Pothina Mahesh: జనసేన ( janasena )ఆవిర్భావం నుంచి చాలామంది నేతలు బలంగా కనిపించారు. పార్టీ బలోపేతానికి గట్టిగానే కృషి చేశారు. కానీ గత ఎన్నికల్లో చాలామందికి టిక్కెట్లు దక్కలేదు. దీంతో వారు వేరే పార్టీలో చేరిపోయారు. వివిధ పార్టీల నుంచి వచ్చిన వారికి పవన్ కళ్యాణ్ ప్రాధాన్యం ఇవ్వడం.. కీలక నియోజకవర్గాలు పొత్తులో భాగంగా మిగతా రెండు పార్టీలకు వెళ్లడం.. తదితర కారణాలతో చాలామంది పార్టీకి గుడ్ బై చెప్పారు. అటువంటి వారిలో పోతిన మహేష్ ఒకరు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించారు పోతిన మహేష్. దక్కకపోయేసరికి ఎన్నికలకు ముందు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే ఈ ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడంతో ఆయనకు ఎటువంటి ప్రాధాన్యం లేకుండా పోయింది.
* గత కొంతకాలంగా సైలెంట్
ప్రస్తుతం పోతిన మహేష్( pothina Mahesh ) సైలెంట్ గా ఉన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా కనిపించడం లేదు. జనసేనలో ఆయనకు ఎనలేని ప్రాధాన్యం ఉండేది. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అని భావించి ఆయన ఆ పార్టీలో చేరిపోయారు. కానీ గత ఐదేళ్లుగా ఆర్థిక ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఆర్థిక ఇబ్బందులు పడక తప్పదని భావిస్తున్నారు. అందుకే ఆయన తిరిగి జనసేనలో చేరతారని ప్రచారం నడుస్తోంది. అయితే జనసేన నాయకత్వంపై బలమైన ఆరోపణలు, విమర్శలు చేయడంతో నాయకత్వం నుంచి చాలా రకాల అభ్యంతరాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు మహేష్ బీజేపీలోకి వెళ్తారని బలమైన ప్రచారం నడుస్తోంది.
* పొత్తులో భాగంగా బిజెపికి
నిన్నటి ఎన్నికల్లో పొత్తులో భాగంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం( Vijayawada West constitution ) బిజెపికి కేటాయించారు. బిజెపి తరఫున సుజనా చౌదరి పోటీ చేశారు. భారీ మెజారిటీతో గెలిచారు. ఈ నియోజకవర్గాన్ని పదిల పరుచుకునేందుకు సుజనా చౌదరి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే నియోజకవర్గంలో పట్టున్న నేతగా గుర్తింపు తెచ్చుకున్న మహేష్ ను బిజెపి లోకి తెచ్చేందుకు సుజనా చౌదరి ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు సమాచారం. త్వరలో సుజనా చౌదరి బిజెపి రాష్ట్ర అధ్యక్ష పదవి తీసుకుంటారని.. అందులో భాగంగా పోతిన మహేష్ ను పార్టీలో చేర్చుకొని.. నియోజకవర్గంలో క్రియాశీలక బాధ్యతలు అప్పగిస్తారని తెలుస్తోంది.
* జనసేన ఎలా స్పందిస్తుందో..
అయితే పోతిన మహేష్ జనసేన నాయకత్వం పై తీవ్ర విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ పై ( Pawan Kalyan)వ్యక్తిగత విమర్శలకు సైతం దిగారు. ఆయన విషయంలో జనసైనికులు సైతం తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. గతంలో ఇదే పోతిన మహేష్ 2019 ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఎన్నికల అనంతరం జనసేన బలోపేతానికి కృషి చేస్తూ వచ్చారు. కానీ జనసేన టికెట్ దక్కకపోయేసరికి తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. క్షణికావేశంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇప్పుడు బిజెపిలో చేరేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దీనిపై జనసేన ఎలా స్పందిస్తుందో చూడాలి.