి అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. దీంతో తన పార్టీని టిడిపిలో విలీనం చేసి చంద్రబాబు నాయకత్వానికి జై కొట్టారు.

* వచ్చినంత వేగంతోనే కనుమరుగు..
పారదర్శక రాజకీయాల కోసం పరితపించారు మాజీ ఐఏఎస్ అధికారి జయప్రకాశ్ నారాయణ. స్వచ్ఛంద పదవీ విరమణ చేసి 1996లో లోక్సత్తా పార్టీని ఏర్పాటు చేశారు. కానీ ఒక ఎన్నికల్లో తాను మాత్రమే గెలిచారు. తరువాత ఎన్నికల్లో ఓటమి చవిచూసేసరికి ఆ పార్టీ తెరమరుగయ్యింది. 2005లో తెలంగాణ ఆవిష్కరణ ధ్యేయంగా తల్లి తెలంగాణ పార్టీని స్థాపించారు విజయశాంతి. పార్టీని నడపలేక కేసీఆర్ నేతృత్వంలోని టిఆర్ఎస్ లో విలీనం చేశారు. రాష్ట్ర విభజనను అడ్డం పెట్టుకుని తెలంగాణలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి నవ తెలంగాణ పార్టీని స్థాపించారు దేవేందర్ గౌడ్. కానీ ఆయన పార్టీ సైతం నిలబడలేకపోయింది. టిఆర్ఎస్ లో విలీనం అయ్యింది. ఇక ప్రొఫెసర్ కోదండరాం తెలంగాణ జన సమితి పేరుతో ఒక పార్టీని ఏర్పాటు చేశారు. ఆయన కూడా నడపలేక సతమతమవుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాలని భావిస్తున్నారు. 2021లో తెలంగాణలో తన తండ్రి పేరిట పార్టీని స్థాపించారు షర్మిల. కొద్ది కాలానికి కాంగ్రెస్ పార్టీలో పార్టీని విలీనం చేసి.. పిసిసి పగ్గాలు అందుకున్నారు.

తెలుగు నాట ఎన్టీఆర్ తర్వాత అంత చరిష్మ ఉన్న హీరో మెగాస్టార్ చిరంజీవి. 2009లో ప్రజారాజ్యం పార్టీని ఏర్పాటు చేశారు. ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేశారు. 70 లక్షల ఓట్లతో 18 స్థానాలకు పరిమితం అయ్యారు. పార్టీని నడపలేక కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. కాంగ్రెస్ అగ్ర నాయకత్వంతో విభేదించి జగన్ తన తండ్రి పేరిట పార్టీని ఏర్పాటు చేశారు. 2014లో 67 స్థానాలతో ప్రతిపక్ష పాత్ర పోషించారు. 2019లో 151 స్థానాలతో అధికారంలోకి రాగలిగారు. ఈ ఎన్నికల్లో 11 స్థానాలకే పరిమితమయ్యారు. 2014లో జనసేన ను ఏర్పాటు చేశారు పవన్. కానీ పార్టీని నడిపేందుకు ఆపసోపాలు పడ్డారు. ఈ ఎన్నికల్లో విజయం సొంతం చేసుకున్నారు. అయితే ఈ విశ్లేషణలో ప్రజాక్షేత్రంలో నిలిచింది ఒకటి రెండు పార్టీలు మాత్రమే. కానీ ఇలా వచ్చి అలా వెళ్ళిన పార్టీలే అధికం.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
Exit mobile version