Print Media: ఒక పత్రికలో పని చేసే పాత్రికేయుడికి.. తన సంస్థ ఇచ్చిన డైరీ చాలా ముఖ్యం. వివిధ సమావేశాలకు వెళ్ళినప్పుడు ఆ డైరీ చేతిలో పట్టుకుంటే ఒక రకమైన రికగ్నైజేషన్. ఇక ఇప్పటికాలంలో డైరీ తో పాటు ఐడి కార్డు కూడా చాలా ముఖ్యం.. లేకపోతే చాలామంది జర్నలిస్టులమని చెప్పుకొని నానా హంగామా చేస్తున్నారు. అలాంటి వారిని నిరోధించాలంటే కచ్చితంగా ఐడి కార్డ్ చూపించాల్సిందే. లేకుంటే నగుబాటు తప్పదు. మాకు ఇంత సీనియారిటీ ఉందని చెప్పినప్పటికీ.. ఉపయోగముండదు.
ప్రస్తుతం ఆ మీడియా అధినేత జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఇటీవల ఆంధ్ర ప్రాంతంలో పూర్తయింది. ఇప్పుడు తెలంగాణలో మొదలుపెట్టారు. ఆయన నిర్వహిస్తున్న జిల్లాల సమావేశాలకు ఉద్యోగులు మొత్తం హాజరవుతున్నారు. సమావేశంలో ముఖ్యంగా ఎడిటోరియల్ సిబ్బందితోనే ఆ మీడియా అధినేత ఇంట్రాక్ట్ అవుతున్నారు. సాధారణంగా ఇలాంటి సమావేశంలో మీడియా అధినేత చెప్పే మాటలను సిబ్బంది కచ్చితంగా నోట్ చేసుకుంటారు. అయితే ఇక్కడ ఆ పత్రికకు సంబంధించిన అధికారిక డైరీలు ఆ ఉద్యోగుల చేతుల్లో కనిపించడం లేదు. ఒకరి చేతిలో అంటే మిస్ అవ్వచ్చు.. కానీ ఏ ఒక్క ఉద్యోగి చేతిలో పత్రికకు సంబంధించిన డైరీ కనిపించడం లేదు. ఇదేంటని ఆరా తీస్తే.. గత ఐదు సంవత్సరాలుగా డైరీలను ప్రచురించడం లేదట. ఖర్చు ఎక్కువవుతుందని భావించి ఆ పత్రిక యాజమాన్యం డైరీలను ప్రింట్ చేయించడం పూర్తిగా మానేసిందట. ఈ ఆలోచన ఆ యాజమాన్యానికి ఎవరు ఇచ్చారో గాని.. వారికి మాత్రం హాట్సాఫ్. వీరతాడు వేయాల్సిందే.. డైరీలు ప్రింట్ చేస్తే ఖర్చు పెరిగిపోతుందని భావించిన ఆ యాజమాన్యం.. ఇప్పుడు అదనంగా తన పత్రికలో ఒక పేజీని పెంచడం విశేషం. పైగా ఆ పత్రికాధిపతి జిల్లాల పర్యటనలో సర్కులేషన్ పెంచితే.. ఒక్కో ఉద్యోగికి 3000 వరకు వేతనంలో పెంపుదల ఉంటుందని ఆఫర్ ఇస్తున్నారు. నిజానికి డైరీ ప్రింట్ చేయడానికి భయపడే యాజమాన్యం.. ఒక పేజీని పెంచి.. సర్కులేషన్ అమాంతం పెరిగిపోవాలని ఆదేశాలు ఇవ్వడం నిజంగా హాస్యాస్పదమే.
అది ఒక కల్చర్
సాధారణంగా ప్రింట్ మీడియాలో ఐడి కార్డులు అంతగా ఉండవు. తెలుగులో మొదటి స్థానంలో ఉన్న ఓ పత్రిక, రెండవ స్థానంలో ఉన్న పత్రిక కచ్చితంగా తన ఉద్యోగులకు ఐడి కార్డులు ఇస్తుంది. కానీ ఈ పత్రిక మాత్రం ఇంతవరకు ఐడి కార్డులు (హైదరాబాదులో కూడా ఇదే పరిస్థితి) ఇవ్వలేదు. ఒకవేళ ఇచ్చినా అవి మందమైన పేపర్ మీద మాత్రమే ప్రింట్ చేసి ఇస్తారు. వాటిని లామినేషన్ చేసుకొని భద్రపరచుకోవాల్సిన బాధ్యత మాత్రం ఉద్యోగులదే. ఒకవేళ ఆ ఐడీ కార్డు పోతే ₹100 వసూలు చేస్తారు. ఐడి కార్డుల విషయంలోనే ఇంత పిసినారి వ్యవహార శైలి పాటిస్తున్న ఆ పత్రికా యజమాన్యం.. డైరీల విషయంలో అలా వ్యవహరించడం పెద్దగా హాస్యాస్పదం అనిపించదు.. “ఈ కాలంలో డైరీలు ఎవరు రాస్తున్నారు? ఏ డైరీ అయితే ఏంటి? నాలుగు ముక్కలు రాసుకోవడానికి.. అయినా నేటి కాలంలో వాట్సాప్ లోనే కదా అంతా నడుస్తోంది.. అలాంటప్పుడు ఈ డైరీలను ఎవరు మెయింటైన్ చేస్తున్నారు” అనే ప్రశ్నలు వేసేవారు కూడా ఉంటారు. కాకపోతే డైరీ అనేది పత్రికలో పనిచేస్తున్న ఉద్యోగికి వైల్డ్ కార్డు లాంటిది.. అది లేకపోతే ఆ పాత్రికేయుడికి గుర్తింపు ఉండదు.. దీనిని ఇప్పటికైనా ఆ పత్రికాధిపతి గుర్తుంచుకొని.. వచ్చే ఏడాది నుంచైనా కొత్త డైరీలు ఇవ్వాలని ఉద్యోగులు అంతర్గతంగా కోరుతున్నారు.