CM Chandrababu: నేడు సీఎం చంద్రబాబు సంతకాలు చేసే ఐదు ఫైళ్లు అవే

ప్రధాని మోదీ నుంచి సీఎం చంద్రబాబు వరకు.. ఎవరి ప్రసంగాలు లేకుండా ప్రమాణ స్వీకార మహోత్సవం ముగిసింది. కేవలం అల్పాహార విందుకు మాత్రమే పరిమితం అయింది.

Written By: Dharma, Updated On : June 13, 2024 11:53 am

CM Chandrababu

Follow us on

CM Chandrababu: ఏపీలో ప్రభుత్వం కొలువుదీరింది. సీఎం చంద్రబాబు తో పాటు 24 మంది మంత్రులు పదవీ ప్రమాణం చేశారు. అనంతరం సీఎం చంద్రబాబు కుటుంబ సమేతంగా తిరుపతి వెళ్ళిపోయారు. ఈరోజు శ్రీవారిని దర్శించుకుని తిరిగి అమరావతి చేరుకోనున్నారు. సచివాలయంలోని మొదటి బ్లాక్ లో సీఎం చాంబర్లో గురువారం సాయంత్రం 4:41 గంటలకు చంద్రబాబు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇందుకు సంబంధించి సచివాలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నిన్న ప్రమాణ స్వీకారం సందర్భంగా చంద్రబాబు ఐదు ఫైళ్లపై సంతకాలు చేస్తారని ప్రకటించారు. కానీ నిన్న కేవలం ప్రమాణ స్వీకారానికి మాత్రమే పరిమితమయ్యారు. ప్రధాని మోదీ నుంచి సీఎం చంద్రబాబు వరకు.. ఎవరి ప్రసంగాలు లేకుండా ప్రమాణ స్వీకార మహోత్సవం ముగిసింది. కేవలం అల్పాహార విందుకు మాత్రమే పరిమితం అయింది.

అయితే సీఎంగా చంద్రబాబు బాధ్యతల స్వీకరణ అనంతరం ఐదు ఫైళ్లపై ఆయన సంతకం చేయనున్నారు. యువతకు పెద్దపీట వేసేలా మెగా డీఎస్సీ, నైపుణ్య గణన, ప్రజల్లో ఆందోళన తీర్చేలా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు అండగా నిలిచేలా పింఛన్ల పెంపు, పేదల ఆకలిని తీర్చేలా అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ ఫైళ్లపై సంతకాలు పెట్టనున్నారు చంద్రబాబు. టిడిపి అధికారంలోకి వస్తే మెగా డీఎస్సీ ప్రకటిస్తానని ప్రతిపక్ష నేతగా చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు డీఎస్సీ నోటిఫికేషన్ కు సంబంధించి ఫైల్ పై సంతకం చేస్తారు. వైసీపీ ప్రభుత్వంలో ఇచ్చిన డీఎస్సీని సవరించి.. కొత్త ప్రకటన చేస్తారు.

ల్యాండ్ టైటిల్ యాక్ట్ ప్రజల్లో ఒక రకమైన ఆందోళనకు కారణమైంది. ఒక విధంగా చెప్పాలంటే వైసిపికి శాపంగా మారింది. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వివాదాస్పదమైన ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. సామాన్యుల ఆస్తులకు ఈ చట్టంతో రక్షణ లేకుండా పోతుందని న్యాయవాదులు, మేధావులు, నిపుణులు గొంతు చించుకున్నా వైసీపీ ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. అందుకే ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీగా దీనిని రద్దు చేస్తూ ఫైల్ పై చంద్రబాబు సంతకం చేయనున్నారు.

2014లో 200 రూపాయలు ఉన్న పింఛన్ ను.. 1000కి పెంచారు చంద్రబాబు. ఎన్నికలకు ముందు రెండు వేల రూపాయలకు పెంచేశారు. ఈసారి అధికారంలోకి వస్తే ఆ మొత్తాన్ని నాలుగు వేలకు పెంచుతానని చంద్రబాబు హామీ ఇచ్చారు. పెంచిన పింఛన్ మొత్తాన్ని ఏప్రిల్ నెల నుంచి వర్తింప చేస్తానని కూడా ప్రకటించారు. దివ్యాంగులకు 6000 పింఛన్ అందిస్తామని కూడా హామీ ఇచ్చారు. దీనిపై కూడా చంద్రబాబు సంతకం చేయనున్నారు.

టిడిపి ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా 183 అన్న క్యాంటీన్లను ప్రారంభించారు. ఐదు రూపాయలకే భోజనాన్ని అందించారు. రోజుకు సగటున 2.50 లక్షల మందికి అల్పాహారం, భోజనం అందించేవారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్న క్యాంటీన్లు మూతపడ్డాయి. అధికారం చేపట్టిన వెంటనే వీటిని పునరుద్ధరిస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఈ మేరకు నాలుగో సంతకాన్ని అన్నా క్యాంటీన్ల ఫైల్ పై చంద్రబాబు పెట్టనున్నారు.

యువతలో నైపుణ్యాభివృద్ధి పెంచేందుకు సంబంధించిన ఫైల్ పై కూడా చంద్రబాబు సంతకం. యువత ఉన్నత విద్యను అభ్యసించినా.. దానికి తగ్గట్టు ఉద్యోగాలు రాకపోవడానికి ప్రధాన కారణం తగిన నైపుణ్యం లేకపోవడమే. అందుకే యువతలో నైపుణ్యాభివృద్ధికి చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు నైపుణ్య కేంద్రాల ఏర్పాటుకు సంబంధించిన ఫైల్ పై చంద్రబాబు సంతకం చేస్తారు. ఒక విధంగా చెప్పాలంటే ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన ప్రధాన హామీలకు ఈ ఐదు సంతకాలతో మోక్షం కలగనుంది.