Balineni Srinivas Reddy: బాలినేని శ్రీనివాస్ రెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పడం వెనుక అనేక రకాల అనుమానాలు ఉన్నాయి. అదే సమయంలో ఆయన జనసేనలో చేరడం కూడా ఓకింత హాట్ టాపిక్. ప్రత్యేక మిషన్ తోనే ఆయన జనసేనలో చేరారు అన్న కామెంట్స్ కూడా వినిపించాయి.ఇప్పుడు తాజాగా ఒంగోలు అసెంబ్లీకి కొత్త వైసిపి ఇన్చార్జ్ నియామకంతో ఈ అనుమానాలు మరింత బలపడుతున్నాయి. వైయస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి దగ్గర మనిషి బాలినేని. రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతోనే రాజకీయాల్లోకి వచ్చారు. విద్యార్థి నాయకుడిగా కాంగ్రెస్ పార్టీలో ప్రస్థానాన్ని ప్రారంభించి.. అనతి కాలంలోనే ఒంగోలు ఎమ్మెల్యే అయ్యారు బాలినేని. దీని వెనుక రాజశేఖర్ రెడ్డి ఉన్నారన్నది వాస్తవం. 1999, 2004, 2009 ఎన్నికల్లో గెలిచారు బాలినేని. రాజశేఖర్ రెడ్డి హయాంలో మంత్రిగా కూడా వ్యవహరించారు. రాజశేఖర్ రెడ్డి అకాల మరణంతో జగన్ వెంట నడిచారు. 2012 ఉప ఎన్నికల్లో ఓడిపోయారు. 2014లో సైతం ఓటమి ఎదురైంది. 2019లో బాలినేని గెలిచేసరికి మంత్రివర్గంలోకి తీసుకున్నారు జగన్. పునర్వ్యవస్థీకరణలో పదవి కోల్పోవడంతో తీవ్ర మనస్థాపానికి గురైన బాలినేని అప్పటినుంచి అసంతృప్తి స్వరాన్ని వినిపిస్తూ వచ్చారు. ఈ ఎన్నికల్లో ఇష్టంగానే పోటీ చేశారు. ఓడిపోయిన నాటి నుంచి సైలెంట్ అయ్యారు. అధినేత జగన్ కు అనేక రూపాల్లో అసంతృప్తిని వ్యక్తం చేశారు. చివరకు వైసీపీకి గుడ్ బై చెప్పి జనసేనలో చేరిపోయారు.
* అనేక రకాల అనుమానాలు
బాలినేని జనసేనలో చేరిక వెనుక అనేక రకాల అనుమానాలు ఉన్నాయి. పెద్ద ఎత్తున అభ్యంతరాలు కూడా వచ్చాయి. ఆయన వైసీపీ కోసమే జనసేన లోకి వచ్చారన్న ప్రచారం కూడా ఉంది. కూటమిలో విభేదాలు పుట్టించేందుకు ఆయన జనసేనలోకి వచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఎటువంటి ఆర్భాటం లేకుండా ఆయన చేరిక పూర్తయింది. అయితే ఇప్పుడు ఆయన స్థానంలో వైసీపీకి కొత్త ఇన్చార్జి వచ్చారు.. చండూరు రవి అనే వ్యక్తిని నియమించారు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా దామచర్ల జనార్దన్ ఉన్నారు. అన్నింటికీ మించి బలమైన క్యాడర్ తో బాలినేని శ్రీనివాస్ రెడ్డి సైతం జనసేన ఇన్చార్జిగా కొనసాగుతున్నారు. ఇటువంటి తరుణంలో ముక్కు ముఖం తెలియని వ్యక్తిని వైసీపీ ఇన్చార్జిగా నియమించడం విశేషం. ఈ నియామకం వెనుక బాలినేని ప్రయోజనం దాగి ఉందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.
* ఇప్పటికీ ఆయనే ఇంచార్జ్
ఇప్పటికీ వైసీపీ ఇన్చార్జిగా బాలినేనినే భావిస్తోందట అధిష్టానం.బాలినేని బలపడితే పార్టీ బలపడుతుందని భావిస్తోందట. అందుకే బాలినేనికి ఇబ్బంది లేకుండా చుండూరు రవి అనే సామాన్య నేతను వైసీపీ ఇన్చార్జిగా నియమించినట్లు ప్రచారం సాగుతోంది. వాస్తవానికి ఒంగోలు వైసిపి క్యాడర్ అంతా బాలినేని వెంట ఉంది. అలాగని వారంతా జనసేన అభిమానులు కాదు. ఆ పార్టీకి పనిచేయరు. అందుకే ఇప్పుడు బాలినేని బలహీనం చేయకుండా ఉంచేందుకు జగన్ రవి అనే కొత్త వ్యక్తిని రంగంలోకి దించినట్లు తెలుస్తోంది.